thiefs gang
-
పరిగి మున్సిపాలిటీ పరిధిలో దొంగల బీభత్సం
-
నిజామాబాద్: సినిమా రేంజ్లో పోలీసుల ఛేజింగ్.. దొంగలపై కాల్పులు
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో సోమవారం దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందల్వాయి మండలం జాతీయ రహదారిపై దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారు పారిపోతుండగా దొంగలపై కాల్పులు జరిపారు. వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కాపు కాశారు. ఈ క్రమంలో దొంగల ముఠా.. పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయింది. దీంతో, వారిని పట్టుకునేందుకు పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాగా, ఈ దొంగల ముఠా.. జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లోని కాపర్ వైర్లను దొంగలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. ఇది కూడా చదవండి: పెను విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి -
దడపుట్టిస్తున్న ‘పార్థీ గ్యాంగ్’.. సీమలో దొంగతనాలతో హల్చల్
పార్థీ గ్యాంగ్... చోరీల్లో ఆరితేరిన ముఠా. చోరీ చేయడంలోనూ...పోలీసుల నుంచి తప్పించుకోవడంలోనూ దిట్టలు. చోరీ సమయంలో అడ్డొస్తే అంతమొందించేందుకూ వెనుకాడని క్రూరులు. ఈ కరుడు గట్టిన దొంగల పేరు చెబితే పోలీసులకు సైతం చెమటలు పడతాయి. ఈ గ్యాంగ్ ఇప్పుడు జిల్లాలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పార్థీ గ్యాంగ్.. ఈ పేరు వింటేనే సామాన్యులకు హడల్. వీరి కన్ను పడితే ఎలాంటి భద్రత ఉన్నా ఇళ్లయినా లూఠీ కావాల్సిందే. చోరీలు ఈ గ్యాంగ్‌కు వెన్నతో పెట్టిన విద్య. తప్పించుకోవడంలోనూ వీరు ఆరితేరిపోయారు. దురదృష్టం వెంటాడి పోలీసులకు చిక్కినా ఇసుమంతైనా సమాచారం ఇవ్వరు. చోరీ సమయంలో అత్యంత క్రూరంగా వ్యవహరించే ఈ గ్యాంగ్ కదలికలు రాయలసీమలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా సంచరిస్తున్నట్టు సమాచారం అందింది. తాజాగా గుంతకల్లు దగ్గర జరిగిన రైలు దోపిడీలోనూ వీరి పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాద్, మధ్యప్రదేశ్‌లోని పాసే పార్థీ తెగకు చెందిన వారు. బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థానికంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద గుడారాలు వేసుకుంటారు. అదును చూసి చోరీలకు తెగబడతారు. ప్రధానంగా నగర శివారు ప్రాంతాలపైనే వీరి కన్ను. వ్యాపారుల అవతారమెత్తి రెక్కీ నిర్వహించి మరీ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడతారు. ఈ నెల 20న పార్థీ గ్యాంగ్ సభ్యుడితో పాటు అరెస్టయిన మరో ఇద్దరు దొంగలు అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, కదిరి, హిందూపురం ప్రాంతాలతో పాటు కర్నూలు, చిత్తూరులోని కొన్ని ప్రాంతాలలో పూసలు, దుప్పట్లు, గృహాలంకరణకు వినియోగించే మట్టి బొమ్మలు అమ్మే వ్యాపారుల్లా పార్థీ గ్యాంగ్ సభ్యులు అవతారమెత్తుతారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడతారు. అడ్డొస్తే ప్రాణాలను సైతం తీస్తారు. ఇంత క్రూపమైన పార్థీ గ్యాంగ్‌కు ఓ మహిళ డాన్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా అనంతపురం జిల్లా కేంద్రంలో పార్థీ గ్యాంగ్‌కు సంబంధించిన ఓ ముఠా సభ్యులు పట్టుబడటం చర్చనీయాంశమైంది. ఈ పార్థీ గ్యాంగ్ ఎక్కడ చోరీలకు పాల్పడినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎక్కడా వారి ఆనవాళ్లు లేకుండా చూసుకుంటుంది. సెల్ఫోన్లను సైతం నేర ప్రాంతానికి సుమారు 30 కిలో మీటర్ల దూరంలోనే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ గ్యాంగ్‌లు ఎక్కడ దోపిడీకి పాల్పడినా వారి గ్రామాలకు చేరుకోకమునుపే పోలీసులు పట్టుకోవాలి. లేదంటే దోచుకున్న సొత్తులో పైసా కూడా రికవరీ చేయలేరు. కారణం దోచుకున్న సొమ్మలో 30 శాతం ఆదాయాన్ని గ్రామాల అభివృద్ధి కోసం పెద్దలకు ఇస్తారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు వీరికి బాసటగా నిలుస్తారు. మధ్యప్రదేశ్‌లో స్థానిక రాజకీయ పార్టీల నేతలతో సంబంధాలున్నాయి. సాంకేతికత పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దొంగలు, అనుమానితులు, తీవ్ర నేరాల్లో పాలుపంచుకున్న వారి వివరాలను పోలీసులు అప్పట్లో చేతి వేలి ముద్రలు, కాలి ముద్రలు తీసి ఉంచారు. ఈ ఆధారాలే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. అనంతపురంలో పట్టుబడ్డ పార్థీ గ్యాంగ్ సభ్యుడు కూడా పాత పోలీసులు సేకరించిన చేతి వేలిముద్రల ఆధారంగానే దొరికాడు. వేలిముద్రలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకొచ్చాం. అనుమానితుల చేతి వేలిముద్రలు మొబైల్లో తీసుకుని, ఇంటిగ్రేట్ చేసిన వాటితో సరిపోల్చుతాం. పార్థీ గ్యాంగ్‌లు వేసవిలో ఎక్కువగా తిరుగుతుంటాయి. రైళ్లలో దోపిడీలు కూడా చేస్తుంటాయి. వీటిపైనా నిఘా ఉంచాం. లాక్ చేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడతాయి. ఎవరైనా ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేసి వెళితే పోలీసులకు సమాచారమందిస్తే నిఘా పెడతాం. ఇప్పటికే రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల ఎస్పీలనూ అప్రమత్తం చేశారు. – ఎం.రవికృష్ణ, డీఐజీ, అనంతపురం రేంజ్ -
పోలీసులకే టోకరా.. వాష్‌రూమ్ వెళ్తానని చెప్పి..
సాక్షి, వికారాబాద్: దొంగల ముఠాలోని ఒక సభ్యుడు ఏకంగా పోలీసులనే మోసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. వారిలో ప్రధాన నిందితుడు మహమ్మద్ వాష్‌రూమ్‌కు వెళ్లాలని పోలీసులను కోరాడు. దీంతో వారు.. అతడిని వదిలిపెట్టారు. ఎంత సమయం గడిచిన నిందితుడు రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి వెళ్లి చూశారు. అక్కడ నిందితుడు లేడు. దీంతో షాకైన పోలీసులు.. తప్పించుకున్న నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు.. -
ఈ దోపిడీ మరో ‘దృశ్యం’
సాక్షి, హైదరాబాద్: అదో ‘గ్రేట్ ఫోన్ డెకాయిటీ’... పదులు కాదు వందలు కాదు ఏకంగా 13,920 సెల్ఫోన్లు దుండగుల పాలయ్యాయి... కేవలం ఈ నేరమే కాదు కేసు దర్యాప్తు సైతం ఓ రికార్డే...చెన్నై కేంద్రంగా చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో హైదరాబాద్‌తో లింకులు బయటపడ్డాయి. అక్కడ తస్కరణకు గురైన ఫోన్లలో వెయ్యి సిటీలోని ఓ వ్యాపారి వద్దకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ నేపథ్యంలోనే నలుగురు అధికారులతో కూడిన టీమ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే వారికి వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ఆ బృందం తిరిగి వెళ్ళింది. అతడి కోసం గాలింపు కొనసాగించాలని నిర్ణయించింది. చెన్నై శివార్లలోని ఫ్లెక్స్‌ట్రానిక్స్ ఫెసిలిటీ సంస్థలో తయారైన 13,920 సెల్ఫోన్లను మహారాష్ట్ర పంపడానికి ఓ కంటైనర్‌లో లోడ్ చేశారు. రూ.15 కోట్ల విలువైన సెల్ఫోన్లతో కూడిన కంటైనర్‌ను తీసుకుని అక్టోబర్ 20న లారీ బయలుదేరింది. తమిళనాడులోని హోసూర్ సమీపంలో ఉన్న షోలాగిరి ప్రాంతానికి ఈ ట్రక్ అక్టోబర్ 21న చేరుకుంది. అక్కడ దీన్ని అడ్డగించిన దుండగులు డ్రైవర్ సతీష్ కుమార్ షా, సహాయకుడు అరుణ్‌పై దాడి చేసి ట్రక్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం మరో లారీలోకి మార్చుకున్నారు.బాధిత డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు షోలాగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన సెల్ఫోన్లతో కూడిన లారీని బందిపోటు దొంగలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు తీసుకువెళ్ళారు. ఈ కేసును ఛేదించడానికి చెన్నై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు ఉన్నతాధికారులు, 32 మంది పోలీసులతో కూడిన సిట్ దాదాపు 40 రోజుల పాటు దర్యాప్తు చేసింది. అందులో భాగంగా సిట్ అధికారులు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించగలిగారు. చోరీ సెల్ఫోన్లతో కూడిన బందిపోట్ల లారీ తమిళనాడు నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా మధ్యప్రదేశ్ చేరిందని తేల్చారు. హోసూర్, బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్, ఆదిలాబాద్ రూట్లో వెళ్ళింది. షోలాగిరి నుంచి దాదాపు 1400 కిమీ ప్రయాణించిన ఈ లారీ 33 టోల్గేట్లను దాటింది. మార్గ మధ్యంలో 30 సార్లు నెంబర్ ప్లేట్లు మార్చినట్లు గుర్తించారు. ప్రతి ప్లాజా తర్వాత ఓ ప్లేట్ మారుస్తూ పోయారు. లారీ ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తోందో ఆ రాష్ట్రానికే చెందిన నకిలీ నెంబర్ ప్లేట్లు ముందే సిద్ధం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నేరం జరిగిన నాటి నుంచి కొన్ని రోజుల వ్యవధిలో చెన్నై, ఇండోర్ల్లో జరిగిన హవాలా లావీదేవీలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 28–30 తేదీల్లో దుబాయ్ కేంద్రంగా మాఫియా కార్యకలాపాలు నడుపుతున్న అబ్బాస్ ఇండోర్‌కు రూ.6 కోట్లు పంపినట్లు తేలింది. ఈ ఆధారంతో ముందుకు వెళ్ళిన సిట్ అధికారులు ఈ గ్యాంగ్ లీడర్ రాజన్ చౌహాన్‌ను అక్టోబర్ 26న పట్టుకున్నారు. ఇతడి విచారణలోనే మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అబ్బాస్‌కు ఆ సెల్ఫోన్లను రూ.6.5 కోట్లకు విక్రయించినట్లు అంగీకరించాడు. బందిపోటు దొంగలు లారీ నుంచి సెల్ఫోన్లను ఇండోర్‌లోని ఓ గోదాములోకి మార్చారు. అక్కడ వెయ్యి ఫోన్ల చొప్పున ప్యాక్ చేసి ఎయిర్ కార్గో ద్వారా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి సహా 14 నగరాలకు పంపారు. అక్కడి ముఠా ఈ సెల్ఫోన్లను మరో లారీలో ఎక్కించుకుని రోడ్డు మార్గంలో త్రిపుర రాజధాని అగర్తలకు తీసుకువెళ్ళి మరో టీమ్‌కు అప్పగించారు. వాళ్ళు ఆ సెల్ఫోన్లను దేశ సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్ చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అబ్బాస్ మనుషులు సెల్ఫోన్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ బందిపోటు దొంగతనంలో అబ్బాస్, రాజన్ చౌహాన్‌లతో పాటు 19 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వీరిలో కేవలం 10 మందిని పట్టుకున్న సిట్ చోరీకి గురైన 13,920 ఫోన్లలో ఏడు మాత్రమే రికవరీ చేయగలిగింది. ముఠాకు సహకరించిన హైదరాబాదీ కోసం సిట్ వేటాడుతూ ఇక్కడకు వచ్చింది. ముఠా సభ్యుల అరెస్టు విషయం తెలిసిన అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని తెలియడంతో తిరిగి వెళ్ళింది. ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉండటాడు? అనే అంశాలను సిట్ అధికారులు పూర్తి గోప్యంగా ఉంచారు. -
దోపిడీ దొంగల బీభత్సం
సాక్షి, మామడ(నిర్మల్): మండలంలోని దిమ్మదుర్తి, మామడ గ్రామాలలో ఆదివారం రాత్రి దొంగలు చోరికి పాల్పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాలే లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. మండలంలో ఒక్కసారిగా రెండు గ్రామాలలోని అయిదు దుకాణాలలో దొంగలు చోరికి యత్నించడం స్థానికంగా సంచలనం కలిగించింది. మామడ మండల కేంద్రంలో ప్రధాన రొడ్డుకు దగ్గరలో ఉన్న భూలక్ష్మి ఏజెన్సీస్ షెటర్‌ను పగుల గొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు కౌంటర్లో ఉన్న రూ. 9వేల రూపాయలను ఎత్తుకెళ్లారు. మండల కేంద్రంలోని పూలాజి డ్రెసెస్ క్లాథ్ మర్చెంట్లో చోరి చేసెందుకు షెటర్‌ను పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. సంఘటన స్థలాన్ని సోమవారం సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై అనూష, ఫింగర్ ప్రింట్ క్లూస్ టీం పరిశీలించి కేసు నమోదు చేశారు. దిమ్మదుర్తి గ్రామంలో బస్టాండ్ సమీపంలో గల దుకాణాల్లో చోరీకి యత్నించారు. దుకాణాల సెట్టర్లను పగులగొట్టి చోరి చేసెందుకు లోపల యత్నించారు. పోలీస్‌లు పెట్రోలింగ్ చేసినప్పటికీ.. ఆదివారం అర్దరాత్రి వరకు మండల కేంద్రంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. దుకాణాలలో దొంగతనం ఉదయం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుకాణాలలలో కౌంటర్లను మాత్రమే పగులకొట్టి డబ్బులను తీసుకెళ్లారు. మిగితా సామగ్రిని దొంగలు ముట్టక పోవడంతో పక్కా ప్రణాళికతో దొంగతనం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాలు అమర్చుకుని ఉంటే.. దుకాణాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకుని ఉంటే దుకాణాలలో చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకోవడం పోలీసులకు సులభమయ్యేది. దుకాణాల వద్ద సీసీ కెమెరాలను నిర్వహకులు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులు, డబ్బులు దుకాణాలలో ఉంచరాదని ఎస్సై అనూష పేర్కొన్నారు. -
నెల్లూరులో హర్యానా దొంగల ముఠా అరెస్టు
సాక్షి, నెల్లూరు : ఏటీఎమ్ సెంటర్లలో వృద్ధులను ఏమార్చి స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా క్లోనింగ్‌కు పాల్పడిన ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు సుమారు 14 రాష్ట్రాలలో వెయ్యికి పైగా నేరాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సందీప్ కుమార్, మంజీత్, దయానంద్‌లు హర్యానా రాష్ట్రానికి చెందిన వారని, ఇప్పటికే వీరిపై 49పైగా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో నేరాలకు పాల్పడినట్లు నిందితులు ఆంగీకరించారని, వారి నుంచి రూ. 7.5 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్ టాప్, నకిలీ ఏటీఎమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు. -
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం, ఉండ్రాజవరం, రాజమండ్రి, భీమవరం, ఉండి, బొమ్మూరు, తడికలపూడి, ద్వారకా తిరుమల, దెందులూరు, గణపవరం, భీమవరం రూరల్ పోలీసు స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడ్డారు. వీరి నుంచి 190 గ్రాముల బంగారు ఆభరణాలు, 35 గ్రాముల వెండి, రెండు బైక్‌లు, 20 మేలు జాతి కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. 13,33,700 రూపాయల చోరీ సొత్తును పోలీసులు రీకవరీ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పశువుల చోరీ ముఠా అరెస్టు
సాక్షి, నందిగామ: పలు ప్రాంతాల్లో పశువులను అపహరిస్తున్న ఓ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వివరించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఓంనాబాద్ తాలుకా చుడుగుప్ప గ్రామానికి చెందిన మహమ్మద్ హస్మత్ అలియాస్ హస్మత్, మమమ్మద్ ఇలియాస్ ఖురేషీ అన్నదమ్ముళ్లు. వీరు రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని షైక్ ఇ మజీద్ సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి అదే ప్రాంతానికి చెందిన ఫెరోజ్ ఖాన్, అమీర్ ఖురేషీ పరిచయం అయ్యారు. వీరు నలుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి పశువులను దొంగిలించడం వృత్తిగా మార్చుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని గ్రామాలకు వెలుపల పశువుల పాకల నుంచి రాత్రి సమయాల్లో పశువులను అపహరించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. అయితే, మండల పరిధిలోని రంగాపూర్‌కు చెందిన శివగల్ల రాములు చెందిన రెండు ఎద్దులను గత జనవరి 18న గుర్తు తెలియని వ్యక్తులు అపహారించుకు పోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మేకగూడ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ నలుగురు దొంగలు ఓ వాహనంలో వెళ్తున్నారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకొని విచారించగా పశువుల చోరీ వివరాలు తెలిపారు. వీరి వద్దనుంచి రూ.3.75 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు, మహీంద్రా గ్జైలో కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివిధ ఠాణాల్లో అన్నపై 52, తమ్ముడిపై 42 కేసులు మహ్మద్ హస్మత్‌పై పలు పోలీస్స్టేషన్లలో 52 కేసులు నమోదు అయ్యాయని, అతడి సోదరుడు మహ్మద్ ఇలియాస్‌పై 42 కేసులు నమోదు అయ్యాయని ఏసీపీ సురేందర్ తెలిపారు. వీరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు సైతం జారీ అయినట్లు వివరించారు. నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి వీరు తమ వాహనంలోని మధ్య, వెనుకాల సీట్లు తొలగించి అందులో పశువులను తరలిస్తారని వెల్లడించారు. వీరిపై ఎల్బీనగర్, మీర్‌పేట, రాజేంద్రనగర్, చందానగర్, పటాన్చెరు, షాబాద్, శంకర్పల్లి, నార్సింగి, శంషాబాద్ తదితర ఠాణాల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కేసును చేధించిన షాద్‌నగర్ రూరల్ సీఐ రామకృష్ణ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా ఏసీపీ సురేందర్ ప్రత్యేకంగా అబినందించారు. వీరికి రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
రాజమహేంద్రవరం క్రైం: వృద్ధ దంపతులను చంపుతామని బెదిరించి వారి నుంచి బంగారు నగలు, నగదు చోరీ చేసిన కేసులో ముగ్గురి నిందితులను రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాజమహేంద్రవరం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ వైవీ రమణ కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కడియపు లంక గ్రామ శివారు, నేషనల్ హైవే రోడ్డు గంగుమళ్ల సత్యనారాయణ నర్సరీ ఎదురుగా ఉన్న శ్రీ సత్యభవానీ ఆంధ్ర భోజన హోటల్ నిర్వాహకులు వృద్ధ దంపతులైన పెనుమాక సత్యనారాయణమ్మ, ఆమె భర్త నాగేశ్వరరావుకు చెందిన ఇంట్లోకి ప్రవేశించి కత్తి చూపించి చంపుతామని బెదిరించి సత్యనారాయణమ్మ వద్ద ఉన్న బంగారు నగలు, రూ.49 వేల నగదు చోరీ చేశారని తెలిపారు. ఈ సంఘటన పై కడియం పోలీస్ స్టేషన్లో ఈ నెల 12వ తేదీన కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా సూపరింటెండెంట్ షిమూషీ బాజ్‌పేయ్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ డీఎస్పీ సీహెచ్ విజయ భాస్కరరావు ఆధ్వర్యంలో కడియం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బీవీ సుబ్బారావు వారి సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఈనెల 15వ తేదీన కడియం ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది కడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకినాడ కెనాల్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కేశవరం వైపు నుంచి కడియం వైపునకు మోటారు సైకిల్ పై వస్తున్న ముగ్గురు నిందితులను తనిఖీలు చేయగా వారు పారిపోవడానికి ప్రయత్నించారని వివరించారు. కడియం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది నిందితులైన యానాంకు చెందిన కాలే మాణిక్యాలరావు, పాలెపు సురేష్, గంగాబత్తుల దుర్గబాబు లను అరెస్ట్ చేశారన్నారు. ఈ ముగ్గురూ వ్యసనాలకు బానిసలై దేవాలయాల్లోని హుండీల్లో నగదు చోరీ చేస్తుంటారని వివరించారు. ఇప్పటి వరకు వీరిపై కేసులు లేవని తెలిపారు. నిందితుల నుంచి రెండున్నర కాసుల బంగారు గొలుసు, అరకాసు లక్ష్మీదేవి ఉన్న బంగారు ఉంగరం, అరకాసు బంగారు చెవి దిద్దులు, ఒక సెల్ ఫోన్, రూ.29 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. రెక్కీ నిర్వహించి చోరీ నిందితులు వారం రోజులు ముందుగా అదే హోటల్లో మద్యం సేవించి చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించినట్టు అడిషనల్ ఎస్పీ వై.వి.రమణ కుమార్ తెలిపారు. వృద్ధ దంపతులు ఒక్కరే ఉండడంతో చోరీ చేయడం సులువని గ్రహించి నిందితులు ఈ నెల 11న దంపతులను కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు చోరీ చేసి పరారయ్యారని తెలిపారు. చోరీ అనంతరం కాకినాడ తదితర ప్రాంతాల్లో వీరు తిరిగారని వివరించారు. నాలుగు రోజుల్లోనే నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి నగలు, నగదు రికవరీ చేసిన పోలీస్ సిబ్బందికి అవార్డులకు సిఫారసు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌత్ జోన్ డీఎస్పీ సీహెచ్ విజయ భాస్కరరావు, కడియం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బీవీ సుబ్బారావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
10 మంది ఘరానా దొంగల అరెస్ట్
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసిన ఘరానా దొంగలను అరెస్ట్ చేశామని ద్వారకాజోన్ క్రైం సీఐ వి.బాబ్జీరావు వెల్లడించారు. ఈ మేరకు పెదవాల్తేరులోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ♦ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన అంతర్రాష్ట్ర ముఠాలోని ఒక దొంగను అరెస్టు చేశామన్నారు. ఒడిశా కాశీనగర్‌కి చెందిన దొంగ నుంచి 16 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ♦ ఆంధ్రా యూనివర్సిటీ ఎస్వీ హాస్టల్లో ఉంటున్న ఎం.జగదీష్‌బాబుకి చెందిన రూ.25వేల విలువ గల ల్యాప్‌ట్యాప్ చోరీ చేసిన రామ్‌నగర్‌కు చెందిన సోమాదుల మణికంఠ (25), జైలురోడ్డు గొల్లలపాలెం నివాసి కొరుపోల మహేష్ (25)లను అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ♦ ఏటీఎం కార్డు దొంగలించి నగదు విత్‌డ్రా చేసిన కేసులో రామ్‌నగర్‌లో నివసిస్తున్న బొబ్బిలికి చెందిన యల్లా పార్వతి (20)ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈమె ఎండాడకు చెందిన సంబాగి శివరామ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న బాంబే గ్యాస్‌లైట్ స్టోర్స్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుంది. ఈమెకి శివరామ్ తన ఏటీఎం కార్డు ఇచ్చి నగదు డిపాజిట్, విత్‌డ్రా వంటి పనులు కూడా చేయించేవారు. ఈ నేపథ్యంలో శివరామ్ ఏటీఎం కార్డును పార్వతి దొంగలించి రూ.68,500 విత్‌డ్రా చేసి పరారైపోయింది. దీనిపై కేసు నమోదు చేసి పార్వతి నుంచి రూ.68వేలు రికవరీ చేశామని సీఐ తెలిపారు. ♦ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి డీఆర్ఎం కార్యాలయానికి ఆటోలో వెళ్తున్న శ్రీకాకుళం జిల్లా గొల్లలవలసకు చెందిన దేర్గాశి సంతోష్‌కుమార్ (31) పర్సులోని రూ.68వేలు అపహరించిన కొబ్బరితోటకు చెందిన అలమండ రాంబాబు (36), కరణం మణికంఠ (26), సూర్యాబాగ్‌కి చెందిన దొడ్డి శరత్ (40), కంచరపాలెంకి చెందిన బసవబోయిన వెంకటరావు (30)ని అరెస్టు చేసి రూ.58వేలు నగదు రివకరీ చేశామని తెలిపారు. ♦ పెదవాల్తేరు ఆదర్శనగర్‌కి చెందిన కడియాల రఘురాం (24)ని అరెస్టు చేసి రూ.1.40లక్షల విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు రికవరీ చేశామన్నారు. మొత్తం 10 మందిని అరెస్టు చేసి రూ.20లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎంవీపీ క్రైం ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ ఎ.అప్పారావు, హెచ్‌సీ టి.తులసీభాస్కర్, కానిస్టేబుళ్లు పి.నరేష్కుమార్, బి.నారాయణ, బీవీఆర్ నాగభూషణం, పీడీవీ ప్రసాద్‌లను అధికారులు అభినందించారు. సమావేశంలో త్రీటౌన్ క్రైం సీఐ ఎస్.శంకరరావు, టూ టౌన్ క్రైం ఎస్ఐ వెంకటభాస్కరరావు, ఎస్ఐ శ్యామ్‌సుందర్, తదితరులు పాల్గొన్నారు. -
దొంగల కుటుంబం
చిత్తూరు, తిరుపతి క్రైం : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు వద్ద దారిదోపిడీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు 60, 51,400 రూపాయల విలువగల బంగారు, డైమండ్, వెండి ఆభరణాలను తిరుపతి సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి క్రైం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్.రవిశంకర్‌రెడ్డి కథనం...ఈనెల 7న కోయంబత్తూరు వద్ద దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. 1965.530 గ్రాముల బంగారు, 15.140 గ్రాముల డైమండ్ నగలు, 248.200 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకున్నారు. తమిళనాడులో దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో, గురువారం తెల్లవారుజామున తిరుపతి టీటీడీ శ్రీకోదండరామస్వామి ధర్మశాల 3వ సత్రం ఎదురుగా ఉన్న రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా తచ్ఛాడుతున్న ఒక మహిళ, యువకుడిని తిరుపతి సీసీఎస్ ఇన్స్పెక్టర్ సి.భాస్కర్‌రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారిద్దరూ తల్లీకొడుకులని, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పంజన్ తంగాళ్ రోడ్డు, జీఆర్ నగర్‌కు చెందిన రసూల్ భార్య షమా(46), ఆమె కుమారుడు మహమ్మద్ సలీం(29) అని తేలింది. అంతేకాకుండా వారి వద్ద నున్న నల్లటి బ్యాగులను తెరచి పరిశీలించగా లక్షల విలువ చేసే బంగారు, డైమండ్, వెండి నగలు ఉండటంతో విస్తుపోయారు! వీళ్లు ఘరానా దొంగలనే కోణంలో విచారణ చేసేసరికి దోపిడీ వ్యవహారం బట్టబయలైంది. షమా ఇద్దరు కుమారులు మహ్మద్ సలీం, ఫైరోజ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వారిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదైనట్టు గుర్తించారు. షమా తన చిన్నకుమారుడు, తన స్నేహితులతో కలసి కోయంబత్తూరులో దోపిడీకి పాల్పడి ఈ నగలు కాజేసినట్టు వెల్లడైంది. ఈ నగలు ఇంటి వద్ద దాచి ఉంచినపక్షంలో తమిళనాడు పోలీసులు గుర్తించి పట్టుకుంటారనే ఉద్దేశంతో తన పెద్దకొడుకుతో కలిసి రెండుమూడు రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రదేశాలలో ఉంటున్నట్టు షమా నోరువిప్పింది. ఈ నగలను తిరుపతిలో విక్రయించి వెళ్లాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. దోపిడీ ఘటన సమాచారాన్ని కోయంబత్తూరు జిల్లా కేజీ చావిడి పోలీసు స్టేషన్‌కు తిరుపతి పోలీసులు చేరవేశారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వివిధ చోట్ల దోపిడీ చేసిన∙సొత్తును బాధితులకు అప్పగించనున్నట్టు డీఎస్పీ ఆర్.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐలు భాస్కర్‌రెడ్డి, కె.శరత్చంద్ర, టి.అబ్బన్న, ఎస్ఐ డి.రమేష్ బాబు, హెడ్‌కానిస్టేబుల్ రాజేంద్ర, ఆర్.పద్మావతి, కానిస్టేబుళ్లు భగవతి ప్రసాద్, బారుసా, రవికుమార్, రెడ్డెమ్మను తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. వీరికి రివార్డులను సిఫారసు చేశారు. -
దొంగలు దొరికారు..
ప్రాంతమేదైనా పక్కా స్కెచ్‌తో వెళతారు. దొరికిన కాడికి దోచేస్తారు. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలోనే వీళ్లు చోరీలకు పాల్పడ్డారు. ఓ పక్క పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నా.. వీరి ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. ఒక్కొక్కరిపై 20 నుంచి 30కి పైగా కేసులున్నా.. వారు మాత్రం చోరీల బాటను వీడడం లేదు. తాజాగా మరోసారి పోలీసులకు చిక్కారు. ఈ సారి రాజానగరం పోలీసులు వారిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సామగ్రిని స్వాధీనపరచుకున్నారు. తూర్పుగోదావరి, రాజానగరం: తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను అపహరించుకుపోతున్న ఇద్దరు నేరగాళ్లకు, ఆ దొంగ సొత్తును కొనుగోలు చేస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్న వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి, కోర్డుకు హాజరు పరిచారు. నిందితుల నుంచి రూ.6.50 లక్షలు విలువజేసే 17 కాసుల బంగారు, 350 గ్రాముల వెండి నగలు, నాలుగు ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీలు, ఒక గ్యాస్ సిలిండర్, సెల్‌ఫోన్, ఇన్వర్టర్, రెండు హోమ్ థియేటర్లతో పాటు రూ.పది వేల నగదును స్వాధీనపర్చుకున్నామని రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజు సోమవారం తెలిపారు. రాజానగరం, కోరుకొండ పోలీసు స్టేషన్ల పరిధిలోని కోలమూరు, కొంతమూరు, మధురపూడిలోని గత ఆగస్టులో వరుసగా ఏడు గృహాల్లో జరిగిన చోరీలపై చేపట్టిన దర్యాప్తులో కొంతమూరులోని సంతోష్‌నగర్‌కి చెందిన మోర్త వెంకటేష్, కలమాటి మధుశ్రీనులతోపాటు రాజమహేంద్రవరం సీటీఆర్ఐ సమీపంలోని పనసచెట్టు సెంటర్‌కు చెందిన వాకాడ జనార్దనరావులను అరెస్టు చేశారు. గతంలోనూ వీరిపై కేసులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్కెట్ చేసుకుని దొంగతానాలు చేయడం వీరికి అలవాటు. మోర్త వెంకటేష్‌పై 38 కేసులు, కలమాటి మధుశ్రీనుపై 23 కేసులు, వారికి సహకరించిన వ్యాపారి వాకాడ జనార్దనరావుపై 23 కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి తిరిగి నేరాలు ప్రారంభించారు. చాకచక్యంగా వ్యవహరించిన రాజానగరం పోలీసులు నిందితులను ఆదివారం పట్టుకున్నారు. చోరీల్లో వారు చేజిక్కించుకున్న ఏటీఎం కార్డును రాజమహేంద్రవరంలోని ఒక వస్త్ర దుకాణంలో వినియోగించడం ద్వారా పట్టుబడ్డారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చురుకైన పాత్ర వహించిన రాజానగరం సీఐ సురేష్‌బాబు, కానిస్టేబుల్స్ ఎ.సుబ్రహ్మణ్యం, బీఎన్ఎస్ ప్రసాద్, కె. శ్రీధర్‌లను అభినందించడంతోపాటు రివార్డుకు సిఫారసు చేస్తానన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని డీఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాల్లే బాగా ఉపయోగించుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో సీఐ సురేష్‌బాబు పాల్గొన్నారు. -
అరడజను దొంగలు.. అంతా దాయాదులు!
కర్నూలు ,కృష్ణగిరి: జాతీయ రహదారులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు అంతర్ రాష్ట్ర ముఠాను కృష్ణగిరి పోలీసులు ఎరుకల చెర్వు క్రాస్ రోడ్డు వలపన్ని పట్టుకున్నారు. డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా వారిని సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్‌కు చెందిన నీలి షికారీ శాలు అలియాస్ షారుక్‌ఖాన్, లవ్లీ , జెమిని అలియాస్ నాయుడు, రాయిరెడ్డి, కోడుమూరు మండలం అనుగొండకు చెందిన రాజు, కోసిగి మండలం సాతనూరుకు చెందిన లస్సీ అలియాస్ పాండు ముఠాగా ఏర్పడ్డారు. వీరు జాతీయ రహదారుల్లో లారీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేస్తున్నారు. వీరిపై ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో 25 చోరీ కేసులు, మూడు మర్డర్ కేసులు, రెండు రాబరి కేసులు ఉన్నాయి. ఈ ముఠాకు నీలి షికారీ రాజు నాయకత్వం వహించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా ఈ ముఠాలోని సభ్యులందరూ దాయాదులే కావడం విశేషం. ఎలా దొరికారు అంటే.. గత రెండు నెలలుగా ఈ దొంగల ముఠా జాతీయ రహదారులతో పాటు గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈయేడాది అక్టోబర్ 18న నల్గొండ జిల్లాకు చెందిన పవన్‌కమార్ అనే వ్యక్తి అమకతాడు టోల్గేట్ సమీపాన ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఇతని బైక్ చోరీకి గురైంది. నవంబర్ 2న బాధితుడి ఫిర్యాదు మేరకు స్థానిక స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనికితోడు టోల్గేట్ వద్ద రాత్రి వేళల్లో ఆగి ఉన్న లారీ డ్రైవర్లు, క్లీనర్లను కత్తులతో బెదిరిస్తూ చోరీలకు పాల్పడతున్నట్లు సమాచారం రావడంతో ఆ పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వాహనాల తనిఖీ చేపడుతుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌లపై వచ్చారు. అనుమానం వచ్చి వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపించమని అడగగా వారి నుంచి సమాధానం రాలేదు. ఈ మూడు బైక్‌లో ఒకటి గతంలో చోరీకి గురైనది ఉండటంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మిగతా వారు సంగాల గ్రామం శివారులోని పొలాల్లో దాక్కొని ఉండగా వల పన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి 22 బైక్‌లు, 60 సెల్ఫోన్లు, పలు రకాల కత్తులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల్లో రాజు, పాండు, లవ్లీలపై పశ్చిమగోదావరి, బ్రహ్మణకొట్కూరు, కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో మర్డర్ కేసులు ఉన్నాయి. అలాగే రాజు అనే దొంగపై వారెంటు కూడా ఉందని డీఎస్పీ వెల్లడించారు. ఈ ముఠా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారని చెప్పారు. సిబ్బందికి రివార్డు అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకుని వారి నుంచి దాదాపుగా రూ.10 లక్షల విలువచేసే వస్తువులను స్వాధీన పరుచుకోవడంతో డోన్ సీఐ రాజగోపాల్‌నాయుడు, కృష్ణగిరి, ప్యాపిలి, దేవనకొండ, డోన్ రూరల్ ఎస్ఐలు విజయభాస్కర్, మారుతీశంకర్, పీరయ్య, నరేంద్రకుమార్రెడ్డితో పాటు ఇద్దరు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, 11పీసీలు, ముగ్గురు హోంగార్డులకు డీఎస్పీ ఖాదర్‌బాషా రివార్డులు ప్రకటించారు. -
దొంగల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలోని ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టురట్టైంది. బుధవారం ఆ ముఠాలోని కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆయుబ్, సుధాకర్, మహేందర్, మహ్మద్ బాబా, నవీన్ కుమార్‌కు జైలులో ఉండగా పరిచయం ఏర్పడింది. బయటకు వచ్చిన తర్వాత ఈ ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. నగర శివార్లలోని ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు చేసేవారు. వీరి ఆగడాలు మితిమీరటంతో మాటు వేసిన పోలీసులు ఎట్టకేలకు నలుగురిని పట్టుకోగలిగారు. పరారీలో ఉన్న నవీన్ కుమార్ అనే నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఆయుబ్ అనే నిందితుడిపై ఇదివరకే 148 కేసులు ఉండగా, సుధాకర్‌పై 62 కేసులు ఉన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వద్దనుంచి 750 గ్రాముల బంగారం, 3కేజీల వెండి, 3టీవీలు, 5వేల నగదు, కారు, 11పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. -
7 గంటల్లోనే దొంగ అరెస్టు
చిత్తూరు, తిరుపతిక్రైం: నగరంలోని చిన్నబజారువీధిలో శనివారం జరిగిన భారీ చోరీని క్రైం పోలీసులు 7 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి రూ.62 లక్షల విలువైన 2 కేజీల బంగారు నగలు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి ఆదివారం క్రైం పోలీస్‌స్టేషన్‌లో వి లేకరుల సమావేశంలో మాట్లాడారు. చిన్నబజారువీధిలో హేమంత్ అనే వ్యక్తి లావణ్య జ్యువెలరీస్ ను నిర్వహిస్తున్నాడని తెలిపారు. దుకాణం వెనుకవైపు నివాసం ఉంటున్నాడు. ఇతని వద్ద గతంలో ఎమ్మార్‌పల్లిలో ఉంటున్న అయినపాళ్యం కళ్యాణ్ (23) పనిచేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతన్ని 2 ఏళ్ల క్రితం పని నుంచి నిలిపేశాడు. కళ్యాణ్ హైదరాబాద్‌లో ట్రావల్స్‌ను ఏర్పాటు చేసుకో వాలని భావించాడు. ఇందుకు పాత యజమాని షాపులో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. మాట్లాడేందుకు వెళ్లి.. ఈ నెల 5వతేదీ రాత్రి 8 గంటలకు లావణ్య జ్యువె లరీస్‌లోకి వెళ్లి 250 గ్రాముల బంగారు చెవిపోగులు కొనుగోలు చేశాడు. అనంతరం షాప్‌లో ఉన్న వారితో పాత పరిచయాన్ని వినియోగించుకుని ఇంట్లో వారితో మాట్లాడి మరుగుదొడ్డి కోసమని ఇంటి వెనక్కు వెళ్లాడు. అక్కడ తలుపునకు ఉన్న టవర్ బోల్ట్, ఇనుప గ్రిల్‌గేట్‌ను తీసివేసి బయటకు వచ్చేశాడు. రాత్రి ఒంటి గంట సమయంలో లావణ్య జ్యువెలర్స్‌లోకి ఇంటి వెనుకవైపు నుంచి వెళ్లి బంగారు చైను, డబ్బులు, క్యాష్ బ్యాగులోని రూ.20 వేలు, సీసీ కెమెరాల డీవీఆర్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. డీవీఆర్‌ను పాడుబడిన బావిలో పడేశాడు. ఇంతలో చోరీ జరిగినట్లు యజమాని గుర్తించి క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ముందురోజు, వెనుక రోజు ఎవరెవరు వచ్చారనే విషయాలను తెలుసుకున్నారు. కళ్యాణ్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసినట్టు అంగీకరించాడు. అతని నుంచి రూ.62 లక్షల విలువైన 2 కేజీల 55 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు నగదు దొంగతనానికి వినియోగించిన ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వింగ్స్ యాప్‌తో ఉద్యోగుల సమాచారం సేకరిస్తాం ఇకపై నగరంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా బంగారు షాపులు, షోరూంలు, ప్రముఖ షాపుల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలను వింగ్స్ యాప్ ద్వారా త్వరలోనే సేకరిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తి ఆధార్‌కార్డు, ఫొటో వివరాలను సేకరించవచ్చన్నారు. వాటిని బట్టి చిరునామా కనుక్కోవడం, అతని నేర చరిత్రను ఆరాతీయడం సులభమవుతుందని చెప్పారు. అంతేగాక వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారిలో నేర చరితులు, దొంగతనాలు చేసి ఉంటే వెంటనే గుర్తించవచ్చన్నారు. 10 రోజుల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలు ఎక్కడైనా వెళ్లే సమయంలో సమీపంలోని పోలీస్‌స్టేషన్ నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను వినియోగించుకోవచ్చన్నారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేయడంలో కృషి చేసిన ఏఎస్పీ సిద్ధారెడ్డి, డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, సీఐలు భాస్కర్‌రెడ్డి, శరత్చంద్ర, అబ్బన్న, మధు, పద్మలత, రసూలు సాహెబ్, ఇతర సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు. -
బంగారు కడ్డీ ఆశ చూపి మోసం
ఆమనగల్లు: ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల వెంకటమ్మ అనే వృద్ధురాలిని మభ్యపెట్టి బంగారు ఆభరణాలను దొంగిలించిన ముగ్గురు కిలేడీలను ఆమనగల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఆమనగల్లు పట్టణంలోని పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫతేనగర్‌కు చెందిన వేముల సమ్మక్క అలియాస్ లక్ష్మి, రాజేంద్రనగర్‌కు చెందిన చల్లా నర్సమ్మ, ఫతేనగర్‌కు చెందిన బండారి అనితలు ముఠాగా ఏర్పడి ముఖ్య కూడలిలో వృద్ధులను గుర్తించి వారిని మభ్యపెట్టి ఆభరణాలు దోచుకోవడం వృత్తిగా పెట్టుకున్నారు. ఈనెల 10న ఆమనగల్లు పట్టణంలో మంగళపల్లికి చెందిన వరికుప్పల వెంకటమ్మ నడుచుకుంటూ వెళ్తుండగా బంగారు పూత పూసిన ఇనుపకడ్డీని ఆమె ముందు వేసి... పెద్దమ్మ ఇది నీదా.. అంటూ ఒక మహిళ వృద్ధురాలితో మాటలు కలిపింది. వెనుక నుంచి వచ్చిన అదే ముఠాకు చెందిన మరో ఇద్దరు మహిళలు వారితో జత కలిశారు. బంగారు కడ్డీని నలుగురం ముక్కలు చేసి పంచుకుందామని భాగానికి వచ్చారు. అయితే రేపు నువ్వు వస్తావో రావో.. నిన్ను నమ్మడమెలా అని వృద్ధురాలిని కంగారు పెట్టించారు. కడ్డీని నీ దగ్గరే ఉంచుకోమని చెప్పి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యారు. ఇంటికొచ్చిన వరికుప్పల వెంకటమ్మ తనకిచ్చిన కడ్డీ నకిలీదని తెలుసుకుని ఈనెల 11న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధురాలిని మోసం చేసిన ముగ్గురు మహిళలు వేముల సమ్మక్క, చల్లా నర్సమ్మ, బండారు అనితలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని కల్వకుర్తి కోర్టులో హాజరు పరిచారు. విలేకరుల సమావేశంలో ఎస్సై మల్లీశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. -
గుంటూరులో గజదొంగలు
రాజధాని నగరం గుంటూరులో జరుగుతున్న వరుస చోరీలతో నగరవాసులకు కంటిపై కునుకు కరువైంది. పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న చోరీలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. దీనికితోడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గజదొంగల ముఠాలు నగరంలో సంచరిస్తున్నాయనే సమాచారంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వ్యక్తులు, ప్రాంతాలపై దృష్టిసారించారు. సాక్షి, గుంటూరు: రాజధాని నగరం గుంటూరులో గజ దొంగల ముఠాలు సంచరిస్తున్నాయి. ఈ సమాచారం తెలిసిన నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీకి చెందిన కరుడుగట్టిన గజదొంగల ముఠాలు నగరంలో తిష్టవేశాయని నిఘా వర్గాల హెచ్చరించడంతో అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వరుస దొంగతనాలతో గుంటూరు నగరవాసులకు కంటిపై కునుకు కరువైంది. ఈ తరుణంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గజదొంగల ముఠా సంచరిస్తుందనే సమాచారం బయటకు పొక్కడంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను వేధిస్తున్న సిబ్బంది కొరత రాజధాని ప్రకటన నుంచి గుంటూరు నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి తాకిడి ఎక్కువైంది. నగర జనాభా కూడా పెరిగింది. దీంతో కొత్త వ్యక్తులపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టలేకపోతున్నారు. దీంతో అప్పటి నుంచి చైన్‌స్నాచింగ్‌లు, దోపిడీ, దొంగతనాలు, పెరిగిపోయాయి. సిబ్బంది కొరతతోపాటు, వరుస బందోబస్తులు, ఆందోళనల నేపథ్యంలో నేరస్తులపై పూర్తిస్థాయి నిఘా ఉంచలేకపోతున్నారు. వేసవి కాలం రావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి సైతం వివిధ పేర్లతో దొంగల ముఠాలు రాజధాని నగరంపై కన్నేశాయని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఈ ముఠాల పనిపట్టేందుకు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ సిహెచ్.విజయరావు పక్కా ప్రణాళిక రూపొందించి దొంగల ముఠాల ఆటకట్టించేందుకు సమాయత్తం అవుతున్నారు. బుధవారం కార్డెన్ సెర్చ్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గజ దొంగల ముఠా సంచరిస్తున్నారనే నిఘా వర్గాల హెచ్చరికతో అర్బన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలతోపాటు, శివారు ప్రాంతాల్లో నివశించే కొత్త వ్యక్తులపై నిఘా ఉంచారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? అనే సమాచారం తెలుసుకునేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున నగర శివారులోని పలు ప్రాంతాలతోపాటు, నగరంలో దొంగల ముఠా సంచరించినట్లుగా అనుమానిస్తున్న పలు ప్రాంతాల్లో అర్బన్ జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు ప్రత్యేక బలగాలతో కలిసి భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించాలని అర్బన్ జిల్లా ఎస్పీ సిహెచ్.విజయరావు నిర్ణయించారు. అంతేకాకుండా మూడు నెలల వ్యవధిలో జైళ్ల నుంచి విడుదలైన నేరస్తుల జాబితాను సేకరించారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా నేరస్తుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించనున్నారు. అర్బన్ జిల్లా పరిధిలో సస్పెక్టెడ్ షీట్లు కలిగి ఉన్న 90 మందిపై సైతం పూర్తిస్థాయి నిఘా ఉంచారు. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వీరి కార్యకలాపాలు మొదలవక ముందే కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు. ప్రాణాలు తీసేందుకు వెనుకాడని ముఠాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గజ దొంగల ముఠాలు దొంగతనాలకు వెళ్లిన సమయంలో అడ్డుకునేవారిపై దాడిచేసి హతమార్చేందుకు సైతం వెనుకాడవు. గతంలో బిహార్‌కు చెందిన దోపిడీ ముఠా వట్టిచెరుకూరు వద్ద ఓ పెట్రోలు బంకులోకి ప్రవేశించి డబ్బులు దోచుకోవడంతోపాటు సిబ్బందిపై దాడి చేసి విచక్షణా రహితంగా నరికి చంపిన విషయం అందరికి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే గజదొంగల ముఠాలు శివారుప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లు, ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తాయి. పగటి పూట పూసలు, బొమ్మలు అమ్ముతున్నట్లుగా తిరుగుతూ చోరీలు చేయాల్సిన ఇళ్లపై రెక్కీ నిర్వహించడం ఈ ముఠాల ప్రత్యేకత. ఎవరికీ అనుమానం రాకుండా మహిళల ద్వారానే రెక్కీ నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పార్ధివ్ గ్యాంగ్‌లు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించడంతో అన్ని జిల్లాల పోలీసులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ వారంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన ముఠాలు జిల్లాలో మకాం వేసి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దొంగల సమాచారం అందిస్తే బహుమతి గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో గస్తీ ముమ్మరం చేశాం. కొద్దిరోజులుగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన గజదొంగల ముఠాలు నగరంలో సంచరిస్తున్నట్లు మాకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున అకస్మికంగా పలు అనుమానిత ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. ప్రజలు సైతం అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి. దొంగలకు సంబంధించిన సమాచారం తెలిపిన వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి బహుమతులు కూడా అందజేస్తాం. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. కొంత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాం. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై నిఘా ఉంచి చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.– సిహెచ్.విజయరావు, అర్బన్ ఎస్పీ -
సెల్ వాడడు.. పోలీసులకు దొరకడు!
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఠా ప్రధాననిందితుడు తప్పించుకున్నాడు. దీనికి కారణం..అతడు ఫోన్లను, అందులోనూ కొట్టేసిన ఫోన్లను వాడకపోవటమేనని పోలీసులు అంటున్నారు. కాగా, పట్టుబడిన వారి నుంచి రూ.3.5లక్షల విలువ చేసే 27 మొబైల్ ఫోన్లు, రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ కే శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలవీ.. మహబూబ్‌నగర్‌కు చెందిన బక్కవారి వినోద్, కాటేదాన్ రాజీవ్ గృహకల్పకు చెందిన ఆటో డ్రైవర్ గుండు ప్రభాకర్ (35), ఇదే ప్రాంతంలోని రవిఫుడ్స్లో పనిచేసే కొండె అరుణ్ రావు (22), నేతాజీనగర్ బుద్వేల్‌కు చెందిన బేల్దారి పనిచేసే గాలి అంజిరెడ్డి (22) స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ నలుగురూ కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వినోద్ కుమార్, కొండె అరుణ్ రావు దొంగతనం చేసేందుకు రాత్రి పూట అద్దెకు ఆటో మాట్లాడుకుని బయలుదేరుతారు. ఏదో ఒక చోట తెరిచిన కిటికీలున్న ఇంటిని ఎంచుకుని లోపలి బోల్టులను చాకచక్యంగా తెరుస్తారు. బయట అరుణ్‌రావు కాపలా కాస్తుండగా వినోద్ లోపలికి వెళ్లి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నగదును ఎత్తుకొస్తాడు.అనంతరం అక్కడి నుంచి వెంటనే ఉడాయిస్తారు. ఇలా, గోపాలపురం, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల, ఎస్ఆర్నగర్, నారాయణగూడ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన ఫోన్లను తెలిసిన వారికి విక్రయిస్తూ సంపాదించేవారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బి.వినోద్ పరారీలో ఉండగా మిగతా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫోన్లు కొట్టేస్తాడు....కానీ వినియోగించడు ప్రధాన నిందితుడు బక్కవారి వినోద్ మొబైల్ ఫోన్లు కొట్టేయడంలో నేర్పరి. ఎంత ఖరీదైన ఫోన్లను కొట్టేసినా వినోద్ మాత్రం ఫోన్లను వినియోగించడు. మొబైల్ ఫోన్ వాడటంతో వినోద్ 2014 లో జీడిమెట్ల పోలీసులకు పట్టుబడ్డాడు. అందుకే మరోమారు పోలీసులకు పట్టుబడకూడదంటే సెల్ వాడకూడదని నిశ్చయించుకున్నాడు.