మామడలో చోరికి గురైన దుకాణాన్ని పరిశీలిస్తున్న ఎస్సై అనూష
సాక్షి, మామడ(నిర్మల్): మండలంలోని దిమ్మదుర్తి, మామడ గ్రామాలలో ఆదివారం రాత్రి దొంగలు చోరికి పాల్పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాలే లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేశారు. మండలంలో ఒక్కసారిగా రెండు గ్రామాలలోని అయిదు దుకాణాలలో దొంగలు చోరికి యత్నించడం స్థానికంగా సంచలనం కలిగించింది. మామడ మండల కేంద్రంలో ప్రధాన రొడ్డుకు దగ్గరలో ఉన్న భూలక్ష్మి ఏజెన్సీస్ షెటర్‌ను పగుల గొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు కౌంటర్‌లో ఉన్న రూ. 9వేల రూపాయలను ఎత్తుకెళ్లారు. మండల కేంద్రంలోని పూలాజి డ్రెసెస్ క్లాథ్ మర్చెంట్‌లో చోరి చేసెందుకు షెటర్‌ను పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. సంఘటన స్థలాన్ని సోమవారం సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై అనూష, ఫింగర్ ప్రింట్ క్లూస్ టీం పరిశీలించి కేసు నమోదు చేశారు. దిమ్మదుర్తి గ్రామంలో బస్టాండ్ సమీపంలో గల దుకాణాల్లో చోరీకి యత్నించారు. దుకాణాల సెట్టర్‌లను పగులగొట్టి చోరి చేసెందుకు లోపల యత్నించారు.
పోలీస్‌లు పెట్రోలింగ్ చేసినప్పటికీ..
ఆదివారం అర్దరాత్రి వరకు మండల కేంద్రంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. దుకాణాలలో దొంగతనం ఉదయం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుకాణాలలలో కౌంటర్‌లను మాత్రమే పగులకొట్టి డబ్బులను తీసుకెళ్లారు. మిగితా సామగ్రిని దొంగలు ముట్టక పోవడంతో పక్కా ప్రణాళికతో దొంగతనం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీ కెమెరాలు అమర్చుకుని ఉంటే..
దుకాణాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకుని ఉంటే దుకాణాలలో చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకోవడం పోలీసులకు సులభమయ్యేది. దుకాణాల వద్ద సీసీ కెమెరాలను నిర్వహకులు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన వస్తువులు, డబ్బులు దుకాణాలలో ఉంచరాదని ఎస్సై అనూష పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment