కేసు వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ సురేందర్
సాక్షి, నందిగామ: పలు ప్రాంతాల్లో పశువులను అపహరిస్తున్న ఓ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ వివరించారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఓంనాబాద్ తాలుకా చుడుగుప్ప గ్రామానికి చెందిన మహమ్మద్ హస్మత్ అలియాస్ హస్మత్, మమమ్మద్ ఇలియాస్ ఖురేషీ అన్నదమ్ముళ్లు. వీరు రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని షైక్ ఇ మజీద్ సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి అదే ప్రాంతానికి చెందిన ఫెరోజ్ ఖాన్, అమీర్ ఖురేషీ పరిచయం అయ్యారు.
వీరు నలుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి పశువులను దొంగిలించడం వృత్తిగా మార్చుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని గ్రామాలకు వెలుపల పశువుల పాకల నుంచి రాత్రి సమయాల్లో పశువులను అపహరించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. అయితే, మండల పరిధిలోని రంగాపూర్‌కు చెందిన శివగల్ల రాములు చెందిన రెండు ఎద్దులను గత జనవరి 18న గుర్తు తెలియని వ్యక్తులు అపహారించుకు పోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మేకగూడ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ నలుగురు దొంగలు ఓ వాహనంలో వెళ్తున్నారు. వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకొని విచారించగా పశువుల చోరీ వివరాలు తెలిపారు. వీరి వద్దనుంచి రూ.3.75 లక్షల నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, మహీంద్రా గ్జైలో కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
వివిధ ఠాణాల్లో అన్నపై 52, తమ్ముడిపై 42 కేసులు
మహ్మద్ హస్మత్‌పై పలు పోలీస్‌స్టేషన్‌లలో 52 కేసులు నమోదు అయ్యాయని, అతడి సోదరుడు మహ్మద్ ఇలియాస్‌పై 42 కేసులు నమోదు అయ్యాయని ఏసీపీ సురేందర్ తెలిపారు. వీరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు సైతం జారీ అయినట్లు వివరించారు. నలుగురు కలిసి ముఠాగా ఏర్పడి వీరు తమ వాహనంలోని మధ్య, వెనుకాల సీట్లు తొలగించి అందులో పశువులను తరలిస్తారని వెల్లడించారు. వీరిపై ఎల్బీనగర్, మీర్‌పేట, రాజేంద్రనగర్, చందానగర్, పటాన్‌చెరు, షాబాద్, శంకర్‌పల్లి, నార్సింగి, శంషాబాద్ తదితర ఠాణాల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కేసును చేధించిన షాద్‌నగర్ రూరల్ సీఐ రామకృష్ణ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు, నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లును ఈ సందర్భంగా ఏసీపీ సురేందర్ ప్రత్యేకంగా అబినందించారు. వీరికి రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment