వట్టిచెరుకూరు వద్ద పెట్రోలు బంకుపై దోపిడీ దొంగల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు (ఫైల్)
రాజధాని నగరం గుంటూరులో జరుగుతున్న వరుస చోరీలతో నగరవాసులకు కంటిపై కునుకు కరువైంది. పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్న చోరీలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. దీనికితోడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గజదొంగల ముఠాలు నగరంలో సంచరిస్తున్నాయనే సమాచారంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వ్యక్తులు, ప్రాంతాలపై దృష్టిసారించారు.
సాక్షి, గుంటూరు: రాజధాని నగరం గుంటూరులో గజ దొంగల ముఠాలు సంచరిస్తున్నాయి. ఈ సమాచారం తెలిసిన నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీకి చెందిన కరుడుగట్టిన గజదొంగల ముఠాలు నగరంలో తిష్టవేశాయని నిఘా వర్గాల హెచ్చరించడంతో అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వరుస దొంగతనాలతో గుంటూరు నగరవాసులకు కంటిపై కునుకు కరువైంది. ఈ తరుణంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గజదొంగల ముఠా సంచరిస్తుందనే సమాచారం బయటకు పొక్కడంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులను వేధిస్తున్న సిబ్బంది కొరత
రాజధాని ప్రకటన నుంచి గుంటూరు నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి తాకిడి ఎక్కువైంది. నగర జనాభా కూడా పెరిగింది. దీంతో కొత్త వ్యక్తులపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టలేకపోతున్నారు. దీంతో అప్పటి నుంచి చైన్‌స్నాచింగ్‌లు, దోపిడీ, దొంగతనాలు, పెరిగిపోయాయి. సిబ్బంది కొరతతోపాటు, వరుస బందోబస్తులు, ఆందోళనల నేపథ్యంలో నేరస్తులపై పూర్తిస్థాయి నిఘా ఉంచలేకపోతున్నారు. వేసవి కాలం రావడంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి సైతం వివిధ పేర్లతో దొంగల ముఠాలు రాజధాని నగరంపై కన్నేశాయని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఈ ముఠాల పనిపట్టేందుకు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ సిహెచ్.విజయరావు పక్కా ప్రణాళిక రూపొందించి దొంగల ముఠాల ఆటకట్టించేందుకు సమాయత్తం అవుతున్నారు.
బుధవారం కార్డెన్ సెర్చ్
నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గజ దొంగల ముఠా సంచరిస్తున్నారనే నిఘా వర్గాల హెచ్చరికతో అర్బన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాలతోపాటు, శివారు ప్రాంతాల్లో నివశించే కొత్త వ్యక్తులపై నిఘా ఉంచారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరెవరిని కలుస్తున్నారు? అనే సమాచారం తెలుసుకునేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం తెల్లవారుజామున నగర శివారులోని పలు ప్రాంతాలతోపాటు, నగరంలో దొంగల ముఠా సంచరించినట్లుగా అనుమానిస్తున్న పలు ప్రాంతాల్లో అర్బన్ జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు ప్రత్యేక బలగాలతో కలిసి భారీ ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించాలని అర్బన్ జిల్లా ఎస్పీ సిహెచ్.విజయరావు నిర్ణయించారు. అంతేకాకుండా మూడు నెలల వ్యవధిలో జైళ్ల నుంచి విడుదలైన నేరస్తుల జాబితాను సేకరించారు. కార్డెన్ సెర్చ్‌లో భాగంగా నేరస్తుల ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించనున్నారు. అర్బన్ జిల్లా పరిధిలో సస్పెక్టెడ్ షీట్‌లు కలిగి ఉన్న 90 మందిపై సైతం పూర్తిస్థాయి నిఘా ఉంచారు. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వీరి కార్యకలాపాలు మొదలవక ముందే కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలను చేపడుతున్నారు.
ప్రాణాలు తీసేందుకు వెనుకాడని ముఠాలు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గజ దొంగల ముఠాలు దొంగతనాలకు వెళ్లిన సమయంలో అడ్డుకునేవారిపై దాడిచేసి హతమార్చేందుకు సైతం వెనుకాడవు. గతంలో బిహార్‌కు చెందిన దోపిడీ ముఠా వట్టిచెరుకూరు వద్ద ఓ పెట్రోలు బంకులోకి ప్రవేశించి డబ్బులు దోచుకోవడంతోపాటు సిబ్బందిపై దాడి చేసి విచక్షణా రహితంగా నరికి చంపిన విషయం అందరికి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే గజదొంగల ముఠాలు శివారుప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లు, ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తాయి. పగటి పూట పూసలు, బొమ్మలు అమ్ముతున్నట్లుగా తిరుగుతూ చోరీలు చేయాల్సిన ఇళ్లపై రెక్కీ నిర్వహించడం ఈ ముఠాల ప్రత్యేకత. ఎవరికీ అనుమానం రాకుండా మహిళల ద్వారానే రెక్కీ నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో పార్ధివ్ గ్యాంగ్‌లు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలు ధృవీకరించడంతో అన్ని జిల్లాల పోలీసులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ వారంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన ముఠాలు జిల్లాలో మకాం వేసి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
దొంగల సమాచారం అందిస్తే బహుమతి
గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో గస్తీ ముమ్మరం చేశాం. కొద్దిరోజులుగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన గజదొంగల ముఠాలు నగరంలో సంచరిస్తున్నట్లు మాకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున అకస్మికంగా పలు అనుమానిత ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. ప్రజలు సైతం అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి. దొంగలకు సంబంధించిన సమాచారం తెలిపిన వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు, వారికి బహుమతులు కూడా అందజేస్తాం. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. కొంత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మాత్రమే సూచిస్తున్నాం. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలా సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై నిఘా ఉంచి చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.– సిహెచ్.విజయరావు, అర్బన్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment