10 మంది ఘరానా దొంగల అరెస్ట్‌ | Thief Gang Arrest in Visakhapatnam | Sakshi
Sakshi News home page

10 మంది ఘరానా దొంగల అరెస్ట్‌

Published Sun, Feb 17 2019 7:12 AM | Last Updated on Sun, Feb 17 2019 7:12 AM

Thief Gang Arrest in Visakhapatnam - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ద్వారకాజోన్‌ సీఐ బాబ్జీరావు

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చోరీలు చేసిన ఘరానా దొంగలను అరెస్ట్‌ చేశామని ద్వారకాజోన్‌ క్రైం సీఐ వి.బాబ్జీరావు వెల్లడించారు. ఈ మేరకు పెదవాల్తేరులోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన అంతర్రాష్ట్ర ముఠాలోని ఒక దొంగను అరెస్టు చేశామన్నారు. ఒడిశా కాశీనగర్‌కి చెందిన దొంగ నుంచి 16 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఆంధ్రా యూనివర్సిటీ ఎస్‌వీ హాస్టల్‌లో ఉంటున్న ఎం.జగదీష్‌బాబుకి చెందిన రూ.25వేల విలువ గల ల్యాప్‌ట్యాప్‌ చోరీ చేసిన రామ్‌నగర్‌కు చెందిన సోమాదుల మణికంఠ (25), జైలురోడ్డు గొల్లలపాలెం నివాసి కొరుపోల మహేష్‌ (25)లను అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఏటీఎం కార్డు దొంగలించి నగదు విత్‌డ్రా చేసిన కేసులో రామ్‌నగర్‌లో నివసిస్తున్న బొబ్బిలికి చెందిన యల్లా పార్వతి (20)ని అరెస్ట్‌ చేశామని తెలిపారు. ఈమె ఎండాడకు చెందిన సంబాగి శివరామ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న బాంబే గ్యాస్‌లైట్‌ స్టోర్స్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తుంది. ఈమెకి శివరామ్‌ తన ఏటీఎం కార్డు ఇచ్చి నగదు డిపాజిట్, విత్‌డ్రా వంటి పనులు కూడా చేయించేవారు. ఈ నేపథ్యంలో శివరామ్‌ ఏటీఎం కార్డును పార్వతి దొంగలించి రూ.68,500 విత్‌డ్రా చేసి పరారైపోయింది. దీనిపై కేసు నమోదు చేసి పార్వతి నుంచి రూ.68వేలు రికవరీ చేశామని సీఐ తెలిపారు.
ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి డీఆర్‌ఎం కార్యాలయానికి ఆటోలో వెళ్తున్న శ్రీకాకుళం జిల్లా గొల్లలవలసకు చెందిన దేర్గాశి సంతోష్‌కుమార్‌ (31) పర్సులోని రూ.68వేలు అపహరించిన కొబ్బరితోటకు చెందిన అలమండ రాంబాబు (36), కరణం మణికంఠ (26), సూర్యాబాగ్‌కి చెందిన దొడ్డి శరత్‌ (40), కంచరపాలెంకి చెందిన బసవబోయిన వెంకటరావు (30)ని అరెస్టు చేసి రూ.58వేలు నగదు రివకరీ చేశామని తెలిపారు.
పెదవాల్తేరు ఆదర్శనగర్‌కి చెందిన కడియాల రఘురాం (24)ని అరెస్టు చేసి రూ.1.40లక్షల విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు రికవరీ చేశామన్నారు. మొత్తం 10 మందిని అరెస్టు చేసి రూ.20లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన ఎంవీపీ క్రైం ఎస్‌ఐ డి.సూరిబాబు, ఏఎస్‌ఐ ఎ.అప్పారావు, హెచ్‌సీ టి.తులసీభాస్కర్, కానిస్టేబుళ్లు పి.నరేష్‌కుమార్, బి.నారాయణ, బీవీఆర్‌ నాగభూషణం, పీడీవీ ప్రసాద్‌లను అధికారులు అభినందించారు. సమావేశంలో త్రీటౌన్‌ క్రైం సీఐ ఎస్‌.శంకరరావు, టూ టౌన్‌ క్రైం ఎస్‌ఐ వెంకటభాస్కరరావు, ఎస్‌ఐ శ్యామ్‌సుందర్, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement