సాక్షి, హైదరాబాద్ : నగర శివార్లలోని ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా గుట్టురట్టైంది. బుధవారం ఆ ముఠాలోని కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆయుబ్, సుధాకర్, మహేందర్, మహ్మద్ బాబా, నవీన్ కుమార్‌కు జైలులో ఉండగా పరిచయం ఏర్పడింది. బయటకు వచ్చిన తర్వాత ఈ ఐదుగురు ఓ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు. నగర శివార్లలోని ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు చేసేవారు.
వీరి ఆగడాలు మితిమీరటంతో మాటు వేసిన పోలీసులు ఎట్టకేలకు నలుగురిని పట్టుకోగలిగారు. పరారీలో ఉన్న నవీన్ కుమార్ అనే నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఆయుబ్ అనే నిందితుడిపై ఇదివరకే 148 కేసులు ఉండగా, సుధాకర్‌పై 62 కేసులు ఉన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వద్దనుంచి 750 గ్రాముల బంగారం, 3కేజీల వెండి, 3టీవీలు, 5వేల నగదు, కారు, 11పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment