ఈ దోపిడీ మరో ‘దృశ్యం’  | Great Phone Dacoity Case Links With Hyderabad In Telangana | Sakshi
Sakshi News home page

ఈ దోపిడీ మరో ‘దృశ్యం’ 

Published Mon, Dec 21 2020 8:23 AM | Last Updated on Mon, Dec 21 2020 11:36 AM

Great Phone Dacoity Case Links With Hyderabad In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అదో ‘గ్రేట్‌ ఫోన్‌ డెకాయిటీ’... పదులు కాదు వందలు కాదు ఏకంగా 13,920 సెల్‌ఫోన్లు దుండగుల పాలయ్యాయి... కేవలం ఈ నేరమే కాదు కేసు దర్యాప్తు సైతం ఓ రికార్డే...చెన్నై కేంద్రంగా చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో హైదరాబాద్‌తో లింకులు బయటపడ్డాయి. అక్కడ తస్కరణకు గురైన ఫోన్లలో వెయ్యి సిటీలోని ఓ వ్యాపారి వద్దకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గుర్తించింది. ఈ నేపథ్యంలోనే నలుగురు అధికారులతో కూడిన టీమ్‌ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే వారికి వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ఆ బృందం తిరిగి వెళ్ళింది. అతడి కోసం గాలింపు కొనసాగించాలని నిర్ణయించింది. 

  • చెన్నై శివార్లలోని ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ ఫెసిలిటీ సంస్థలో తయారైన 13,920 సెల్‌ఫోన్లను మహారాష్ట్ర పంపడానికి ఓ కంటైనర్‌లో లోడ్‌ చేశారు. రూ.15 కోట్ల విలువైన సెల్‌ఫోన్లతో కూడిన కంటైనర్‌ను తీసుకుని అక్టోబర్‌ 20న లారీ బయలుదేరింది.  
  • తమిళనాడులోని హోసూర్‌ సమీపంలో ఉన్న షోలాగిరి ప్రాంతానికి ఈ ట్రక్‌ అక్టోబర్‌ 21న చేరుకుంది. అక్కడ దీన్ని అడ్డగించిన దుండగులు డ్రైవర్‌ సతీష్‌ కుమార్‌ షా, సహాయకుడు అరుణ్‌పై దాడి చేసి ట్రక్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
  • అనంతరం మరో లారీలోకి మార్చుకున్నారు.బాధిత డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు షోలాగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 
  • దొంగిలించిన సెల్‌ఫోన్లతో కూడిన లారీని బందిపోటు దొంగలు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు తీసుకువెళ్ళారు.   
  • ఈ కేసును ఛేదించడానికి చెన్నై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు ఉన్నతాధికారులు, 32 మంది పోలీసులతో కూడిన సిట్‌ దాదాపు 40 రోజుల పాటు దర్యాప్తు చేసింది. 
  • అందులో భాగంగా సిట్‌ అధికారులు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించగలిగారు.   
  • చోరీ సెల్‌ఫోన్లతో కూడిన బందిపోట్ల లారీ తమిళనాడు నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా మధ్యప్రదేశ్‌ చేరిందని తేల్చారు. హోసూర్, బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్, ఆదిలాబాద్‌ రూట్‌లో  వెళ్ళింది.  
  • షోలాగిరి నుంచి దాదాపు 1400 కిమీ ప్రయాణించిన ఈ లారీ 33 టోల్‌గేట్లను దాటింది. మార్గ మధ్యంలో 30 సార్లు నెంబర్‌ ప్లేట్లు మార్చినట్లు గుర్తించారు.  
  • ప్రతి ప్లాజా తర్వాత ఓ ప్లేట్‌ మారుస్తూ పోయారు. లారీ ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తోందో ఆ రాష్ట్రానికే చెందిన నకిలీ నెంబర్‌ ప్లేట్లు ముందే సిద్ధం చేసుకున్నారు.   
  • దర్యాప్తులో భాగంగా నేరం జరిగిన నాటి నుంచి కొన్ని రోజుల వ్యవధిలో చెన్నై, ఇండోర్‌ల్లో జరిగిన హవాలా లావీదేవీలను సిట్‌ సేకరించింది. ఈ నేపథ్యంలోనే  అక్టోబర్‌ 28–30 తేదీల్లో దుబాయ్‌ కేంద్రంగా మాఫియా కార్యకలాపాలు నడుపుతున్న అబ్బాస్‌ ఇండోర్‌కు రూ.6 కోట్లు పంపినట్లు తేలింది. 
  • ఈ ఆధారంతో ముందుకు వెళ్ళిన సిట్‌ అధికారులు ఈ గ్యాంగ్‌ లీడర్‌ రాజన్‌ చౌహాన్‌ను అక్టోబర్‌ 26న పట్టుకున్నారు. ఇతడి విచారణలోనే మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అబ్బాస్‌కు ఆ సెల్‌ఫోన్లను రూ.6.5 కోట్లకు విక్రయించినట్లు అంగీకరించాడు.  
  • బందిపోటు దొంగలు లారీ నుంచి సెల్‌ఫోన్లను ఇండోర్‌లోని ఓ గోదాములోకి మార్చారు. అక్కడ వెయ్యి ఫోన్ల చొప్పున ప్యాక్‌ చేసి ఎయిర్‌ కార్గో ద్వారా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి సహా 14 నగరాలకు పంపారు. 
  • అక్కడి ముఠా ఈ సెల్‌ఫోన్లను మరో లారీలో ఎక్కించుకుని రోడ్డు మార్గంలో త్రిపుర రాజధాని అగర్తలకు తీసుకువెళ్ళి మరో టీమ్‌కు అప్పగించారు. వాళ్ళు ఆ సెల్‌ఫోన్‌లను దేశ సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్‌ చేర్చారు.  
  • అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అబ్బాస్‌ మనుషులు సెల్‌ఫోన్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ బందిపోటు దొంగతనంలో అబ్బాస్, రాజన్‌ చౌహాన్‌లతో పాటు 19 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు.  
  • వీరిలో కేవలం 10 మందిని పట్టుకున్న సిట్‌ చోరీకి గురైన 13,920 ఫోన్లలో ఏడు మాత్రమే రికవరీ చేయగలిగింది. ముఠాకు సహకరించిన హైదరాబాదీ కోసం సిట్‌ వేటాడుతూ ఇక్కడకు వచ్చింది.  
  • ముఠా సభ్యుల అరెస్టు విషయం తెలిసిన అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని తెలియడంతో తిరిగి వెళ్ళింది. ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉండటాడు? అనే అంశాలను సిట్‌ అధికారులు పూర్తి గోప్యంగా ఉంచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement