dacoity case
-
ఈ దోపిడీ మరో ‘దృశ్యం’
సాక్షి, హైదరాబాద్: అదో ‘గ్రేట్ ఫోన్ డెకాయిటీ’... పదులు కాదు వందలు కాదు ఏకంగా 13,920 సెల్ఫోన్లు దుండగుల పాలయ్యాయి... కేవలం ఈ నేరమే కాదు కేసు దర్యాప్తు సైతం ఓ రికార్డే...చెన్నై కేంద్రంగా చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో హైదరాబాద్‌తో లింకులు బయటపడ్డాయి. అక్కడ తస్కరణకు గురైన ఫోన్లలో వెయ్యి సిటీలోని ఓ వ్యాపారి వద్దకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ నేపథ్యంలోనే నలుగురు అధికారులతో కూడిన టీమ్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చింది. అయితే వారికి వాంటెడ్‌గా ఉన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ఆ బృందం తిరిగి వెళ్ళింది. అతడి కోసం గాలింపు కొనసాగించాలని నిర్ణయించింది. చెన్నై శివార్లలోని ఫ్లెక్స్‌ట్రానిక్స్ ఫెసిలిటీ సంస్థలో తయారైన 13,920 సెల్ఫోన్లను మహారాష్ట్ర పంపడానికి ఓ కంటైనర్‌లో లోడ్ చేశారు. రూ.15 కోట్ల విలువైన సెల్ఫోన్లతో కూడిన కంటైనర్‌ను తీసుకుని అక్టోబర్ 20న లారీ బయలుదేరింది. తమిళనాడులోని హోసూర్ సమీపంలో ఉన్న షోలాగిరి ప్రాంతానికి ఈ ట్రక్ అక్టోబర్ 21న చేరుకుంది. అక్కడ దీన్ని అడ్డగించిన దుండగులు డ్రైవర్ సతీష్ కుమార్ షా, సహాయకుడు అరుణ్‌పై దాడి చేసి ట్రక్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం మరో లారీలోకి మార్చుకున్నారు.బాధిత డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు షోలాగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగిలించిన సెల్ఫోన్లతో కూడిన లారీని బందిపోటు దొంగలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు తీసుకువెళ్ళారు. ఈ కేసును ఛేదించడానికి చెన్నై పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు ఉన్నతాధికారులు, 32 మంది పోలీసులతో కూడిన సిట్ దాదాపు 40 రోజుల పాటు దర్యాప్తు చేసింది. అందులో భాగంగా సిట్ అధికారులు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించగలిగారు. చోరీ సెల్ఫోన్లతో కూడిన బందిపోట్ల లారీ తమిళనాడు నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మీదుగా మధ్యప్రదేశ్ చేరిందని తేల్చారు. హోసూర్, బెంగళూరు, కర్నూలు, హైదరాబాద్, ఆదిలాబాద్ రూట్లో వెళ్ళింది. షోలాగిరి నుంచి దాదాపు 1400 కిమీ ప్రయాణించిన ఈ లారీ 33 టోల్గేట్లను దాటింది. మార్గ మధ్యంలో 30 సార్లు నెంబర్ ప్లేట్లు మార్చినట్లు గుర్తించారు. ప్రతి ప్లాజా తర్వాత ఓ ప్లేట్ మారుస్తూ పోయారు. లారీ ఏ రాష్ట్రంలో ప్రయాణిస్తోందో ఆ రాష్ట్రానికే చెందిన నకిలీ నెంబర్ ప్లేట్లు ముందే సిద్ధం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నేరం జరిగిన నాటి నుంచి కొన్ని రోజుల వ్యవధిలో చెన్నై, ఇండోర్ల్లో జరిగిన హవాలా లావీదేవీలను సిట్ సేకరించింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 28–30 తేదీల్లో దుబాయ్ కేంద్రంగా మాఫియా కార్యకలాపాలు నడుపుతున్న అబ్బాస్ ఇండోర్‌కు రూ.6 కోట్లు పంపినట్లు తేలింది. ఈ ఆధారంతో ముందుకు వెళ్ళిన సిట్ అధికారులు ఈ గ్యాంగ్ లీడర్ రాజన్ చౌహాన్‌ను అక్టోబర్ 26న పట్టుకున్నారు. ఇతడి విచారణలోనే మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అబ్బాస్‌కు ఆ సెల్ఫోన్లను రూ.6.5 కోట్లకు విక్రయించినట్లు అంగీకరించాడు. బందిపోటు దొంగలు లారీ నుంచి సెల్ఫోన్లను ఇండోర్‌లోని ఓ గోదాములోకి మార్చారు. అక్కడ వెయ్యి ఫోన్ల చొప్పున ప్యాక్ చేసి ఎయిర్ కార్గో ద్వారా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, గౌహతి సహా 14 నగరాలకు పంపారు. అక్కడి ముఠా ఈ సెల్ఫోన్లను మరో లారీలో ఎక్కించుకుని రోడ్డు మార్గంలో త్రిపుర రాజధాని అగర్తలకు తీసుకువెళ్ళి మరో టీమ్‌కు అప్పగించారు. వాళ్ళు ఆ సెల్ఫోన్లను దేశ సరిహద్దులు దాటించి బంగ్లాదేశ్ చేర్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అబ్బాస్ మనుషులు సెల్ఫోన్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఈ బందిపోటు దొంగతనంలో అబ్బాస్, రాజన్ చౌహాన్‌లతో పాటు 19 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వీరిలో కేవలం 10 మందిని పట్టుకున్న సిట్ చోరీకి గురైన 13,920 ఫోన్లలో ఏడు మాత్రమే రికవరీ చేయగలిగింది. ముఠాకు సహకరించిన హైదరాబాదీ కోసం సిట్ వేటాడుతూ ఇక్కడకు వచ్చింది. ముఠా సభ్యుల అరెస్టు విషయం తెలిసిన అతడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని తెలియడంతో తిరిగి వెళ్ళింది. ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉండటాడు? అనే అంశాలను సిట్ అధికారులు పూర్తి గోప్యంగా ఉంచారు. -
బందిపోటు ముఠాకు చెక్
సాక్షి, సిటీబ్యూరో: పుత్లిబౌలి చౌరస్తా సమీపంలో ఈ నెల 4న రాత్రి చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరగాళ్ళగా మారిన ముఠాలోని ఐదుగురు యువకులకు పట్టుకున్నారు. వీరి నుంచి నగదు, ద్విచక్ర వాహనాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కోఠిలోని ఓ ఫార్మసీ దుకాణంలో పని చేస్తున్న తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫారూఖ్ బాష ఈ గ్యాంగ్‌కు సూత్రధారిగా ఉన్నాడు. తనకు వచ్చే ఆదాయంతో సంతప్తి చెందని ఫారూఖ్ తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఫార్మసీకి ఎదురుగా ఉన్న షాపు యజమాని ప్రతి రోజూ రాత్రి దుకాణం మూసిన తర్వాత డబ్బు ఉన్న సంచితో వెళ్ళడం గమనించాడు. దీంతో అతడినే టార్గెట్‌గా చేసుకుని ఆ బ్యాగ్ దోచుకోవడానికి పథకం వేశాడు. దీన్ని అమలు చేయడం కోసం పురానీహవేలీకి చెందిన తన స్నేహితుడు సయ్యద్ ఫయాజ్ ఇమ్రాన్‌ను సంప్రదించాడు. తనకు మరో నలుగురు మనుషుల్ని సమకూర్చి పెట్టాలని, ‘పని’ పూర్తయిన తర్వాత అందరికీ వాటాలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఫయాజ్ తనకు పరిచయస్తులైన శాలిబండకు చెందిన అమీర్‌ఖాన్, కాలాపత్తర్ వాసి మహ్మద్ వసీం, మొఘల్‌పురకు చెందిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్ హుస్సేన్, నాంపల్లికి చెందిన సమీర్‌లను ఫారూఖ్‌కు పరిచయం చేశాడు. దీంతో వీరంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ గ్యాంగ్‌లో సూత్రధారి సహా మిగిలిన వారంతా 21–26 ఏళ్ళ మధ్య వయస్కులే కావడం గమనార్హం. దోపిడీకి రంగంలోకి దిగిన ఈ గ్యాంగ్ ఈ నెల 4న తమ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి పది రోజుల ముందు నుంచే తమ టార్గెట్ కదలికపై రెక్కీ నిర్వహించారు. ఈ నెల 4న రాత్రి రంగంలోకి దిగిన వీరంతా పుత్లిబౌలిలోని అమత్ బార్ వద్ద కలుసుకున్నారు. ఫైజల్ మినహా మిగిలిన వారంతా అక్కడే ఉండిపోగా.. ఇతడు మాత్రం ఫయాజ్ పని చేసే దుకాణం వద్దకు వెళ్ళాడు. అక్కడే ఉండి తమ టార్గెట్ కదలికల్ని గమనించాడు. అమీర్ ఖాన్, సమీర్లు రెండు ద్విచక్ర వాహనాలపై నిర్ధేశించిన ప్రాంతాల్లో ఎదురుచూస్తున్నారు. ఆ రాత్రి 9.05 గంటలకు డబ్బు ఉన్న సంచితో వస్తున్న టార్గెట్‌ను ఫయాజ్, వహీంలు పుత్లిబౌలి ‘యు’ టర్న్ వద్ద అడ్డుకుని స్క్రూడ్రైవర్‌తో దాడి చేశారు. ఆయన తేరుకునే లోపే రూ.3.3 లక్షలతో కూడిన బ్యాగ్ తీసుకుని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అఫ్జల్‌గంజ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని ఛేదించడానికి ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతత్వంలోని బందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలిలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర ఆధారాలను బట్టి నిందితుల్ని గుర్తించారు. బుధవారం సమీర్ మినహా మిగిలిన ఐదుగురిని పట్టుకుని రూ.2.6 లక్షల నగదు, వాహనాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుల్లో ఫారూఖ్‌పై సుల్తాన్‌బజార్, ఫయాజ్‌పై మొఘల్‌పుర, అమీర్‌ఖాన్‌పై శాలిబండ, వశీంపై మాదాపూర్ ఠాణాల్లో గతంలో కేసులు నమోదై ఉన్నట్లు కొత్వాల్ వెల్లడించారు. -
మంత్రిగారిపై దోపిడీ కేసు!!
ఓ వ్యక్తిని బెదిరించి, దోపిడీ చేసినందుకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలోని ఓ సీనియర్ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్ మత్స్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఇక్బాల్ మసూద్‌పై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కేసు పెట్టారు. అయితే సర్వసాధారణంగానే మంత్రిగారు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దాదాపు 15 మంది అనుచరులతో కలిసి ఓ న్యాయవాది ఇంట్లోకి చొచ్చుకెళ్లి, ఆయనను బెదిరించి, విలువైన వస్తువులన్నీ దోచుకున్నట్లు ఇక్బాల్ మసూద్‌పై కేసు నమోదైంది. మంత్రిగారి దిష్టిబొమ్మను దహనం చేసినందుకు తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మే 28న తనను ఆయన బెదిరించినట్లు నూతన్ విజయ్ అనే ఆ న్యాయవాది అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో తన ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో సదరు మంత్రిపైన, ఆయన అనుచరులపైన కేసు పెట్టాల్సిందిగా కోర్టు ఆదేశించింది.