వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్
సాక్షి, సిటీబ్యూరో: పుత్లిబౌలి చౌరస్తా సమీపంలో ఈ నెల 4న రాత్రి చోటు చేసుకున్న బందిపోటు దొంగతనం కేసును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరగాళ్ళగా మారిన ముఠాలోని ఐదుగురు యువకులకు పట్టుకున్నారు. వీరి నుంచి నగదు, ద్విచక్ర వాహనాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కోఠిలోని ఓ ఫార్మసీ దుకాణంలో పని చేస్తున్న తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫారూఖ్ బాష ఈ గ్యాంగ్‌కు సూత్రధారిగా ఉన్నాడు. తనకు వచ్చే ఆదాయంతో సంతప్తి చెందని ఫారూఖ్ తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఫార్మసీకి ఎదురుగా ఉన్న షాపు యజమాని ప్రతి రోజూ రాత్రి దుకాణం మూసిన తర్వాత డబ్బు ఉన్న సంచితో వెళ్ళడం గమనించాడు. దీంతో అతడినే టార్గెట్‌గా చేసుకుని ఆ బ్యాగ్ దోచుకోవడానికి పథకం వేశాడు.
దీన్ని అమలు చేయడం కోసం పురానీహవేలీకి చెందిన తన స్నేహితుడు సయ్యద్ ఫయాజ్ ఇమ్రాన్‌ను సంప్రదించాడు. తనకు మరో నలుగురు మనుషుల్ని సమకూర్చి పెట్టాలని, ‘పని’ పూర్తయిన తర్వాత అందరికీ వాటాలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. దీంతో ఫయాజ్ తనకు పరిచయస్తులైన శాలిబండకు చెందిన అమీర్‌ఖాన్, కాలాపత్తర్ వాసి మహ్మద్ వసీం, మొఘల్‌పురకు చెందిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్ హుస్సేన్, నాంపల్లికి చెందిన సమీర్‌లను ఫారూఖ్‌కు పరిచయం చేశాడు. దీంతో వీరంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఈ గ్యాంగ్‌లో సూత్రధారి సహా మిగిలిన వారంతా 21–26 ఏళ్ళ మధ్య వయస్కులే కావడం గమనార్హం. దోపిడీకి రంగంలోకి దిగిన ఈ గ్యాంగ్ ఈ నెల 4న తమ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. దీనికి పది రోజుల ముందు నుంచే తమ టార్గెట్ కదలికపై రెక్కీ నిర్వహించారు. ఈ నెల 4న రాత్రి రంగంలోకి దిగిన వీరంతా పుత్లిబౌలిలోని అమత్ బార్ వద్ద కలుసుకున్నారు.
ఫైజల్ మినహా మిగిలిన వారంతా అక్కడే ఉండిపోగా.. ఇతడు మాత్రం ఫయాజ్ పని చేసే దుకాణం వద్దకు వెళ్ళాడు. అక్కడే ఉండి తమ టార్గెట్ కదలికల్ని గమనించాడు. అమీర్ ఖాన్, సమీర్‌లు రెండు ద్విచక్ర వాహనాలపై నిర్ధేశించిన ప్రాంతాల్లో ఎదురుచూస్తున్నారు. ఆ రాత్రి 9.05 గంటలకు డబ్బు ఉన్న సంచితో వస్తున్న టార్గెట్‌ను ఫయాజ్, వహీంలు పుత్లిబౌలి ‘యు’ టర్న్ వద్ద అడ్డుకుని స్క్రూడ్రైవర్‌తో దాడి చేశారు. ఆయన తేరుకునే లోపే రూ.3.3 లక్షలతో కూడిన బ్యాగ్ తీసుకుని ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అఫ్జల్‌గంజ్ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని ఛేదించడానికి ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతత్వంలోని బందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలిలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర ఆధారాలను బట్టి నిందితుల్ని గుర్తించారు. బుధవారం సమీర్ మినహా మిగిలిన ఐదుగురిని పట్టుకుని రూ.2.6 లక్షల నగదు, వాహనాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సమీర్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. నిందితుల్లో ఫారూఖ్‌పై సుల్తాన్‌బజార్, ఫయాజ్‌పై మొఘల్‌పుర, అమీర్‌ఖాన్‌పై శాలిబండ, వశీంపై మాదాపూర్ ఠాణాల్లో గతంలో కేసులు నమోదై ఉన్నట్లు కొత్వాల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment