స్వాధీనపరుచుకున్న దొంగసొత్తు, నేరగాళ్లతో పోలీసులు
ప్రాంతమేదైనా పక్కా స్కెచ్‌తో వెళతారు. దొరికిన కాడికి దోచేస్తారు. ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సంఖ్యలోనే వీళ్లు చోరీలకు పాల్పడ్డారు. ఓ పక్క పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నా.. వీరి ప్రవర్తనలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. ఒక్కొక్కరిపై 20 నుంచి 30కి పైగా కేసులున్నా.. వారు మాత్రం చోరీల బాటను వీడడం లేదు. తాజాగా మరోసారి పోలీసులకు చిక్కారు. ఈ సారి రాజానగరం పోలీసులు వారిని అరెస్టు చేసి వారి నుంచి చోరీ సామగ్రిని స్వాధీనపరచుకున్నారు.
తూర్పుగోదావరి, రాజానగరం: తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులను అపహరించుకుపోతున్న ఇద్దరు నేరగాళ్లకు, ఆ దొంగ సొత్తును కొనుగోలు చేస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్న వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి, కోర్డుకు హాజరు పరిచారు. నిందితుల నుంచి రూ.6.50 లక్షలు విలువజేసే 17 కాసుల బంగారు, 350 గ్రాముల వెండి నగలు, నాలుగు ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలు, ఒక గ్యాస్ సిలిండర్, సెల్‌ఫోన్, ఇన్వర్టర్, రెండు హోమ్ థియేటర్లతో పాటు రూ.పది వేల నగదును స్వాధీనపర్చుకున్నామని రాజమహేంద్రవరం తూర్పు మండల డీఎస్పీ యు.నాగరాజు సోమవారం తెలిపారు. రాజానగరం, కోరుకొండ పోలీసు స్టేషన్ల పరిధిలోని కోలమూరు, కొంతమూరు, మధురపూడిలోని గత ఆగస్టులో వరుసగా ఏడు గృహాల్లో జరిగిన చోరీలపై చేపట్టిన దర్యాప్తులో కొంతమూరులోని సంతోష్‌నగర్‌కి చెందిన మోర్త వెంకటేష్, కలమాటి మధుశ్రీనులతోపాటు రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐ సమీపంలోని పనసచెట్టు సెంటర్‌కు చెందిన వాకాడ జనార్దనరావులను అరెస్టు చేశారు.
గతంలోనూ వీరిపై కేసులు
తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్కెట్ చేసుకుని దొంగతానాలు చేయడం వీరికి అలవాటు. మోర్త వెంకటేష్‌పై 38 కేసులు, కలమాటి మధుశ్రీనుపై 23 కేసులు, వారికి సహకరించిన వ్యాపారి వాకాడ జనార్దనరావుపై 23 కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి తిరిగి నేరాలు ప్రారంభించారు. చాకచక్యంగా వ్యవహరించిన రాజానగరం పోలీసులు నిందితులను ఆదివారం పట్టుకున్నారు. చోరీల్లో వారు చేజిక్కించుకున్న ఏటీఎం కార్డును రాజమహేంద్రవరంలోని ఒక వస్త్ర దుకాణంలో వినియోగించడం ద్వారా పట్టుబడ్డారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చురుకైన పాత్ర వహించిన రాజానగరం సీఐ సురేష్‌బాబు, కానిస్టేబుల్స్ ఎ.సుబ్రహ్మణ్యం, బీఎన్‌ఎస్ ప్రసాద్, కె. శ్రీధర్‌లను అభినందించడంతోపాటు రివార్డుకు సిఫారసు చేస్తానన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని డీఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాల్లే బాగా ఉపయోగించుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమావేశంలో సీఐ సురేష్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment