చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలిస్తున్న సీఐ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని నెల్లూరురోడ్డులో ఉన్న రెండు దుకాణాల్లో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఈ ఘటనలో 60 గ్రాముల బంగారు నగలతో పాటు రూ.1.89 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే కడప క్లూస్‌టీం బృందం వేలిముద్రలు సేకరించారు. అర్బన్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు స్థానిక నెల్లూరు రోడ్డులోని హోండా షోరూం పక్కన బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి దాక్షిణ్య హార్డ్‌వేర్ సెంటర్‌ను నిర్వహిస్తుండేవాడు. కలసపాడు మండలంలోని లింగారెడ్డిపల్లెలో జరిగే విగ్రహ ప్రతిష్టకు హాజరయ్యేందుకు గాను సోమవారం కడపకు వెళ్లి 60 గ్రాముల బంగారు నగలు కొనుగోలు చేసి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత దుకాణంలోనే భద్రపరిచారు. అలాగే కౌంటర్‌లో రూ.1.09 లక్షలు నగదును కూడా ఉంచి రాత్రికి దుకాణంపై ఉన్న గదిలో నిద్రించారు. తెల్లవారి లేచిచూసే సరికి షట్టర్ తెరిచి ఉండటంతో అనుమానంతో దుకాణంలోకి వెళ్లి చూడగా కౌంటర్‌లో ఉన్న బంగారు నగలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే ఇదే వరుసలోని లియో మల్టీబ్రాండెడ్ షోరూం షట్టర్ తాళాలు పగులకొట్టి దుకాణంలోని రూ.80 వేలు నగదును దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కడప నుంచి క్లూస్‌టీం నిపుణులను పిలిపించి వేలిముద్రలను సేకరించారు. అలాగే హార్డ్‌వేర్ షాపులోని సీసీ కెమెరాల్లో నమోదైన నిందితుల చిత్రాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
అపార్టుమెంటులో చోరీ
కడప అర్బన్ : కడప రిమ్స్ పోలీసు స్టేషన్ పరి ధిలో స్పిరిట్స్ కళాశాల ఎదురుగా ఉన్న జేఎస్‌ఆర్ అపార్టుమెంటులో గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున ప్లాట్ నెంబర్ 108 తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితులు వెంకట సుబ్బారెడ్డి, ధనలక్ష్మిలు గత నెల 31వ తేదీన అత్యవసర పనిమీద ఊరికి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాట్ తాళాలు పగులగొట్టి ఇంటిలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇంటిలో రూ. 2 లక్షల నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 270 గ్రాముల వెండి ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని రిమ్స్ ఎస్‌ఐ విద్యాసాగర్ తమ సిబ్బందితో పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వారు వచ్చి సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment