జావెద్ (ఫైల్)
వినుకొండటౌన్: నువ్వెల చనిపోయావయ్యా నా బిడ్డ.. చనిపోయే ముందు అమ్మ గుర్తుకు రాలేదా నాయానా.. అంటూ జావెద్ తల్లి జరినా కన్నీరు మున్నీరుగా మృతదేహం వద్ద విలపించింది. ప్రైవేటు పాఠశాలలో చదువుతూ సోమవారం రాత్రి జావెద్ మృతి చెందాడు. క్షణికావేశంలో విద్యార్థి తీసుకున్న నిర్ణయంతో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదనకు గురికాగా, మృతుని కుంటుంబలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టణంలోని రణహుస్సేన్ పంజా సమీపంలో నివాసం ఉంటున్న షేక్ షరీఫ్, జరినా దంపతుల కుమారుడు మహమ్మద్ అకీబ్ జావెద్ (15) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి జావెద్‌తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జావెద్ ఇంటికి దగ్గరలోనే ఉన్న నారాయణ టాలెంట్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. అందరు విద్యార్థులతో కలిసిమెలసి విద్యాభ్యాసం చేస్తున్న జావెద్ సోమవారం రాత్రి ట్యాషన్‌కు వెళ్లాడు. ట్యూషన్‌లో విద్యార్థుల మధ్య స్వల్ప వివాదం జరిగింది. వివాదాన్ని క్లాస్ టీచర్ పాఠశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రిన్సిపల్ ఇరువురిని విచారించి స్వల్పంగా మందలించి తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పారు.
తల్లిదండ్రులకు తెలిస్తే ఎక్కడ తనను మందల్లిస్తారోననుకున్న జావెద్ క్షణికావేశానికి గురైన ఆత్మహత్యకు పూనుకున్నట్లు తెలుస్తుంది. ట్యూషన్ నుంచి జావెద్ ఇంటర్‌వెల్ సమయంలో బయటకు వెళ్లిపోయాడు. విషయాన్ని ప్రిన్సిపల్ అతని తండ్రి షరీఫ్‌కు తెలియజేయడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాత్రి 11.30 సమయంలో ఏనుగుపాలెం రోడ్డులోని రైల్వేగేటు సమీపంలో జావెద్ వేసుకు వచ్చిన సైకిల్ నిలిచి ఉండటాన్ని గుర్తించారు. దీంతో వారు రైల్వే ట్రాక్ వెంట వెతుకుతుండగా కొద్దిదూరంలో జావెద్ మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లవాడు మూత్రవిసర్జనకు వెళ్లి వినికిడి లోపం వల్ల ట్రైను వస్తున్నది గమనించలేక పోయినందు వల్ల ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పట్టణ సీఐ టీవీ శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. గవర్నమెంటు రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఎస్సై డి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.
జావెద్ ఇంటి వద్ద విషాద ఛాయలు
జావెద్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న వారి బంధువుల రోదనలతో రణహుస్సేన్ పంజా బజారులో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా విద్యాశాఖ అ«ధికారి సూచన మేరకు స్థానిక గవర్నమెంటు ఉన్నత బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.ఏసుబాబు మృతదేహాన్ని సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment