మొహమ్మద్ షమీ, హసీన్ జహాన్ (ఫైల్ ఫొటో)
సాక్షి, కోల్‌కత్తా : తన భార్యతో తలెత్తిన వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ చెప్పిన నేపథ్యంలో ఆయన భార్య హసీన్ జహాన్ మరోసారి స్పందించారు. తాను ఫిర్యాదు చేయడానికి మునుపే ఆయనతో ఎన్నోసార్లు చెప్పి చూసేందుకు ప్రయత్నించానని, విభేదాలకు కారణాలు కూడా స్పష్టంగా వివరించానని అన్నారు. తన కుటుంబాన్ని రక్షించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆయన తన తప్పులను సరిదిద్దుకుంటే మరోసారి కలిసి బతికేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇది వరకే ఆమె స్పష్టం చేసిన విషయం విదితమే.
తన భర్త మోసగాడని, పలువురి మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని షమీ భార్య హసీన్ జహాన్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోల్‌కత్తా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తన క్రికెట్ కెరీర్‌కు కూడా స్వల్పకాలిక అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన షమీ.. ఈ వివాదాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా సామరస్యంగా చర్చించుకునేందుకు, తన భార్యతో మాట్లాడేందుకు సిద్ధం అని షమీ చెప్పారు. తన కుటుంబం, కూతురు, తన కెరీర్ ముఖ్యం అని అన్నారు. ప్రస్తుత పరిణామాల ప్రకారం వీరిద్దరి మధ్య వివాదం సమసిపోయేందుకు ఇంకెంతో సమయం పట్టదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment