
విశాఖ లీగల్: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన జె. శ్రీనివాసరావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ మేరకు నగరంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.నాగార్జున శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. విచారణ ప్రాథమిక స్థాయిలో ఉందని, సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయడం, ఆధారాల సేకరణ వంటివి ఇంకా పూర్తికావల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. గత నెల 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలో రెస్టారెంట్‌లో పనిచేసే శ్రీనివాసరావు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని హత్యచేయడానికి ప్రయత్నించడం తెలిసిందే.
ఈ కేసులో నిందితుడు తనను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఎన్ జయలక్ష్మి రాతపూర్వకంగా న్యాయమూర్తికి తమ వాదనలను దాఖలు చేశారు. నిందితునికి సంబంధించి ముమ్మడివరం కోర్టులో కొట్లాట కేసు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. కేసు పూర్తి విచారణ జరిగి తుది నివేదిక దాఖలు చేయడానికి సమయం పడుతుందన్నారు. ఈ కేసులో మరికొంత మందిని విచారించాల్సి ఉందన్నారు. దీంతోపాటు హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయడం సరైంది కాదన్నారు.
శ్రీనివాసరావు కేవలం రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తని, ఎయిర్‌పోర్టు లాంజ్ దగ్గరకు ఎందుకు వచ్చాడన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. రహస్య విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. శ్రీనివాసరావు తరపు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ దేశంలో పౌరులందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించినందున శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ కథనంతో ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్ తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment