
మేడిపెల్లి: ఎన్నో ఆశలతో దుబాయ్ లో అడుగుపెట్టిన ఓ యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం గోవిందారం వాసి పెద్ది శ్రీనివాస్(36) పదేళ్ల క్రితం రూ.2 లక్షలు అప్పు చేసి దుబాయ్ వెళ్లాడు. ఏడాదికోసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తున్నాడు. అక్కడ పనులు లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం తిరిగి వచ్చాడు.
ఇక్కడ కూడా పనులు దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారింది. దీంతో మూడు నెలల క్రితం మళ్లీ గల్ఫ్‌బాట పట్టాడు. సిరిసిల్లకు చెందిన ఓ ఏజెంటుకు రూ.70 వేలు చెల్లించి దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఇస్తున్న జీతం తన ఖర్చు లకే సరిపోవడం లేదు. కుటుంబపోషణ కూడా భారంగా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన గదిలో ఆదివారం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.