స్వైప్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తున్న వ్యాపారి
కోహెడరూరల్(హుస్నాబాద్) : కోహెడ మండలానికి చెందిన బోలుమల్ల రామయ్య ఒక సాధారణ రైతు. అయన బ్యాంకు ఖాతాలో రూ. 19000 వేలు ఉన్నాయి. ఇటీవల పంట కోత కోసం డబ్బులు కావాలని మండల కేంద్రలోని రెండు ఏటీఎం తిరిగాడు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో పని కాలేదు. రామయ్యకు తెలిసిన వ్యక్తి ఒకరు ఒక షాపు అడ్రస్ చెప్పాడు. అయన వద్దకు వెళ్లిన రామయ్య ఏటీఎం ఇచ్చి 14వేలు కావాలని చెప్పాడు.
దీంతో సదరు యజమాని తన ఖాతాలోని 14వేలు తీసి 13,600 రామయ్యకు ఇచ్చాడు. డబ్బులు లెక్కపెట్టిన రామయ్య 400 తక్కువగా ఉన్నాయని ఆడగగా మీకు పుణ్యానికి డబ్బులు ఇవ్వడానికి ఎమైనా ధర్మసత్రం నడుపుతున్నానా మీకు డబ్బులు ఇచ్చినందుకు మాకు ట్యాక్సులు పడుతాయి. మా ఆకౌంట్‌లో డబ్బులు వాడినందుకు రేపు లేనిపోని తలనొప్పులు వస్తాయని కోపగించకున్నాడు.
ఇలాంటి రామయ్యలు రోజుకు వందల సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో నగదు సమస్య పీడిస్తుంది. డబ్బుల కోసం సామాన్యులు నానా పాట్లు పడతున్నారు. వారి అవసరాలను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం తీసుకున్న స్వైపింగ్ మిషన్ల ద్వారా కమీషన్‌పై డబ్బులు ఇస్తూ దందా చేస్తున్నారు. నగదు రహత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యాపార సముదాయలలో స్వైపింగ్ మిషన్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
కొందరు వ్యాపారులు ఈ స్వైపింగ్ మిషన్లు వ్యాపారానికే కాకుండా కమీషన్‌కు డబ్బులు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. వ్యాపార సంస్థలే కాకుండా పెట్రోల్ బంకులు, వైన్‌షాపులు తదితర కమీషన్ వ్యాపారం జోరుగా సాగుతుంది. స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జరిపితే ఎలాంటి కమీషన్ తీసుకోవద్దని బ్యాంకర్లు సూచిస్తున్నా పలువురు వ్యాపారులు ఇలా విని అలా వదిలేస్తున్నారు.
డబ్బులు దొరక్కపోవడంతో...
పంట కోతలున్నాయి. చేతిల డబ్బులు లేవు. ఏటీఎంలో సరిపడా డబ్బులు రాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం.స్వైపింగ్ ద్వారా అయితే 5 నిమిషాల్లొ డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు పోతే పోయినాయి. కానీ అవసరాలు గట్టేకుతున్నాయి. –బోలమల్ల మహేందర్, స్థానికుడు
కమీషన్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి
స్వైపింగ్ ద్వారా కమీషన్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని వ్యాపారుల వద్దకు వెళ్తే స్వైపింగ్ మిషన్ ద్వారా కమీషన్ వసూలు చేస్తున్నారు. మా డబ్బులు తీసుకోవడానికి కూడా కమీషన్ ఇవ్వాల్సి వస్తోంది. –బి.శ్రీనివాస్, వరికోలు
Comments
Please login to add a commentAdd a comment