
బెంగుళూరు : స్నేహితురాలిని కలిసేందుకు వెళ్తున్న టెకీ ప్రణయ్ మిశ్రా(28) దారుణ హత్యకు గురయ్యాడు. బెంగుళూరులో సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్రణయ్ మిశ్రా ప్రముఖ ఐటీ కంపెనీ ఎక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
స్నేహితులతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసిన ప్రణయ్.. తన ఇంటికి చేరువలో ఉన్న స్నేహితురాలిని కలిసేందుకు సోమవారం తెల్లవారుజామున బయల్దేరి వెళ్లాడు. దారిలో ప్రణయ్‌ను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు కత్తితో నిర్దాక్షణ్యంగా దాడి చేసి, పారిపోయారు. రక్తపు మడగులో పడి ఉన్న ప్రణయ్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
తీవ్రగాయాలు కావడంతో రక్తం ఎక్కువగా పోయి ప్రణయ్ అప్పటికే ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన దుండగులు ప్రణయ్ వస్తువులను దోచుకెళ్లలేదని పోలీసులు చెప్పారు. ప్రణయ్ ఫోన్, ఇతర వస్తువులు జేబులోనే ఉన్నాయని తెలిపారు. ప్రణయ్ కాల్ రికార్డింగులను పరిశీలిస్తున్నామని, సన్నిహితులు, స్నేహితులు, సహచర ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment