దొంగల పని పట్టారు | Thief Gang Arrest In Visakhapatnam | Sakshi
Sakshi News home page

దొంగల పని పట్టారు

Published Wed, Sep 26 2018 7:29 AM | Last Updated on Fri, Sep 28 2018 1:44 PM

Thief Gang Arrest In Visakhapatnam - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న క్రైం డీసీపీ ఎ.ఆర్‌.దామోదర్‌

విశాఖ క్రైం: నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు కేసుల్లో నిందితులను విశాఖ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి బంగారం, నగదు, తొమ్మిది ద్విచక్రవాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీస్‌ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ ఎ.ఆర్‌.దామోదర్‌ మంగళవారం విలేకరులలో సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పెళ్లిళ్ల మోసగాడి అరెస్టు
నగరానికి చెందిన ఓ మహిళ మ్యారేజ్‌ బ్యూరోలో వివాహం నిమిత్తం వివరాలు నమోదు చేసుకుంది. హైదరాబాద్‌లోని బోయినపల్లిలో ఉంటున్న మాచర్ల శ్యామ్‌మోహన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసి మానేశాడు. తాను ఏసీబీ విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని నకిలీ పత్రాలతో అదే మ్యారేజ్‌ బ్యూరోలో వివరాలు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. బెంగళూరులో కాపురం పెడదామని, ఏసీలు తదితర సామగ్రి పంపించమని ఆమెను కోరాడు. ఈ విధంగా ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌నని చెప్పి పలువురు మహిళలను మోసం చేసి సుమారు రూ.7.5 లక్షల వరకు కాజేశాడు. శ్యామ్‌కు గతంలో పెళ్లి అయ్యింది. భార్య, పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకొని మోసపోయానని నిర్ధారించుకున్న మహిళ విశాఖ పోలీస్‌ ఉన్నతాధికారులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని పట్టుకొని రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకు నుంచి రూ.7.2 లక్షల డ్రా
గాజువాక దయాల్‌నగర్‌లో ఉంటున్న గొట్టివాడ తరుణ్‌కుమార్‌కు చెందిన ఎస్‌బీఐ అకౌంట్‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తి నకిలీ డాక్యుమెంట్లతో పలుమార్లు రూ.7.2 లక్షలు విత్‌డ్రా చేశాడు. ఈ మేరకు అతడు ఫిర్యాదు చేయగా సైబర్‌ క్రైం సీఐ గోపినాథ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పెదగంట్యాడకు చెందిన కాకినాడ రమణరావు(ఫిర్యాదు మేనమామ)గా గుర్తించారు. అతడి వద్ద నుంచి రూ.లక్ష నగదు రెండు సెల్‌ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
దువ్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుధీర్‌ అనే వ్యక్తి వద్ద కడిమి నాగేశ్వరరావు కారు అద్దెకు తీసుకున్నాడు. కొద్దిరోజుల క్రితం ఆ కారును పశ్చిమ గోదావరి జిల్లాలో విక్రయించేశాడు. దీనిపై సుధీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు.
టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బెజ్‌కృష్ణ హోటల్‌ దరి సిరి ఇన్ఫోటెక్‌ సంస్థలో రెడ్డి సందీప్‌ అనే యువకుడు ఐదు మోనిటర్లు దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులుమోనిటర్లను బ్యాగ్‌లో పట్టుకొని వెళ్తున్న సందీప్‌ను  ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మోనిటర్లను స్వాధీనం చేసుకున్నారు.
నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక కంప్యూటర్‌ సెంటర్‌లో పనిచేస్తున్న చెర్ల సతీష్, అనురుద్ధీన్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ దొంగిలించారు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.
మల్కాపురంలో ప్రాంతంలో నంద వెంకటరామరాజు, గణేష్‌కుమార్‌ ఎనిమిది ద్విచక్రవాహనాలను దొంగిలించారు. దీనిపై బాధితులు మల్కాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి వాహనాలను స్వాధీనం చేస్తున్నారు.
గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆటోలో వెళ్తున్న ఒక మహిళా బ్యాగ్‌లో రూ.75 వేలు చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాపు చేపట్టారు. ఆటోలో ఆమె పక్కన కూర్చున్న జ్యోతి అనే మహిళ బ్యాగ్‌ కట్‌ చేసి డబ్బులు అపహరించినట్లు గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. ఆమె వద్ద రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్రలో మళ్ల శ్రీనివాసరావు జేబు నుంచి రూ.1.2 లక్షలను దొంగలు అపహరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోర్ల పోలిరాజు, చుక్క బంగారురాజు, దాసరి అప్పలరాజును అరెస్ట్‌ చేసి సొమ్ము రికవరీ చేశారు.
15 రోజుల క్రితం షేక్‌ నజీమ్‌ అనే వ్యక్తిని అనిట్స్‌ కళాశాల వద్దకు రమ్మని చెప్పిన నలుగురు వ్యక్తులు కత్తులతో బెదిరించి మూడు తులాల బంగారం చైన్, ఉంగరం లాక్కొన్నారు.
దీనిపై బాధితుడు భీమిలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నిందితులు అవినాష్‌రెడ్డి, వేముల వీర వెంకటశివగణేష్, బయ్యి గణేష్, దాలిబోయిన రాజాను అరెస్టు చేశారు. బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
గాజువాక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యలమశెట్టి మహేష్‌బాబు, దొంగల ముత్యాలనాయుడు ఐదు  ద్విచక్రవాహ¯నాలు దొంగలించారు. అలాగే ఓఎల్‌ఎక్స్‌లో ఒక వ్యక్తి బైక్‌ యాడ్‌ పెట్టాడు. ఇది చూసిన ముత్యాలనాయుడు టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తానని చెప్పి వాహనంతో పారిపోయాడు. ఈ రెండింటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్‌ చేసి వాహనం, 57 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఏడీసీపీ సురేష్‌బాబు,  సీఐలు రాజులునాయుడు, గోపినాథ్, పైడిపునాయుడు పాల్గొన్నారు. ఈ కేసుల్లో చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సిబ్బందికి నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్రలడ్డా రివార్డులు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement