సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో తీవ్ర సంచలనం రేపిన పీఎం పాలెం దోపిడీ కేసును విశాఖ క్రైం పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని సోమవారం అరెస్ట్ చేసి వారి నుంచి 12.50 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా విశాఖ క్రైం డీసీసీ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సుదర్శన్ రెడ్డి పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టమని చెప్పారు. అరెస్టు అయిన వారంతా విశాఖకు చెందిన వారేనని, నిందితులపై గతంలో కలకత్త, పంజాగుట్ట, ఆనకాపల్లీ, శ్రీకాకుళం, గోపాలపట్నంలలో ఇలాంటి కేసులే నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. పోలీసుల వివరాలు ప్రకారం... విశాఖ రైల్వే న్యూ కాలనీకి చెందిన కోటేశ్వర రావు కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతంలో నివసించే అతడి బావ ఏటూరి చిట్టిరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో చిట్టిరాజుకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
ఈ క్రమంలో తాను బంగారం అవసరమైతే తక్కువ రేటుకి ఇప్పిస్తానని, అయితే అరకేజి కంటే తక్కువ బంగారం ఇవ్వడం సాధ్యం కాదని చిట్టిరాజు, కోటేశ్వరరావును నమ్మించాడు. ఈ నేపథ్యంలో చిట్టిరాజు, కోటేశ్వర రావులను 20 లక్షల రూపాయలను తీసుకు రమ్మని వారిని చెప్పి దోపిడీ చేయాలని ప్రయత్నించి రెండు సార్లు విఫలమయ్యారు. చివరగా గత నెల ఆగస్ట్ 17న మరోసారి పిఎం పాలెం క్రికెట్ స్టేడియం దగ్గరికి 20 లక్షల రుపాయలు తీసుకుని రమ్మని చెప్పాడు. ఆ డబ్బును బయటకు తీసి లెక్కబెడుతుండగా ఇన్నోవా వాహనంలో పోలీస్ సైరన్‌తో వచ్చి వారిని భయపెట్టి 20 లక్షలతో ఉడాయించాడు. ఇక జరిగిన సంఘటనపై బాధితుడు కోటేశ్వర రావు స్థానిక పోలీసుల స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కోటేశ్వరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎంవీపీ పోలీసులు డీసీపీ సురేష్ బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment