వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఉదయ్ భాస్కర్, నిందితుడు సంతోష్
సాక్షి, గాజువాక(విశాఖపట్నం) : ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన ఒక యువకుడు అప్పుల పాలై వాటిని తీర్చడానికి తాను పని చేస్తున్న సంస్థకే కన్నం వేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి రూ.9.42లక్షల నగదు, ఇతర సొత్తు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోన్ – 2 డీసీపీ ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... పెదగంట్యాడ నిర్వాసిత కాలనీ సిద్ధేశ్వరం గ్రామానికి చెందిన బొండాల సంతోష్ (31) ఎంబీఏ చదివాడు. అక్కిరెడ్డిపాలెంలోని సింహపురి ట్రాన్స్‌పోర్టు ఆఫీసులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. 2010లో రూ.6వేల జీతానికి సూపర్‌వైజర్‌గా చేరిన సంతోష్ తొమ్మిదేళ్లుగా అక్కడే పని చేస్తుండటంతో క్యాషియర్‌గా ప్రమోట్ చేసి రూ.15వేలు చెల్లిస్తున్నారు.
అప్పులు తీర్చేందుకు దొంగావతారం
ఈ నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో గత మూడేళ్లుగా ఆన్‌లైన్ రమ్మీ, జంగిల్ గేమ్స్ ఆడటానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో వ్యసనాలకు కూడా బానిసయ్యాడు. తనకు వచ్చే జీతం చాలకపోవడంతో ఐసీఐసీఐ, ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో అప్పులు వాడేశాడు. వాటితోపాటు తెలిసిన వారివద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేసి ఆన్‌లైన్ గేమ్‌లలో పోగొట్టుకున్నాడు. అప్పులను తిరిగి చెల్లించాలని బ్యాంకులు, అప్పులిచ్చిన వారు వస్తారన్న భయంతో తాను పని చేస్తున్న సంస్థలోనే డబ్బులను కాజేయాలని నిర్ణయించుకున్నాడు.
తన పథకం ప్రకారం గత నెల 30న రాత్రి విధులు ముగించుకొన్న తరువాత కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో మేనేజర్ డెస్క్‌ను విరగ్గొట్టి అందులో ఉన్న రూ.11 లక్షలను తస్కరించాడు. అప్పటి నుంచి విధులకు కూడా హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. తమ కార్యాలయంలో నగదు చోరీకి గురైందని మేనేజర్ వడ్లమూడి సురేష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సౌత్ క్రైం సీఐ ఎం.అవతారం ఆధ్వర్యంలో సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో సంతోష్ చోరీకి పాల్పడినట్లు తేలడంతో దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్టు డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.9,42,500 నగదుపాతోటు రూ.56,500 విలువైన 18 గ్రాముల బంగారు గొలుసు, ఒక బ్లూటూత్ డివైస్, ఒక సెల్‌ఫోన్, అమెరికన్ టూరిస్టు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో ప్రతిభ చూపిన క్రైం సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో అదనపు క్రైం డీసీపీ సురేష్‌బాబు, క్రైం ఏసీపీ టి.పి.ప్రభాకర్, ఎస్‌ఐలు జి.వెంకటరావు, ఐ.దామోదర్‌రావు, జి.సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment