ఎమ్మిగనూరు వాల్మీకి సర్కిల్ వద్ద మౌనిక ట్రేడర్స్ దుకాణాన్ని పరిశీలిస్తున్న సీఐ వి.శ్రీధర్, ఎస్‌ఐ హరిప్రసాద్
కర్నూలు, ఆదోని: వరుస చోరీలతో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. 20 రోజుల క్రితం ఆదోని పట్టణంలో దోపిడీకి పాల్పడగా.. శుక్రవారం ఎమ్మిగనూరులో నాలుగు ఎరువుల దుకాణాల్లో అందిన కాడికి దోచుకెళ్లారు. రెండూ కూడా జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు కావడం పోలీసుల నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆదోని ఘటన మరవకముందే ఎమ్మిగనూరులో దొంగలు పడటం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కేసులను ఛేదించడంలో పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే చోరీలు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అతీగతీలేని దోపిడీ కేసు..
ఆదోని పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్ రోడ్డులో గత నెల 21న ఐదు జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమలు, ఒక రైస్ మిల్లు, 30న పట్టణంలోని మున్సిపల్ ఎంఎం రోడ్డులోని స్టేట్ బ్యాంకు ఏటీఎంలో చొరబడి దోపిడీకి తెగబడ్డారు. ఆరు పరిశ్రమల్లో జేపీఆర్ జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలో మాత్రం రూ.82వేలు దోచుకెళ్లారు. మిగిలిన పరిశ్రమల్లో ఏమీ దొరకలేదనే అక్కసుతో సెక్యూరిటీ గార్డులను చితక బాది వెళ్లారు. పట్టణంలోని ఎంఎం రోడ్డులో ఉన్న ఏటీఎంలో క్యాష్ బాక్స్ పగలక పోవడంతో ఉత్తి చేతులతో వెనుదిరిగారు. ఏటీఎంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ అది పని చేయలేదు. విద్యుత్ సరఫరా లేక పోవడం, బ్యాటరీలు పని చేయక పోవడం వల్లే సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వారి కదలికలు నమోదు కాలేదని తెలుస్తోంది. ఆరు పరిశ్రమల్లో జేపీఆర్‌లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. టీడీపీ ఆదోని ఇన్‌చార్జ్ మీనాక్షినాయుడుకు చెందిన సులోచనమ్మ జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీతో సహా మరో నాలుగు పరిశ్రమల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదు. దోపిడీకి యత్నించిన ముఠా సభ్యులు ముసుగు ధరించినట్లు జేపీఆర్ పరిశ్రమలో నమోదైన సీసీ పుటేజీలను బట్టి తెలుస్తోంది. అయినా ఇంత వరకు అతీగతీ లేదు.
వారు..వారేనా?
ఆదోనిలో దోపిడీకి పాల్పడిన వారు శుక్రవారం ఎమ్మిగనూరులో చోరీ చేసిన వారు ముసుగులు ధరించి ఉండటం, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం అక్కడా.. ఇక్కడా ఐదుగురే పాల్పొనడం బట్టి చూస్తే వారు వీరేనా అనే అనుమానం కలుగకమానదు. ఇక రెండు చోట్ల కూడా జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలనే ఎన్నుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కాగా ఆదోని ఘటనలో కేసు దర్యాప్తుకు అవసరమైన ఆధారాలు ఉన్నప్పటికీ దోపిడీ ముఠాను పోలసులు ఎందుకు గుర్తించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ముఠాను వెంటనే అరెస్ట్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నాలుగు ఎరువు దుకాణాల్లో చోరీ
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని గురువారం అర్ధరాత్రి నాలుగు ఎరువుల దుకాణాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని శ్రీనివాస సర్కిల్‌లో నందీశ్వర హైబ్రిడ్ సీడ్స్, శ్రీ లక్ష్మీనరసింహ రసాయన ఎరువులు, వాల్మీకి సర్కిల్ వద్ద మౌనేశ్వర ట్రేడర్స్, వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లోని మల్లికార్జున ట్రేడర్స్ షాపుల్లో అర్ధరాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఈ నాలుగు షాప్‌లకు డోర్స్‌ను తొలగించి లోపలికి దూరి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మల్లికార్జున ట్రేడర్స్‌లో రూ.70 వేల నగదు, నందీశ్వర హైబ్రిడ్ షాప్‌లో రెండు వెండి కాయిన్స్, మౌనిక ట్రేడర్స్‌లో రూ.2 వేల నగదు పట్టుకెళ్లారు. ఉదయం టీ తాగటానికి వచ్చిన వారు గమనించి యజమానులకు సమచారమందించడంతో వారు అక్కడికి చేరుకొని పట్టణ పోలీసులకు చేరవేశారు. పట్టణ సీఐ వి.శ్రీధర్, ఎస్‌ఐ హరిప్రసాద్ సంఘటనా స్థలాలను పరిశీలించి చోరీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని టౌన్ సీఐ వి.శ్రీధర్ విలేకరులకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment