వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి | Three People Died In Ganesh Nimajjanam In Srikakulam | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి

Published Fri, Sep 13 2019 11:01 AM | Last Updated on Fri, Sep 13 2019 11:01 AM

Three People Died In Ganesh Nimajjanam In Srikakulam - Sakshi

మృతి చెందిన హేమంత్‌కుమార్‌, యారబాటి వేణుగోపాల్‌, ధర్మాన రాంబాబు 

మేళతాళాలతోపాటు కోలాటాల సందడి హోరు.. డీజే సౌండ్స్‌కు అనుగుణంగా యువకుల స్టెప్పుల జోరు.. ఇలా ఎంతో ఉత్సాహంగా... వినోదభరితంగా సాగిపోతున్న వినాయక ఉత్సవ ఊరేగింపులో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. వినాయక ఉత్సవం చూడటానికి ఎంతో ఆనందంగా తన తాతగారింటికి వచ్చిన ఆరేళ్ల బాలుడిని మృత్యువు రూపంలో వచ్చిన వినాయక విగ్రహం బలి తీసుకుంది. ట్రాక్టరుపై నుంచి పడిన విగ్రహం కిందే పసిప్రాణం నలిగిపోయింది.

కుటుంబానికి భారం కాకూడదని డైలీ వేజస్‌ పనిలో చేరిన ఇంటర్‌ విద్యార్థి ఎదుగదలను చూడలేని యముడు విద్యుత్‌ రూపంలో వచ్చి ప్రాణాలు తోడేశాడు. అప్పటి వరకూ తోటి కార్మికులతో ఎంతో ఉల్లాసంగా సీరియల్‌ లైటింగ్‌ తొలగిస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అంతవరకూ సందడిలో ముగిగిపోయిన భక్తులు గొల్లుమన్నారు. అప్పుడే నూరేళ్లు నిండాయా అని వారి తల్లులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. ట్రాక్టరుపై ఊరేగింపులో విద్యుత్‌ తీగలు తగిలి వ్యక్తి మరో ఘటనలో మృతిచెందాడు. 

ప్రమాదాలు.. ఎక్కడెక్కడ, ఎలా జరిగాయి..
పొందూరు మండలం బురిడికంచరాం గ్రామంలో బుధవారం రాత్రి వినాయక ఊరేగింపులో ట్రాక్టర్‌ చక్రాలు బురద గుమ్మిలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా అదుపు తప్పడంతో గణపతి విగ్రహం వెనుకకు వాలి కింద పడిపోయింది. ఆ సమయంలో ట్రాక్టర్‌ వెనుక పెద్ద పిల్లలు తప్పించుకోగా ముక్కుపచ్చలారని యారబాటి వేణుగోపాల్‌ (6) విగ్రహం కింద నలిగిపోయాడు.
పోలాకి మండలం తోటాడకు చెందిన అలిగి హేమంత్‌కుమార్‌ (19) గురువారం మధ్యాహ్నం తోటి కార్మికులతో నరసన్నపేటలో విద్యుత్‌ సీరియల్‌ లైటింగ్‌ తొలగిస్తున్నాడు. విద్యుత్‌ తీగలకు లైటింగ్‌ కర్ర తగలడంతో దానికి ఉన్న జియా వైరు ద్వారా విద్యుత్‌ ప్రవహించి షాక్‌ గురయ్యాడు. అదే స్థలంలో వర్షపు నీటిలో పడటంతో కార్మికుల కళ్లెదుటే అక్కడికక్కడే మృతి చెందాడు.
సారవకోట మండలం బుడితి గ్రామంలో బుధవారం రాత్రి ట్రాక్టర్‌పై నిల్చొన్న ధర్మాన రాంబాబు(49)కు పైనున్న విద్యుత్‌ తీగలు తగలడంతో ఒక్కసారిగా కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.

నరసన్నపేటలో విషాదం
నరసన్నపేట:
పోలాకి మండలం తోటాడకు చెందిన అలిగి హేమంత్‌కుమార్‌ (19) శివానీ లైటింగ్‌ సంస్థలో డైలీ వేజస్‌గా రెండు రోజులుగా పనికి వస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం స్థానిక పాత స్టేట్‌బ్యాంకు వీధిలో వినాయక మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సీరియల్‌ లైట్లు తొలగిస్తున్నాడు. పదకొండు గంటల సమయంలో వర్షం పడటంతో పని నిలిపి మళ్లీ సాయంత్రం అరుకు చెందిన ఎస్‌ దేవుడు, కే డంబు, కల్లె మోహన్‌లతో కలసి మొదలు పెట్టారు. రోడ్డుకు రెండు వైపులా లైట్లు కట్టేందుకు పెట్టిన కర్రలకు జియా వైర్‌ తీస్తున్నప్పుడు ప్రమాదానికి గురై మృతి చెందాడు.

► ప్రాణాలతో బయటపడ్డ మరో ముగ్గురు..
ఘటనా స్థలంలో దేవుడు, డంబు, మోహన్‌ వెంటనే మేల్కోని చేతిలో ఉన్న జియా వైర్‌ను విసిరి వేయడంతో క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డారు. హేమంత్‌కు విద్యుత్‌ పని చేసిన అనుభవం లేకపోవడంతో ప్రమాదానికి గురయ్యాడని చెబుతున్నారు.
నిరుపేద కుటుంబం...
హేమంత్‌కుమార్‌ తండ్రి అనంతరావు రిక్షా డ్రైవర్, పోలాకిలో రిక్షా తొక్కుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి లక్ష్మి వ్యవసాయ కూలీ. వీరికి ఇద్దరు పిల్లలు కాగా ఆరేళ్ల క్రితం కుమార్తె అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పోలాకి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో ఇంటర్‌ చదువుతున్న హేమంత్‌ సెలవుల్లో, కళాశాల విడుదల చేసిన తర్వాత డైలీ వేజస్‌కు పనికి వెళ్తుంటాడు. ఈ విధంగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పరామర్శించారు. మృతుడి తల్లి లక్ష్మిని ఓదార్చారు. అన్ని విధాలా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  ప్రమాద స్థలాన్ని నరసన్నపేట ఎస్‌ఐ వీ సత్యనారాయణతోపాటు విద్యుత్‌ శాఖ ఏడీ రామునాయుడు, ఏఈ చంద్రమౌళి తదితరులు పరిశీలించి ప్రమాద వివరాలు నమోదు చేశారు.

విగ్రహం కింద పడి..
పొందూరు:
మండలంలోని బురిడికంచరాం గ్రామంలో గణపతి విగ్రహ ఊరేగింపులో గోరింట గ్రామానికి చెందిన యారబాటి వేణుగోపాల్‌(6) మృతి చెందాడు. వేణుగోపాల్‌ తన తల్లిదండ్రులు మంగమ్మ, రమణ, అన్నయ్య కార్తీక్‌లతో కలసి మంగళవారం ఉదయం బురిడికంచరాంలో తాతగారికి ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి తాతగారి కుటుంబంతో ఎంతో సరదాగా గడిపాడు. బుధవారం ఉదయాన్నే తిరిగి స్వగ్రామం వెళ్లిపోదామనుకున్నాడు. అయితే వినాయక నిమజ్జనోత్సవాన్ని చూద్దామని ఉండిపోయాడు. అదేరోజు రాత్రి ఊరేగింపులో ట్రాక్టర్‌ వెనుక ఉత్సాహంగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో విగ్రహం కింద పడిపోవడంతో పెద్ద పిల్లలు తప్పించుకోగా ముక్కుపచ్చలారని బాలుడు వేణుగోపాల్‌ ఉండిపోయాడు.

వెంటనే విగ్రహం శిథిలాలను తొలగించి బాలుడిని తీశారు. తలకు తీవ్ర గాయం కావడంతో 108కి సమాచారమిచ్చి కారులో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. ఎచ్చెర్లకు కారు చేరుకోగానే 108 వాహనంలో బాలుడిని ఎక్కించి ఆక్సిజన్‌ పెట్టి తరలించారు. శ్రీకాకుళం ఆసుపత్రికి కొంత దూరంలో ఉండగానే ప్రాణాలు విడిచాడు. గురువారం మధ్యాహ్నం శ్రీకాకుళం రిమ్స్‌లో పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ మహ్మద్‌ యాసిన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్రవించిన హృదయం...
మృతదేహాన్ని గోరింట గ్రామానికి మధ్యాహ్నం తీసుకువచ్చారు. అభం శుభం తెలియని కుమారుడిని తీసుకొస్తుండగా చూసిన తల్లి గుండెలవిసేలా బాదుకుంది. తన గారాలపట్టి ఇక లేడన్న సత్యాన్ని జీర్ణించుకోలేక ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయింది. తండ్రి ఆవేదన, తల్లి కడుపుకోతతో రోదిస్తుంటే వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.

రెండు గ్రామాల్లో విషాద ఛాయలు...
వేణుగోపాల్‌ మృతితో బాలుడు స్వగ్రామం గోరింటతోపాటు తాతగారి ఊరు బురిడికంచరాంలో ప్రజలంతా ఆవేదనలో మునిగిపోయారు. వేణుగోపాల్‌ స్వగ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రగాఢ సంతాపం తెలిపారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
సారవకోట: మండలంలోని బుడితి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రవికుమార్‌ వివరాల ప్రకారం... బుడితి గ్రామంలో బుధవారం రాత్రి నిమజ్జనానికి వినాయక విగ్రహానికి తరలిస్తున్న సమయంలో ట్రాక్టర్‌పై నిల్చొన్న ధర్మాన రాంబాబు(49)కు పైనున్న విద్యుత్‌ తీగలు తగలడంతో ఒక్కసారిగా కింద పడి పోయాడు. అయితే సిమెంట్‌ రోడ్డు మీద పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు సంజీవ్‌ ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం గురువారం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement