ఎక్కడో చంపి.. ఇక్కడ పడేసి..    | Un Known Dead Bodyies In Chowtuppal | Sakshi
Sakshi News home page

ఎక్కడో చంపి.. ఇక్కడ పడేసి..   

Published Fri, Jun 15 2018 12:50 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM

Un Known Dead Bodyies In Chowtuppal - Sakshi

గుర్తు తెలియని మృతదేహాలు (ఫైల్‌)

చౌటుప్పల్‌ మండల పరిధిలో గుర్తు తెలి యని వ్యక్తుల మృతదేహాలు లభించడం నిత్యకృత్యంగా మారింది. ఎక్కడో చంపి గుట్టుచప్పుడు కాకుండా శవాలను వాహనాల్లో తీసుకువచ్చి ఇక్కడ పడేస్తున్నారు. వీటికి సంబంధించిన కేసులు పోలీసులకు స వాల్‌గా మారుతున్నాయి. కేసులను ఛేదిం చేందుకు రోజుల తరబడి పోలీసులు నింది తులను వేటాడాల్సి వస్తోంది. 

చౌటుప్పల్‌(మునుగోడు) : హైదరాబాద్‌–విజయవాడ 65 నంబర్‌ జాతీయ రహదారి.. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే చౌటుప్పల్‌ పరిసర ప్రాంతంలో తరుచూ మృతదేహాలు లభ్యమవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. పోలీసులకు సవాలుగా మారింది.

ఇక్కడ లభిస్తున్న మృతదేహాలన్నీ స్థానికులవి కాదు.. దూర ప్రాంతాలకు చెందిన వ్యక్తులవి. ఎక్కడనో చంపి, గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడకు తీసుకొచ్చి పడేసిపోతున్నారు. మృతులకుగానీ, నిందితులకుగాని ఈ ప్రాంతంతో ఎలాంటి సంబంధం కూడా ఉండడం లేదు.

ఇవి కూడా జాతీయ రహదారికి సమీప ప్రాంతాల్లోనే లభిస్తుండడం గమనార్హం. జాతీయ రహదారిపై పంతంగి గ్రామం వద్ద ఉన్న టోల్‌ప్లాజా వరకు వెళ్లకుండా ముందుగా ఉన్న గ్రామాల్లోనే శవాలను పడేస్తున్నారు.  

వివాహేతర సంబంధాల నేపథ్యంలోనే..

మండలంలో లభిస్తున్న గుర్తుతెలియని మృతదేహాల కేసులన్నీ వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగినవే. ఈ హత్యలన్నీ చౌటుప్పల్‌కు చాలా దూరంలో జరుగుతున్నవే. కానీ మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడేసి పోతున్నారు.

మృతులంతా 35ఏళ్ల లోపు వారే. మండలంలో ఇప్పటి వరకు లభించిన గుర్తుతెలియని శవాల కేసులన్నీ పోలీసుల విచారణలో వివాహేతర సంబంధాల మూలంగా జరిగిన హత్యలుగా తేలాయి. శవాలను తీసుకువచ్చే వ్యక్తులకు ఈ ప్రాంతంతో ఎలాంటి సంబంధాలు సైతం లేవు.కానీ హైదరాబాద్‌కు సమీపంలో ఉండడం, రవాణా వ్యవస్థ బాగుండడంతో రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని నిందితులు ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. 

పోలీసులకు సవాలు 

మండలంలో లభిస్తున్న గుర్తుతెలియని మృతదేహాల కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి.  లభ్యమైన ప్రాంతాల్లో ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో కేసులను చేధించేందుకు పోలీసులకు సమయం పడుతుంది. ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకురావడంతో ఆధారాలు దొరకడం లేదు.

కేసును ఛేదించేందుకు రోజుల తరబడి పోలీసులు వేటాడాల్సి వస్తుంది. 2015 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఐదు గుర్తుతెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో నాలుగు కేసులను పోలీసుల ఛేందించారు. తాజాగా గత నెల 31న లభ్యమైన శవానికి సంబంధించిన కేసును ఛేదించాల్సి ఉంది. 

 2016 జూన్‌ 6న : మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం బసవాయిపల్లి గ్రామానికి చెందిన కురువ హనుమంతు(28), సాయమ్మ(23)లు భార్యాభర్తలు. సాయమ్మకు అదిలేకి బాలప్ప(20) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తాపీమేస్త్రీగా పనిచేసే హనుమంతు భార్యతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి పనిచేస్తున్నాడు.

తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి మద్యం సేవిస్దామని నమ్మించి లక్కారం గ్రామ శివారులోని అటవీ భూమిలోకి తీసుకువచ్చి బండ రాళ్లతో హత్య  చేశారు. మృతదేహాన్ని చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామ సమీపంలో పడేసి వెళ్లిపోయారు. నెల రోజుల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

2015 జూన్‌ 2 : తనతో కాపురం చేయకుండా వేధిస్తున్నాడని భార్య తన భర్తను హత్య చేయించింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం చెరువులమాదారం గ్రామానికి చెందిన సంకటి మల్లేష్‌(35), భారతమ్మ(30)లు భార్యాభర్తలు. వీరివురి మధ్య గొడవలు తలెత్తడంతో వేరుగా ఉంటున్నారు.

అందులో భాగంగా మల్లేశ్‌ చౌటుప్పల్‌కు వచ్చి కూలి పని చేసుకుంటున్నాడు. తనతో సక్యతగా లేని భర్తను అంతమందించాలని చౌటుప్పల్‌లోనే ఉంటున్న తన తమ్ముడైన నాగరాజుతో కలిసి భారతమ్మ పన్నాగం పన్నింది.

విషయాన్ని తమ్ముడకి చెప్పడంతో అంగీకరించిన అతను తన మిత్రులతో కలిసి మల్లేశ్‌ను మాట్లాడుకుందామని చెప్పి  లక్కారం శివారులో ఫారెస్ట్‌లోకి తీసుకెళ్లారు. అక్కడే చంపి ఒంటిపై పెట్రోల్‌ పోసి తగలపెట్టారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు.

2017 డిసెంబర్‌ 30న : ప్రియుడి మోజులో పడిన భార్య కట్టుకున్నవాడిని కడతేర్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం రాచార్ల గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు(35)కు హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన జ్యోతి(22)తో వివాహమైంది. జ్యోతికి పెళ్లికి ముందు నుంచే అదే ప్రాంతానికి చెందిన కార్తీక్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది.

వివాహం జరిగి కుమార్తె, కుమారుడు పుట్టేవరకు సంబంధాన్ని ఆపేసిన జ్యోతి ఆ తర్వాత కార్తీక్‌తో బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.   జ్యోతి, కార్తీక్, అతని మిత్రులతో కలిసి పాలల్లో మత్తు కలిపి నాగరాజును హత్య చేశారు. శవాన్ని చౌటుప్పల్‌ మండలం జిల్లేడుచెల్క గ్రామం వద్ద పడవేశారు. నాలుగు రోజుల్లో పోలీసులు కేసును ఛేదించి నిందితులను అరెస్ట్‌ చేశారు.

వివాహేతర సంబంధాలు, భూవివాదాలతోనే హత్యలు

భూవివాదాలు, వివా హేతర సంబంధాల నేపథ్యంలోనే ఎక్కువ హత్యలు జరుగుతాయి. ఎక్కడో చంపి శవాలను ఇక్కడికి తెచ్చి వేస్తున్నారు. గత నెల 31న అంకిరెడ్డిగూడెం వద్ద శవం లభించింది. కేసును అన్ని విధాల పరి శోధనలు చేస్తున్నాం. త్వరలోనే ఛేదిస్తాము. నిందితులను అరెస్టు చేస్తాం. – ఏరుకొండ వెంకటయ్య, సీఐ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement