
సిరిసిల్లటౌన్: అప్పులబాధ భరించలేక గాజంగి సాయి(23)అనే యువ నేతకార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేటకు చెందిన సాయి ఓ వస్త్రపరిశ్రమ యజమాని వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఐదేళ్లక్రితం తండ్రి ప్రభాకర్ కూడా అప్పుల బాధతో ఉరివేసుకుని చనిపోయాడు. తల్లి వసంత బీడీలు చుడుతూ కుమారుడు సాయి, కూతురు రేఖను పోషిస్తోంది. మూడేళ్లుగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయి.. ఏడునెలల క్రితం చెల్లెలు రేఖ వివాహం జరిపించాడు.
ఈ క్రమంలో ఇందుకోసం కొంత అప్పు చేశాడు. కుటుంబపోషణ, వివాహంకోసం తెచ్చిన అప్పు మొత్తంగా రూ. 2 లక్షలకు చేరింది. అప్పు ఇచ్చినవారిలో సమీప బంధువులు, స్నేహితులు ఉండటంతో వారి బాకీ సమయానికి తీర్చలేనన్న బెంగతో ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో సాయి ఉరివేసుకుని చనిపోయాడు.
బంధువుల ఇంటికి వెళ్లిన సాయి తాత దత్తు బుధవారం ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి మనవడు విగతజీవిగా దూలానికి వేలాడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో నేత కార్మికుల వరుస ఆత్మహత్యలతో సిరిసిల్ల తల్లడిల్లింది. ఈ క్రమంలోనే కార్మికులకు ధైర్యాన్ని అందిస్తూ.. వైఎస్ విజయమ్మ సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment