సాక్షి, న్యూఢిల్లీ: రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాపై మోసం, నేరపూరిత కుట్ర అభియోగాల కింద గూర్గావ్‌లో కేసు నమోదైంది. హోంస్టెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ 2012లో బాలెట్ బై షరపోవా పేరుతో విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను నిర్మించేందుకు భారీ మొత్తంలో పెట్టుబడులు సేకరించింది. ఈ కంపెనీకి షరపోవా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు.
ఈ అపార్ట్‌మెంట్‌లో టెన్నిస్ అకాడమీ, క్లబ్ హౌస్, హెలీప్యాడ్ కూడా ఉంటుందని అప్పట్లో నిర్వాహకులు ప్రకటించడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. 2013లో ఒప్పందాలు కుదుర్చుకున్నా.. 2016లోపు నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటివరకు కనీసం నిర్మాణాలు కూడా మొదలుకాకపోవడంతో కొనుగోలుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇంటి యజమానులకు అనుగుణంగా ప్రత్యేకమైన, భిన్నమైన ఇండ్లను అందించడమే తమ లక్ష్యమని షరపోవా చెబుతున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో రాశారని, ,అందుకే ఈ కేసులో ఆమె హస్తం కూడా ఉందని న్యాయవాది పీయూష్ సింగ్ ఆరోపించారు. ఇక మాజీ వరల్డ్ నెం1 టెన్నిస్ ర్యాంకరైన షరపోవా 2015లో ఫోర్బ్స్ కథనం మేరకు 23 మిలియన్ల డాలర్లను ప్రచారకర్తగా ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment