
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ గాంధీనాయక్
సాక్షి, నాగర్‌కర్నూల్ : వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడని పథకం ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. అనంతరం పోలీసుల విచారణతో ఆందోళన చెంది హత్యానేరాన్ని భార్య ఒప్పుకుంది. ఈ ఘటన తాడూరు మండలం పర్వతాయిపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. కేసుకు సంబంధించి సీఐ గాంధీనాయక్ తెలిపిన వివరాలిలా.. తాడూరు మండలం పర్వతాయిపల్లికి చెందిన దాసరి యాదయ్య (35), భాగ్యమ్మ దంపతులు. యాదయ్య గత నెల 28న ఇంటి నుంచి మేస్త్రి పనిచేసేందుకు నాగర్‌కర్నూల్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతికినా ఎలాంటి లాభం లేకుండాపోయింది. అయితే, ఈ నెల 1న చెర్ల తిర్మలాపూర్, తుమ్మలసూగరు మధ్యలోగల కేఎల్‌ఐ కాల్వలో ఒక మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో కటుంబసభ్యులు అక్కడికి వెళ్లి పరిశీలించి అది దాసరి యాదయ్యగా గుర్తించారు.
అనుమానాస్పద మృతిగా కేసు..
అయితే, మృతుడి ద్విచక్రవాహనం ఘటనా స్థలికి 2కిలోమీటర్ల దూరంలో కాల్వలో పడివుండటంతో అనుమానం వచ్చిన మృతుడి తమ్ముడు దాసరి పురుషోత్తం తాడూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా పోలీసులు విచారణ ప్రారంభించడంతో ఆందోళన చెందిన మృతుడి భార్య భాగ్యమ్మ బుధవారం సర్పంచ్ బాల్‌రెడ్డి దగ్గరకు వెళ్లి తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చినట్లు తెలిపింది. వెంటనే సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించగా వారు భాగ్యమ్మను అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో విచారించారు.
అడ్డుతొలగించుకోవాలనే..
ఈమేరకు భాగ్యమ్మ వివరిస్తూ.. భర్త యాదయ్య స్నేహితుడు అయిన మెగావత్ గోవింద్‌తో చాలాకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుందని, విషయం భర్తకు తెలియడంతో చాలాసార్లు గొడవ జరిగిందని తెలిపింది. భర్తను ఎలాగైనా అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ప్రియుడితో కలిసి గత నెల 28న బిజినేపల్లికి వెళ్లి ఓ తాడు, మద్యం దుకాణంలో రెండు మద్యం బాటిళ్లు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు పేర్కొంది. అనంతరం ప్రియుడితో భర్తకు ఫోన్ చేయించి బ్రిడ్జి వద్దకు రమ్మని చెప్పగా.. భర్త యాదయ్య అక్కడి చేరుకోవడంతో వివాహేతర సంబంధం విషయం గురించి మాట్లాడుకుందామని అతన్ని నమ్మించి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. భర్త మద్యం మత్తులోకి జారుకోగా తాడుతో ఉరివేసి చనిపోయాడనే నిర్ధారించుకున్నారు. అనంతరం అతని మృతదేహాన్ని కాల్వలో పడేసి తిరిగి ఇంటికి వెళ్లిపోయామని పేర్కొంది. నిందితులు ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో తాడూరు ఎస్‌ఐ నరేందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment