![Women Seen In Video Holding Cobras During Garba In Gujarat - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/12/gujarat2.gif.webp?itok=dYfaN8r2)
గాంధీనగర్ : గార్భా వేడుకల్లో భాగంగా కొంతమంది మహిళలు విష సర్పాలతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు పన్నెండేళ్ల బాలికను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... నవరాత్రి ఉత్సవాల సందర్బంగా జునాగఢ్ జిల్లాలోని షిల్ గ్రామంలో గార్భా నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మహిళలు చేతిలో నాగుపాములను పట్టుకుని నృత్యం చేశారు. మరో మహిళ ఓ చేతిలో కత్తి పట్టుకుని.. మరో చేతిలో పామును ఆడిస్తూ విన్యాసాలు చేసింది. ఈ విషయం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు.
ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ.. ‘ షిల్ గ్రామంలో పాములతో నృత్యాలు చేస్తున్నారన్న విషయం మాకు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు పాముల కోరలు తీసేసిన నిందితులు.. మరో పామును మాత్రం అలాగే ఉంచి ప్రమాదకర విన్యాసాలు చేశారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. మొత్తం ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. ప్రస్తుతం నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా... పాములను సరఫరా చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు’అని తెలిపారు. అయితే ఈ ఘటనలో అరెస్టైన నిందితులకు స్థానిక కోర్టు వెంటనే బెయిలు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment