సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, స్థానికులు, శ్రీధర్ (ఫైల్)
వరంగల్, హసన్‌పర్తి: రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. రైల్వే లోలెవల్ కింద చేరిన వరద నీటిని సకాలంలో తొలగించకపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మునిపల్లి–చింతగట్టు మార్గమధ్యలోని లోలెవల్ బ్రిడ్జిలో మంగళవారం రాత్రి జరగగా బుధవారం ఉదయం కుటుంబసభ్యులు గుర్తించారు. వివరాల్లోకెళితే.. మునిపల్లికి చెందిన యువరైతు దుర్గం శ్రీధర్(32) మంగళవారం రాత్రి పని ముగించుకుని చింతగట్టు నుంచి మునిపల్లికి బయల్దేరాడు. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ బ్రిడ్జిలో వరదనీరు చేరడం వల్ల రైలు పట్టాలు దాటి బ్రిడ్జి పిట్టగోడ పైనుంచి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారీ వరదనీటిలో పడ్డాడు. కాగా, శ్రీధర్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు బుధవారం ఉదయం గాలించారు. లోలెవల్ బ్రిడ్జిలో శ్రీధర్ చెప్పులు కనిపించడంతో అందులో గాలించగా శ్రీధర్ మృతదేహాం లభ్యమైంది.
గ్రామస్తుల ఆందోళన..
కాగా, రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే శ్రీధర్ నీటిలో పడి మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు కొంతసేపు సంఘటనా స్థలంలో ఆందోళన నిర్వహించారు. ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా వర్షాకాలంలో ఈ సమస్య నెలకొన్నప్పటికీ ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఓ దశలో ప్రధాన రహదారిపై మృతదేహంతో ధర్నాకు సిద్ధమయ్యారు. కాగా, స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ సతీష్‌బాబు వారిని సముదాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రమాదాన్ని ముందే చెప్పిన ‘సాక్షి’..
ఇదిలా ఉండగా మునిపల్లి–చింతగట్టు మధ్య ప్రమాదం ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. ఈనెల 4న ‘సాక్షి’లో ‘రాకపోకలు బంద్’ అనే కథనం ప్రచురితమైంది. కాగా, అందులో చేరిన వరద నీరు తొలగించడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment