
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒక పథకం ప్రకారం ఇలాంటి కుట్రలను అడ్డుకోవడానికి తక్షణం చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఐటీ సెల్ నాయకుడు ఏ హర్షవర్ధన్ రెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు సోమవారం హైదరాబాద్ అంజనీ కుమార్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి పేరును ఆయన ఫోన్ నంబరును దుర్వినియోగం చేస్తూ ఆయన పేరుతో పార్టీ నేతలకు ఫోన్లు, మెస్సేజీలు పంపిస్తూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అంజనీ కుమార్ కేసును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేశారు.
జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు జగన్ పీఏ పేరుతో ఫోన్ కాల్ చేయడమే కాకుండా డబ్బు పంపించాలంటూ వాట్సాప్ మెసేజీ కూడా పంపించారని, ఈ రకంగా పలువురు నేతలకు మెసేజీలు వెళ్లాయని వారు పేర్కొన్నారు. ఈ రకంగా దాదాపు 15 మంది నేతలకు బెదిరింపు కాల్స్ వెళ్లాయని సుధాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. రాజకీయంగా వైఎస్ జగన్ కు ప్రజల నుంచి పెరుగుతున్న మద్దతును చూసి తట్టుకోలేక, ఇలాంటి దుష్ర్పచారానికి ఒడిగడుతున్నారని ఆయన విమర్శించారు. లోటస్‌పాండ్ పేరిట ఆగంతకుడి నెంబర్ రిజిస్టర్ అయ్యిందని, అందుకే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు ఢిల్లీలోని కొందరి ప్రముఖులకు ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు చేస్తున్నాడని, ఈ ఆగంతకులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment