ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మెల్బోర్న్ :
మెల్బోర్న్లో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, విక్టోరియా స్టేట్ ఇంచార్జ్ ఉప్పు సాయిరాం ఆధ్వర్యంలో ఏటీఏఐ సహకారంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల నుండి పెద్ద సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు తరలివచ్చారు.
తెలంగాణ ఆటా, పాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. వేడుకలు జరుగుతున్న ప్రాంతమంతా 'జై తెలంగాణ' నినాదాలతో మారుమోగిపోయింది. ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ సమయంలో తన అనుభవాలను స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ పథకాలను వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్‌ఆర్‌ఐల ప్రాముఖ్యతను గుర్తు చేశారు.
నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సర కాలంలో తాము చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విక్టోరియా ఇంచార్జ్ సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ప్రసారం చేసిన వీడియోలు అందరిని అమితంగా ఆకర్షించాయి. ఈ వేడుకల్లో డా అనిల్ రావు చీటీ, డా అర్జున్, ప్రవీణ్ లేదెల్ల, సునీల్ రెడ్డి, సత్యం రావు, అమర్, అభినయ్, ప్రవీణ్ దేశం, రాంపాల్ రెడ్డి ముత్యాల, రాజవర్ధన్ రెడ్డి, బద్దం పుల్ల రెడ్డి, ధర్మపురి మురళి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.