ATAI
-
ఆస్ట్రేలియాలో అవధానార్చన
తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అష్టావధానం. భాష ,ఛందస్సు, వ్యాకరణం, సమయస్ఫూర్తి, ధారణ ఏక కాలంలో నడుపుతూ చేసే ఈ సాహిత్యప్రక్రియ తెలుగు భాషా వైభవానికి నిత్యసాక్ష్యం. తటవర్తి గురుకులం ద్వారా వివిధ దేశాల పృచ్ఛకులతో అంతర్జాలంలో జరుగుతున్న అవధానార్చన ఈ ఏడాది ఇప్పటిదాకా 55 అవధానాలను పూర్తి చేసుకుని, 56వ అష్టావధానం ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నగరం వేదికగా భాషాభిమానుల నడుమ డిసెంబరు మూడున ప్రత్యక్షంగా జరుగుతోంది. తెలుగుభాషను తమ సామాజిక భాషలలో ఒకటిగా గుర్తించిన ఆస్ట్రేలియాలో, తెలుగు భాషాభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తూ, పద్యరచనను నేర్పి నూతన పద్య కవులను తయారుచేస్తూ అవధానార్చనలు నిర్వహిస్తోంది తటవర్తి గురుకులం. ఈ కార్యక్రమం భారతదేశంలో ఆలయాల అభివృద్ధికి అంకితం చేస్తూ ఆస్ట్రేలియా ప్రథమ అవధాని తటవర్తి శ్రీకళ్యాణ చక్రవర్తి నిర్వహిస్తున్నారు. అవధాని, పృచ్ఛకులు, సంచాలకులు అందరూ మెల్బోర్న్ వారే అవ్వడం, అందులోనూ చంటిపిల్లల తల్లులు కూడా పృచ్ఛకులుగా వస్తూ తమ భాషాభిమానాన్ని తెలుగు వైభవాన్ని చాటడానికి పూనుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమానికి సంచాలకులుగా, ఆస్ట్రేలియాలో ప్రముఖ పద్యకవి డా.వేణుగోపాల్ రాజుపాలెం వ్యవహరిస్తున్నారు. పృచ్ఛకాంశాలైన సమస్యాపూరణం యామిని చతుర్వేదుల , దత్తపది మనోజ్ మోగంటి , వర్ణన అమరేందర్ అత్తాపురం , నిషిద్ధాక్షరి శ్రీనివాస్ బృందావనం, న్యస్తాక్షరి రాజశేఖర్ రావి, ఆశువు రంజిత ఓగిరాల, చిత్రానికి పద్యం అర్చన విస్సావజ్ఝుల , అప్రస్తుతం పల్లవి యలమంచిలి నిర్వహిస్తున్నారు. ఈ అవధానార్చనను ఆంధ్రప్రదేశ్ కొవ్వూరులో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అంకితంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ATAI వారు సహాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియా తెలుగు సాహిత్యానికి నూతన సొబగులద్దేందుకు సిద్ధమౌతున్నఈ విశిష్ట అవధానార్చన, ప్రవాసతీరాలలో తెలుగుభాషా వికాసానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని ఆశిద్దాం. -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్ కార్పొరేషన్ (ఏటీఏఐ) ఆధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు బంగారు నాణేలను అందించారు. ఈ సందర్బంగా ఏఐటీఐ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి దేశం మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు గత నాలుగేళ్లుగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి బృహత్తర కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ అభినందించారు. ఇంత గొప్పగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పాటుపడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ఆస్ట్రేలియాలో విస్తరించడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
మెల్బోర్న్ : మెల్బోర్న్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల, విక్టోరియా స్టేట్ ఇంచార్జ్ ఉప్పు సాయిరాం ఆధ్వర్యంలో ఏటీఏఐ సహకారంతో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల నుండి పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. తెలంగాణ ఆటా, పాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది. వేడుకలు జరుగుతున్న ప్రాంతమంతా 'జై తెలంగాణ' నినాదాలతో మారుమోగిపోయింది. ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ సమయంలో తన అనుభవాలను స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ పథకాలను వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ఆర్ఐల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సంవత్సర కాలంలో తాము చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. వినోద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విక్టోరియా ఇంచార్జ్ సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో ప్రసారం చేసిన వీడియోలు అందరిని అమితంగా ఆకర్షించాయి. ఈ వేడుకల్లో డా అనిల్ రావు చీటీ, డా అర్జున్, ప్రవీణ్ లేదెల్ల, సునీల్ రెడ్డి, సత్యం రావు, అమర్, అభినయ్, ప్రవీణ్ దేశం, రాంపాల్ రెడ్డి ముత్యాల, రాజవర్ధన్ రెడ్డి, బద్దం పుల్ల రెడ్డి, ధర్మపురి మురళి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.