మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఇన్ కార్పొరేషన్ (ఏటీఏఐ) ఆధ్వర్యంలో మెల్‌బోర్న్ నగరంలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ఆడపడుచుల అతిపెద్ద పండుగగా పేరొందిన బతుకమ్మను కొలుచుకొంటూ వేల సంఖ్యలో హాజరైన మహిళలు, పిల్లలు ఆటపాటలతో, కోలాటాలతో అలరించారు. అమితోత్సాహంతో మహిళలందరు రకరకాల పువ్వులతో పేర్చుకొని తెచ్చిన బతుకమ్మలు అందరిని ఎంతో ఆకర్షించాయి. బతుకమ్మను తీసుకువచ్చిన ప్రతి మహిళకు వెండి నాణెంతో పాటు, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన బతుకమ్మలను తెచ్చిన ఆడపడుచులకు బంగారు నాణేలను అందించారు.
ఈ సందర్బంగా ఏఐటీఐ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి దేశం మాట్లాడుతూ.. తాము తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లో చాటిచెప్పేందుకు గత నాలుగేళ్లుగా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి బృహత్తర కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కృషి చేస్తున్న తన కమిటీ సభ్యులందరినీ అభినందించారు. ఇంత గొప్పగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం చాలా గర్వంగా ఉందని అందుకు సహకరించిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే పాటుపడుతూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ఆస్ట్రేలియాలో విస్తరించడానికి తమవంతు కృషి చేస్తామన్నారు.