నగరంలో గేమ్ సిటీ!
► అమెరికాలో ఐటీ కంపెనీలతో సమావేశంలో మంత్రి కేటీఆర్
► ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ రంగాలకు నగరం అనుకూలమని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గేమింగ్ రంగ ప్రోత్సాహానికి రాష్ట్ర పారిశ్రామిక విధానంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించామని, హైదరాబాద్‌లో గేమ్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ రంగాలకు నగరంలో విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ వర్క్ హైదరాబాద్‌లో జరుగుతోందని, ఇటీవల విడుదలైన బాహుబలి సినిమా యానిమేషన్ వర్క్ కూడా నగరంలోనే జరిగిందని పేర్కొన్నారు.
అమెరికాలోని శాంటాక్లారాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. గేమింగ్ అండ్ యానిమేషన్ రంగ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ (ఏఈ)తో పాటు పలు ఐటీ, గేమింగ్ రంగ కంపెనీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ విధానాల ప్రత్యేకతలను వివరించి హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దేశంలో ఏ నగరానికి లేనన్ని ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని, నైపుణ్యం గల మానవ వనరులు నగరానికి అదనపు బలమని పేర్కొన్నారు.
నగరంలో సిగ్నేచర్ టవర్...స్థలం కోరిన ‘ఐటీ సర్వ్’..
తొలుత ఐటీ సర్వ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి.. ఐటీ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను వివరించారు. హైదరాబాద్‌లో సిగ్నేచర్ టవర్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఐటీ సర్వ్ ప్రతినిధులు కోరగా, సానుకూలంగా స్పందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డెల్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ, డేటా అనలిటిక్స్‌లో ప్రముఖ కంపెనీ ‘వీఎంవేర్’తో మంత్రి కేటీఆర్ సమావేశమై డేటా అనలిటిక్స్ రంగంపై ప్రభుత్వ విధానాలను వివరించారు. ప్రభుత్వ పథకాల అమలు, మూల్యాంకనంలో డేటా అనలిటిక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా వినియోగించుకుంటోందన్నారు. హైదరాబాద్‌లో పెట్టబోయే డేటా అనలిటిక్స్ పార్కులో ప్రధాన పెట్టుబడిదారులుగా చేరాలని వీఎంవేర్ ప్రతినిధులను కోరారు. హైదరాబాద్ నగర సందర్శన కోసం ఓ ప్రతినిధి బృందాన్ని పంపాలన్నారు.