విలయ విధ్వంసం | phailin disaster | Sakshi
Sakshi News home page

విలయ విధ్వంసం

Published Mon, Oct 14 2013 1:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM

విలయ విధ్వంసం

విలయ విధ్వంసం

 రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల ప్రజలను నిలువెల్లా వణికించిన పెను తుపాను పై-లీన్ శాంతించింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు.. ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్త చర్యలతో.. పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. కానీ.. ఈ ఇంద్రనీలం తుపాను శనివారం రాత్రి భారీ విధ్వంసమే సృష్టించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో దాదాపు కోటి మంది జీవితాలపై ప్రభావం చూపింది. లక్షలాది ఇళ్లను దెబ్బతీసింది. లక్షలాది ఎకరాల్లో పంటను కాలరాసింది. ఒడిశాలో ఒక్క వరి పంటకు జరిగిన నష్టమే రూ. 2,400 కోట్లుగా అంచనా. శ్రీకాకుళం జిల్లాలో దెబ్బతిన్న ఉద్యానవన, ఇతర పంటల నష్టం రూ. వెయ్యి కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. శనివారం రాత్రి ఒడిశాలోని గోపాల్‌పూర్ వద్ద తీరం దాటిన తుపాను.. గంజాం జిల్లాను కకావికలం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లానూ అతలాకుతలం చేసింది. ఒడిశా తీరంలో తొమ్మిది లక్షల మందిని, ఉత్తరాంధ్ర తీరంలో లక్షన్నర మందిని ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించటంతో ప్రాణనష్టం లేకుండా నివారించగలిగారు. తుపాను తాకిన గోపాల్‌పూర్ నుంచి దాదాపు 95 శాతం మందిని ముందుగానే ఖాళీచేయించారు. అప్పటికీ.. ఒడిశాలో 21 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో పది మంది గంజాం జిల్లాలోనే చనిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 23గా చెప్తున్నారు.
 
 సాక్షి, భువనేశ్వర్/శ్రీకాకుళం:
 తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో వీచిన భీకర గాలులకు పెద్ద ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. శనివారం రాత్రి పెను గాలులకు బరంపురంలోని ఓ హోటల్ వద్ద నిలిపి ఉంచిన వ్యాన్ పైకి ఎగిరి కింద పడింది. దీనినిబట్టి గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బరంపురం నగరం ఆదివారం మధ్యాహ్నం వరకూ దాదాపు జలదిగ్బంధంలోనే ఉంది. తీర జిల్లాల్లో సమాచార వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ, రోడ్లు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిలో కొన్నిచోట్ల గాలుల కారణంగా లారీల వంటి భారీ వాహనాలు సైతం తిరగబడిపోయాయి. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
 
 గంజాం జిల్లాలో తుపాను ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. దాని తర్వాత పూరి జిల్లాలో అధికంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎస్.ఎన్.పాత్రో తెలిపారు. మిగతా కోస్తా జిల్లాలపై అంత తీవ్ర ప్రభావం లేదన్నారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 14,514 గ్రామాలు, 80,53,620 మంది జనాభాపై తుపాను ప్రభావం చూపిందని చెప్పారు. తుపాను కారణంగా 2.34 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయని, 8.73 లక్షల మందికి పైగా ప్రజలను ఖాళీచేయించి శిబిరాలకు తరలించినట్లు వివరించారు. వర్షాలు, వరద ముంపు వల్ల ఐదు లక్షల హెక్టార్లకు పైగా పొలాల్లో పంట ధ్వంసమైందని.. ఈ నష్టం రూ. 2,400 కోట్ల వరకూ ఉంటుందని వివరించారు. తుపాను వల్ల ప్రజల ప్రాణ నష్టాన్ని అత్యంత కనిష్టానికి పరిమితం చేయటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని.. అందులో విజయం సాధించగలిగామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ఆదివారం భువనేశ్వర్‌లో పేర్కొన్నారు. అయితే కోట్ల రూపాయల అస్తి నష్టం సంభవించిందన్నారు.
 
 ఇక పునరావాసం, పునర్నిర్మాణంలో నిమగ్నమవుతామని చెప్పారు. ప్రధానంగా రైల్వే లైన్లు, ప్రధాన నగరాల్లో త్వరగా విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. వెస్కోకు చెందిన సుమారు 200 మందితో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే గంజాం జిల్లాలో విద్యుత్ వ్యవస్థ చక్కబడడానికి, టెలికాం వ్యవస్థ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. పూరి-హౌరాల మధ్య రైల్వే ట్రాక్‌లను ఆదివారం సాయంత్రానికి పునరుద్ధరించారు. రైలు సర్వీసులను కూడా నడుపుతున్నారు. ఈ నగరాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు కూడా ప్రారంభించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన పట్నాయక్ సోమవారం హెలికాప్టర్‌లో పర్యటించనున్నారు.
 
 సిక్కోలులో తుడిచిపెట్టుకుపోయిన పంటలు
 పెను తుపాను గండం నుంచి ఉత్తరాంధ్ర గట్టెక్కింది. శ్రీకాకుళం జిల్లా బులివాడు గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడు భారీ వర్షాలకు ఇల్లు కూలి చనిపోయాడు. కవిటి మండలంలో తుపాను శిబిరంలో నిద్రిస్తున్న 27 ఏళ్ల మత్స్యకారుడొకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలు మినహా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే జిల్లాలో భారీగా పంట నష్టం సంభవించింది. రోడ్లు, విద్యుత్, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 233గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఉద్యాన పంటలు తుడిచిపెట్టుకుపోయాయి.
 
  ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ. 1000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. సుమారు 29 వేల ఎకరాల్లో వరి, 17,500 ఎకరాల్లో కొబ్బరి పంట, 1000 ఎకరాల్లో మామిడి, 500 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మునగ దెబ్బతిన్నాయి. భారీగా మొక్కజొన్న, చెరకు పంటలు కూడా ధ్వంసమయ్యాయి. దాదాపు వంద ఇళ్లు కూలిపోగా, మరో 50 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లపై భారీగా చెట్లు కూలిపోవటంతో 233 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 39 గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 19 బృందాలు (ఒక్కో బృందంలో 40 మంది చొప్పున), మరో 500 మందికి పైగా సైనిక సిబ్బంది (ఇంజనీర్లు, సమాచార వ్యవస్థ నిపుణులు, వైద్య బృందాలు) సహాయ, పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యారు. శని, ఆదివారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 294 తీర గ్రామాల నుంచి దాదాపు 1.34 లక్షల మందిని సహాయ శిబిరాలకు తరలించారు. తుపాను ప్రభావం తేలిపోవటంతో విశాఖ జిల్లాలోని సహాయ శిబిరాల నుంచి 24,000 మందిని వారి ఇళ్లకు పంపించివేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంకా లక్ష మందికి పైగా తీర ప్రాంత ప్రజలు శిబిరాల్లోనే ఉన్నారు. మరోవైపు ఒడిశాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలో వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు పొంచివుంది.
 
 బీహార్‌కు వరద హెచ్చరిక
 ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు తుపాను గండం గడిచిపోయిందని.. అయితే బీహార్‌లో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్ మైదాన ప్రాంతాల్లో, కోసి, గంధక్ నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షపాతం ఉంటుందని చెప్తూ.. ఆ రాష్ట్రానికి వరద హెచ్చరిక జారీచేసింది. దీంతో వరద అవకాశాలున్న 28 జిల్లాలను బీహార్ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర రాజధాని పాట్నాతో పాటు.. సుపాల్, దర్భంగా, గోపాల్‌గంజ్ జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. బేగుసరాయ్, భగల్పూర్, భోజ్‌పూర్, జెహానాబాద్, పాట్నా జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.
 
 వాయుగుండంగా తుపాను
 పెను తుపానుగా శనివారం రాత్రి తీరం దాటిన పై-లీన్ ఆదివారం ఉదయానికి బలహీనపడి తుపానుగా మారిందని, సాయంత్రానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారిందని, గాలుల వేగం 45-55 కిలోమీటర్లకు తగ్గిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం ఉదయానికి ఇది అల్పపీడనంగా మారుతుందని.. నేపాల్ వైపు పయనిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉత్తర ఒడిశాలోని జర్సీగూడ సమీపంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు, ఒడిశాలోని పూరి, బాలాసోర్, జగత్‌సింగ్‌ఫూర్, కటక్, సంబల్‌పూర్ జిల్లాలు.. బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు మరికొన్ని రోజులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఉత్తర కోస్తాంధ్రను ఆనుకొని ఉన్న పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
 
 సాగరంలో 4 కి.మీ ఈదుకుంటూ..
 ఒడిశా తీరం చేరిన 18 మంది మత్స్యకారులు
 ఒడిశాలోని పారాదీప్ వద్ద సముద్రంలో చిక్కుకుపోయిన 18 మంది తమిళనాడు మత్స్యకారులు ఆదివారం సముద్రాన్ని ఈదుకుని సురక్షితంగా తీరం చేరుకున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన వీరు తుపాను సమయంలో పారాదీప్ వద్ద చేపలు వేటాడేందుకు ఉపయోగించే బోటులో చిక్కుకుపోయారు. గత నెల 22న ఒడిశా తీరం నుంచి సుదూర సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరు.. తుపాను రాబోతోందని తెలియగానే తిరిగివచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రయాణం సక్రమంగా సాగకపోగా.. ట్రాలర్‌లో డీజిల్ కూడా అయిపోవటంతో పారాదీప్ పోర్టుకు నాలుగు కి.మీ. దూరంలో చిక్కుకుపోయారు.  కోస్ట్‌గార్డ్ విభాగాన్ని సంప్రదించినప్పటికీ సముద్రం కల్లోలంగా ఉండటంతో సహాయ చర్యలు చేపట్టలేకపోయారు. దీంతో వారు ఆదివారం ట్రాలర్ నుంచి దూకివేసి సముద్రంలో నాలుగు కి.మీ. ఈదుకుంటూ జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని ఎర్సామా తీరానికి సురక్షితంగా చేరుకున్నారు.
 
 బంగాళాఖాతంలో మునిగిన నౌక!
 తుపాను కారణంగా అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతంలో ఎంవీ బింగో అనే సరుకు రవాణా నౌక మునిగిపోయినట్లు భావిస్తున్నామని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ఆర్.పి.ఎస్.కహ్లోన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పనామాలో రిజిస్టరైన ఎంవీ బింగో నౌక 8,000 టన్నుల ఐరన్ ఓర్ (ముడి ఇనుము ఖనిజం)తో ప్రయాణిస్తోంది. పశ్చిమబెంగాల్ తీరంలోని సాగర్ పోర్టు నుంచి ఈ నెల 11వ తేదీన చైనా వెళ్లేందుకు బయల్దేరింది. శనివారం నుంచి అదృశ్యమైన నౌక జాడ ఆదివారం సాయంత్రానికి కూడా తెలియరాలేదు. బెంగాల్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో లైఫ్‌బోట్‌లో ఉన్న నౌక సిబ్బందిని ఆదివారం ఉదయం కోస్ట్ గార్డ్ డోర్నియర్ విమానం గుర్తించింది. వారిని వెనక్కు రప్పించేందుకు మరో నౌకను పంపిస్తున్నారు. తుపాను సమయాల్లో నౌకలను నౌకాశ్రయాల్లో ఉంచితే భారీ నష్టం సంభవించే అవకాశం ఉండటంతో.. వాటిని సముద్రం మీదకి తరలించటం అంతర్జాతీయంగా అనుసరించే విధానం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement