పేద విద్యార్థుల చదువు కోసం 'భారతి'...
ఆర్లాండో : అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వాదులు, మాతృభూమి అభివృద్దిలో తమ వంతు కర్తవ్యంగా భాగస్వామి అవ్వాలన్న ఆలోచనలతో మేధోమథన సదస్సును నిర్వహించారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) అధ్యక్షులు విశ్వేశ్వర్ కలవల అద్వర్యంలో జరిగిన ఆగ్నేయ ప్రాంతాల సదస్సులో వివిధ టీడీఎఫ్ గ్రూప్ (మెల్బోర్న్, అట్లాంటా, జాక్సన్విల్లే, ఓర్లాండో, తలహాసి, టాంప, వెస్ట్ పామ్ బీచ్, మియామీ) నాయకులతో పాటు పలువురు వైద్యులు, విద్యా వేత్తలు, వ్యాపారులు పాల్గొని పలు అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించారు.
ఏంతో విశ్లేషణాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్థిక కారణాల వల్ల చదువు మధ్యలోనే వదిలేస్తున్న బీద విద్యార్థులకు ఆర్ధిక సహాయాన్ని అందించే 'భారతి' కార్యక్రమం గురుంచి క్షుణ్ణంగా చర్చించి, దాని విధివిధానాలను సూత్రప్రాయంగా నిర్ణయించారు.
దాదాపు 300 మంది హాజరైన ఈ కార్యక్రమానికి ఫ్లోరిడాలోని ఆర్లాండో నగరం వేదికైంది. 'భారతి' కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన లభించింది. దానికి ఆర్థిక సహకారం అందించడానికి చాలా మంది ముందుకొచ్చారు. అనంతరం జరిగిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమంలో గాయకులు పాడిన తెలంగాణ జానపద గేయాలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వైద్యులు, విద్యావేత్తలను సన్మానించారు.