బాలగణం చేసింది.. బొజ్జ గణపతి నిమజ్జనం..
పి.గన్నవరం :
నవరాత్ర మహోత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రాంగణాల్లో, పందిళ్లలో నిత్యం పూజలందుకున్న పార్వతీతనయుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. మేళతాళాలతో, బాణసంచా ఆర్భాటంతో, ఆటపాటల తుళ్లింతలతో భక్తులు గణపతిని నీటిపట్టులకు తరలించి నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ వేడుకకు నిర్వాహకులు పెద్దలూ, యువకులే. అయితే.. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి శివారు చాకలిపాలెంలో మాత్రం చిన్నారులే ఈ సంరంభానికి సారథ్యం వహించారు. చాకలిపాలేనికి చెందిన న్యాయవాది మొల్లేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు ఏటా వినాయక చవితి ఉత్సవాలను సామూహికంగా జరుపుకొంటారు. వారి ఇళ్లవద్ద పూజలో ఉంచినగణనాథులను చిన్నారులే ఊరేగింపుగా రాజోలు మండలం సోంపల్లికి తరలించి వశిష్ట నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది కూడా 42 గణపయ్య ప్రతిమలను 11 ట్రాలీలపై కార్లు, బైక్‌ల బొమ్మలపై ఉంచి ఊరేగించారు. ఆ ట్రాలీలన్నింటికీ కలిపి ఓ తాడు కట్టి, చిన్నారులే దాన్ని లాగుతూ, ‘గణపతి బొప్పా మోరియా’ అని నినదిస్తూ వశిష్టకు తరలిస్తుంటే.. దారి పొడవునా అందరూ సంభ్రమంగా తిలకించారు. ఊరేగింపులో ఒకవైపున ‘సేవ్ పెట్రోల్’, మరోవైపున ‘బక్రీద్ శుభాకాంక్షలు’ అనే నినాదాలున్న కాగితాలను అతికించారు.