అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ అధ్యక్షుడు
ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్
నల్లగొండలో అట్టహాసంగా డీటీఎఫ్ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
తరలివచ్చిన 31 జిల్లాల ఉపాధ్యాయులు
నల్లగొండ టూటౌన్ : ప్రభుత్వాలు కుల, మత, వర్గాలకు అతీతంగా అసమానతలు లేని విద్యనందించాలని అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ అధ్యక్షుడు, ప్రొఫెసర్ అనిల్ సద్గోపాల్ కోరారు. శనివారం నల్లగొండలోని శివాంజనేయ గార్డెన్‌లో జరిగిన డీటీఎఫ్ (డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్) 4వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహా సభలకు ముఖ్య అతిథిగా హాజ రైన ఆయన డీటీఎఫ్ జెండాను, సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరి గిన సభలో ఆయన ప్రసంగిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలన్నారు. విద్యలో మార్పు లు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, కాషారుుకరణను, ప్రైవేటీకరణను, కార్పొరేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. అన్ని వర్గాలకు సమానమైన, నాణ్యమైన విద్య అందించాలంటే కామన్ స్కూల్ ద్వారానే సాధ్యమన్నారు. ఉపాధ్యాయులు హక్కుల కోసం పోరాడుతూనే విద్యా వ్యవస్థపై కూడా ఉద్యమించాల్సిన అవసరముందన్నారు.
బాధ్యతగా వ్యవహరించాలి : ఎంపీ
ఉపాధ్యాయులు హక్కులు అడగడంతో పాటు బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. డిండి, చందంపేట లాంటి ప్రాంతాల్లో 50 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం కొత్త విద్యా పాలసీకి సలహాలు అడగగా పం పించామన్నారు. సీపీఎస్ రద్దు నెరవేరని కోరికని, ఇది కేంద్రం పరిధిలోనిదన్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సహకారాలు అందిస్తామని తెలిపారు.
సామాజిక ప్రగతికి విద్య అవసరం
సామాజిక ప్రగతికి విద్య ఎంతో అవసరమని, మూడు దశాబ్దాలుగా డీటీఎఫ్ అనేక పోరాటాలు నిర్వహించిందని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రఘుశంకర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం విద్యారంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కామన్ స్కూల్ విధానం ఏర్పాటు చేయడంలేదన్నారు. సమానవిద్య, నాణ్యమైన విద్య అందించాల్సి ఉందన్నారు. విద్య కాషాయీకరణ, వ్యాపారీకరణను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రేషనలైజేషన్ ద్వారా పాఠశాలల మూసివేత సరైంది కాదన్నారు. 11 అంశాలపై ఈ మహా సభలలో చర్చ జరుగుతుందని తెలిపారు. సీపీఎస్ విదానం వల్ల రాష్ట్రంలో 1 లక్షా 16 వేల మంది ఉపాధ్యాయులు తీవ్రమైన క్షోభకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అదే విధం గా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు నోముల సత్యనారాయణ, డీటీఎఫ్ నేతలు రాఘవాచారితో పాటు పలువురు వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.క్రిష్టప్ప, అధ్యాపక జ్వాల సంపాదకులు ఎం. గంగాధర్, డీటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు కె. నారాయణరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సోమయ్య, వెంకట్రాములు, శంతన్, పద్మలత, కార్యదర్శులు సామ్యూల్, రాజిరెడ్డి, లింగారెడ్డి, ఎస్. భాస్కర్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల అధ్యక్షులు ఎస్. విద్యాసాగర్‌రెడ్డి, ఎం. దశరథరామారావు, భాస్కర్, ప్రధాన కార్యదర్శులు వెంకులు, లింగయ్య, సత్త య్య, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట్ నారాయణగౌడ్ పాల్గొన్నారు.
అందరికీ సమాన విద్యనందించాలి
Published Sun, Dec 11 2016 3:55 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement