చుక్కల్లో కూరగాయలు
Published Fri, Aug 9 2013 2:47 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర బంద్ ప్రభావం మార్కెట్ ధరలపై పడుతోంది. కూరగాయలు తరలించే లారీలు సకాలంలో రాకపోవటంతో డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేక కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గురువారం తిరుపతి ప్రధాన మార్కెట్లో పచ్చిమిర్చి రూ.100 కిలో పలికింది. ఉద్యమం నేపథ్యంలో రహదారులను ఎక్కడికక్కడ ప్రజలే స్వచ్ఛందంగా దిగ్బంధం చేస్తున్నారు.
ఇతర జిల్లాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన కూరగాయల లారీలు రావటం లేదు. జిల్లాలో మదనపల్లె, వి.కోట, పలమనేరు, వాయల్పాడు, పీలేరు, కలికిరి, చంద్రగిరి, బంగారుపాళెం తదితర ప్రాంతాల నుంచి మినీ ట్రక్కులు, టాటా ఏస్ వాహనాల్లో వచ్చే టమాట, వంకాయ, బెండ, క్యాబేజీ, బీన్స్ సరఫరా తగ్గింది. తమిళనాడు ఊటీ నుంచి వచ్చే క్యారెట్, కాలీఫ్లవర్, కోలార్, ముళ్‌బాగల్ ప్రాంతాల నుంచి రావాల్సిన క్యాప్సికం, బీట్‌రూట్ ఇతర కాయగూరల సరఫరా కూడా తగ్గింది. చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, పుత్తూరు, పుంగనూరు తదితర మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి నెల కొంది. ఏ కూరగాయలూ కిలో రూ.30కి తక్కువ లేవు. కొన్ని కూరగాయాలు కిలో రూ.40 కూడా దాటాయి.
తిరుపతి మార్కెట్లో గురువారం నాటికి వంకాయలు కిలో రూ.30 పలకగా, పందిరి చిక్కుడు, బీర , బెండ కాయలు కిలో రూ.35 - 40 పలుకుతున్నాయి. గతంలో రూ.10-15 మధ్య ఉన్న ముల్లంగి ధర ప్రస్తుతం రూ. 25-30కు పెరిగింది. ఒక మునక్కాయ రూ.5-6 వరకు విక్రయిస్తున్నారు. గత వారం లో కిలో రూ.15 ఉన్న గోరు చిక్కుడు కాయలు 20కి చేరాయి. టమాటాలు మాత్రం కిలో రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.10కి తగ్గాయి. మదనపల్లె మార్కెట్‌తోపాటు కర్ణాకట, తమిళనాడు టమాటలు రావటం వల్లే ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఘాటెక్కిన పచ్చిమిర్చి
జిల్లాకు కర్ణాటక, ఇటు కోస్తా జిల్లాల నుంచి పచ్చిమిర్చి సరఫరా అవుతుంది. పచ్చి మిర్చి (పచ్చి మిరపకాయలు) సరఫరా మార్కెట్‌లో తగ్గటంతో 3వ రకం కూడా దొరకలేదు. దీంతో గురువారం ఏకంగా రూ.100 పెట్టినా కిలో పచ్చిమిర్చి దొరికే పరిస్థితి లేదు. చిల్లర దుకాణాల్లో కూరగాయలు అమ్మేవాళ్లు అసలు పచ్చిమిర్చి తీసుకురావటమే మానేశారు. ధర ఎక్కువగా ఉండటం, కొనేవారు అంత రేటా అంటుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పచ్చిమిర్చి తరువాత మార్కెట్లో కాకరకాయ ధరలు విపరీతంగా ఉన్నాయి. కిలో రూ.75కు విక్రయిస్తున్నారు. కొత్తిమీర ధరలు కూడా పెరిగాయి. తెల్లగడ్డలు కిలో రూ.60 పలుకుతున్నాయి. తెల్లగడ్డలు పంటకు అన్ సీజన్ కావటం, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి సరుకు రావాల్సి ఉండటంతో లారీలు రాక రేటు పెరుగుతూనే ఉంది.
Advertisement
Advertisement