- ముగిసిన జన్మభూమి
- సమస్యలపై నిరసనలు, నిలదీతలు
- పార్టీ కార్యక్రమంలా మార్చిన టీడీపీ నాయకులు
అనంతపురం అర్బన్ : జిల్లాలో ఈ నెల రెండో తేదీ నుంచి చేపట్టిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమం బుధవారం ముగిసింది. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై ప్రజల నుంచి 1.15 లక్షల వినతులు అధికారులకు అందాయి. జన్మభూమి ప్రారంభం నుంచి సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు, ప్రజలు గ్రామసభల్లో నిరసనలు తెలిపారు. ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రజలు నిలదీశారు. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ వేదికలుగా మార్చారు.
సమస్యలపై ప్రశ్నించిన ప్రజలపై, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల సభల నుంచి పోలీసులతో నెట్టించారు. అరెస్టు కూడా చేయించారు. సభల్లో ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు మాట్లాడిన సందర్భాలు లేవు. ప్రభుత్వ పథకాలను పొగడడంతోనే సరిపెట్టారు. పలు చోట్ల అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. విపక్ష పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్న సర్పంచ్‌లు, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వలేదు.
+ దళిత వర్గానికి చెందిన తనను అగౌరవ పరుస్తున్నారంటూ ఈ నెల 2వ తేదీన కంబదూరు మండలం నూతిమడగు జన్మభూమి సభలో సర్పంచ్ నరసింహులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డారు.
+ అనంతపురం నగరంలోని 33వ డివిజన్‌లో ఈ నెల 2న జన్మభూమి సభను ముగించుకుని కారులో వెళుతున్న కమిషనర్‌ను పింఛన్ కోసం మానసిక వికలాంగుడు ప్రకాశ్ గౌడ్ అడ్డుకున్నాడు. ఆ వెనుక వాహనంలో వచ్చిన టీడీపీ కార్పొరేటర్లు అతనిపై చేయిచేసుకున్నారు.
+ పేదల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో ఈ నెల 3న పెనుకొండ మండలం దుద్దేబండలో జరిగిన సభలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఉరవకొండ సభలో జెడ్పీటీసీ సభ్యురాలు లలితమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు తదితరులు కోరగా.. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పారు.
+ ఈ నెల 4న శెట్టూరు మండలం కైరేవులో నిర్వహించిన సభలో ప్రారంభంలోనే ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ సర్పంచు జయమ్మఽ తదితరులు నిలదీశారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులపై సర్పంచుకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు.
+ ఈ నెల 5న తాడిపత్రి మండలం క్రిష్ణాపురం గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్‌లు, రేషన్ కార్డులు ఎందుకివ్వడం లేదంటూ అధికారులను నిలదీశారు. శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో జరిగిన జన్మభూమిలో ప్రజా సమస్యలపై సీపీఐ, వైఎస్సార్‌సీపీ నాయకులు నిలదీశారు. వారిపై ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి సమక్షంలో టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. సమస్యలను పరిష్కరించాలంటూ ఆ గ్రామ సర్పంచు లక్ష్మి, సింగిల్‌విండో అధ్యక్షుడు శివన్న సభా వేదిక ముందు నేలపైనే కూర్చుని నిరసన తెలిపారు.
1.15 లక్షల వినతులు
Published Thu, Jan 12 2017 12:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement