వందేళ్ల ఆఫీస్‌కు పొంచి ఉన్న ముప్పు
జనగామ : వందేళ్ల చరిత్ర గలిగిన నాటి నిజాం నవాబు హయాంలో డంగు సున్నంతో నిర్మించిన పురాతన భవనం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నెర్రలు బారి ప్రమాదంలో ఉన్నానని గుర్తుకు చేస్తోంది తహసీల్ కార్యాలయం. మండల కేంద్రానికి గుండెకాయ లాంటి రెవెన్యూ కార్యాలయానికి భద్రత కరువైంది. భద్రంగా దాచిన రికార్డుల గది మరీ అధ్వానంగా మారింది. పై కప్పు చిల్లులు పడడంతో గొడుగులు , ప్లాస్టిక్ కవర్లు అడ్డం పెట్టుకుని పని చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. పగుళ్లు పట్టిన గోడల మధ్య వేళ్లూరుకుపోతున్న సన్నని వేర్లు ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నాయి. అధికారులు భయందోళనతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఫైళ్లు, రికార్డులు తడువకుండా పాలిథీన్ కవర్లను రక్షణగా ఉంచారు. కార్యాలయ ఆవరణ చిన్నపాటి నీటి కుంటను తలపించే విధంగా మారింది.
నూతన భవనానికి ప్రతిపాదనలు పంపించాం
రెవెన్యూ కార్యాలయ నూతన భవనానికి గతంలోనే రెండుసార్లు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాలేదు. వర్షం కారణంగా గదుల్లో సిబ్బంది పనులు చేసుకోలేకపోతున్నారు. ఫైళ్లు, ముఖ్యమైన రికార్డులు తడిసిపోకుండా పాలిథీన్ కవర్లు కప్పాం. అక్కడక్కడా మరమ్మతులు చేయిస్తున్నా ఫలితం ఉండడం లేదు.
- చెన్నయ్య, తహసీల్దార్