ఆమెను చూస్తే.. ‘అవ్వా’క్కవుతారు..!
వందేళ్ల వయసులోనూ చురుగ్గా ఓ బామ్మ
నా అన్నవాళ్లు లేకపోయినా ధైర్యంగా జీవిస్తోన్న వైనం
మనం చదివిన చిన్నప్పటి కథల్లో పేదరాసి పెద్దమ్మ గుర్తుందా? ఇంచుమించు అలాగే ఒక బామ్మ బ్రిటీషు వారి కాలం నాటి సంగతులను గడగడా చెప్పేస్తోంది. కాలనుగుణంగా మారిన ఆహారపు అలవాట్లును వివరిస్తోంది. సుమారు 100 సంవత్సరాల వయసు కలిగిన ఈ బామ్మ ఉత్సాహం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అన్నట్టూ ఇంకోమాట! ముత్తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిలోనే ఈమె చాన్నాళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. ఆమె చెప్పిన ఆనాటి సంగతులకు ఊకొడతారో.. లేక అవాక్కవుతారో అంతా మీ ఇష్టం.
- కొయ్యలగూడెం
బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామం ఉప్పరిల్లలో వేట్ల చిన్నమ్మ ఒక్కామె నివసిస్తోంది. సమీప గిరిజనులు ఈమెను ముని అవ్వ అని పిలుస్తుంటారు. పోలవరం మండలం గడ్డపల్లి తన స్వగ్రామమని 9వ ఏటనే వివాహం జరగడంతో ఉప్పరిల్లకు వచ్చి స్థిరపడ్డట్టు చిన్నమ్మ తెలిపింది. అదే సమయంలోని మండలంలోని పులిరామన్నగూడెం, చింతపల్లి గ్రామాల్లో తెల్ల దొరలు వేసవి విడిది కోసం బంగ్లాలు(భవంతులు) కట్టించుకున్నారని చెప్పింది. ప్రస్తుతం పూర్తిగా శిథిలమైన ఆ భవంతుల గోడపై 1920లో నిర్మాణం జరిగినట్టు రాసి ఉంది. ఈ లెక్కన చూస్తే ఆమె వయసు 100 పైనే అని గిరిజనులు చెబుతున్నారు.
ఆ రోజుల్లో వరి అన్నం ఎక్కడుంది !
వేట్ల చిన్నమ్మ 40 సంవత్సరాల వయసు వరకు తెల్లకూడు(వరి అన్నం) తెలియదని పేర్కొంది. వెదురు బియ్యం, చేమ దుంపలతో పాటు ఇతర అడివి దుంపలను తన భర్త తీసుకువస్తే వాటిని వండి ఇద్దరం తినేవారమని చెప్పింది. అదేవిధంగా కాలానుగుణంగా వచ్చే కాయలలోని గింజలను వలిచి ఉడకబెట్టి తింటానని తెలిపింది. చింతపిక్కలు, సీతాఫల గింజలు, తంగేడి గింజలు, మారేడు కాయలతో పాటు అడవి మామిడి కాయలను, టెంకలను వండుకుని తింటామని, జీలుగుకల్లు సేవిస్తామని చెప్పింది. తన భర్త, కొడుకులు, కూతుళ్లు అంతా తన కళ్ల ముందే కాలం చేసినా మొక్కవోని ధైర్యంతో జీవనం సాగిస్తున్న చిన్నమ్మ నాటి కాలానికి సాక్షంగా మిగిలింది.