
గణపతికి నాగ హారతి
- వేద మంత్రాలతో అష్టోత్తర శత హారతులు
- రాష్ట్రంలోనే మొదటిసారి సంగారెడ్డిలో..
- శృంగేరి పీఠం ఆధ్వర్యంలో కార్యక్రమం
సంగారెడ్డి టౌన్: పట్టణంలోని మాధవనగర్ వడ్డే వీరహనుమాన్ మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాల్‌బాగ్ గణపతి మంగళవారం అష్టోత్తర శత హారతులు(108) అందుకున్నాడు. పవిత్ర పుష్కరాల సమయంలో చేసే పూజలను చవితి సందర్భంగా బొజ్జ గణపయ్య స్వీకరించాడు. వినాయకుడికి 108 హారతులు ఇవ్వడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
శృంగేరి పీఠం ఆధ్వర్యంలో బర్దీపురానికి చెందిన దత్తగిర మహారాజ్ సారధ్యంలో నాగ, కర్పూర తదితర 108 హారతులు ఇచ్చారు. సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల పాటు కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. శృంగేరి పీఠానికి చెందిన బ్రహ్మశ్రీ సంతోశ్ భట్ హారతి, బ్రహ్మశ్రీ రాధకృష్ణ వేదపఠనం, చించల కోట భువనేశ్వరీ మాత సేవకులు బ్రహ్మశ్రీ శ్రీ దేశపతి మంగళ హారతి, దేశపతి శ్రీనివాస్ శర్మ గానంతో మహా సంకల్ప పూజను పూర్తి చేశారు.
ఆలయ కమిటీ నిర్వాహకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ దంపతులతో పాటు వందల మంది దంపతులు పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జోగేందర్ శర్మ, బుస్స ఈశ్వరయ్య, చంద్రయ్య, ఆంజనేయులు, రాజు, సంగ్రాం కుమార్, వడ్డెపల్లి రాజేశ్, అవుసలి యాదగిరి, అవుసలి గోపాల్, కృష్ణ, మధు, శివంగుల హనుమంతు, సతీశ్‌కుమార్, తోపాజీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.