14న ‘మన గుడి’
Published Tue, Nov 8 2016 9:23 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
రాజమహేంద్రవరం కల్చరల్ :
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హిందూధర్మ ప్రచారపరిషత్తు, రాష్ట్ర దేవాదాయశాఖల సంయుక్త ఆధ్వర్యంలో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఎంపిక చేసిన 12,500 ఆలయాల్లో మన గుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా ధర్మప్రచారమండలి అధ్యక్షుడు డాక్టర్ కర్?ర రామారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మండలానికి పది ఆలయాలు చొప్పున, మన జిల్లాలోని 60 మండలాల్లో ఎంపిక చేసిన 600 ఆలయాల్లో మన గుడి కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి ముందుగా 11, 12, 13 తేదీలలో మూడు రోజులపాటు ప్రజల భాగస్వామ్యంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 11వ తేదీన మంగళకైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 20 ప్రాంతాలలో నవ్యాంధ్రదాసరుల సంఘం కళాకారులు కైశికి పురాణాన్ని వివరిస్తారని తెలిపారు. 12న దేవాలయాలను శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందని, ఇందులో యువత భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నారు.13న హరినామసంకీర్తనలు, భజనలు నిర్వహిస్తామన్నారు. 14న తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే పసుపు, కుంకుమ, అక్షతలు, కంకణాలను భక్తులకు వితరణ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ శివాలయాల్లో భక్తులకు శివారాధనకు బిల్వదళాలను అందజేయనున్నట్టు తెలిపారు. మన గుడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రామారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ధర్మప్రచారమండలి కార్యదర్శి కాలెపు సతీష్, టీటీడీ ప్రొగ్రామ్ అసిస్టెంట్ ఓరుగంటి నరసింహయోగి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement