Mana Gudi
-
మొక్కుబడిగా ‘మన గుడి’
కడప కల్చరల్ : తిరుమల–తిరుపతి దేవస్థానాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న మనగుడి కార్యక్రమం మొక్కుబడిగా మారింది. నాలుగు రోజులపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మన గుడి పేరిట ఆలయ శుద్ధి, వరలక్ష్మి వ్రతాలు, ధార్మిక కార్యక్రమాలు, శ్రావణ పౌర్ణమి సందర్భంగా నాల్గవ రోజు రక్షాబంధన్ కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలకు మూడు రోజులముందు జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ కార్యక్రమంలో ఏమాత్రం ఉత్సాహం లేదు. పోస్టర్ల విడుదలకు కూడా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ధర్మ ప్రచార పరిషత్ ప్రోగాం ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే హాజరయ్యారు. ఇన్నాళ్లు ఉత్సాహంగా పనిచేసిన ధర్మ ప్రచార మండలి సభ్యులు చివరి దశలో వచ్చి కార్యక్రమాల్లో కలిశారు. తమకు పిలుపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వీర్యం దిశగా... సాక్షాత్తు తిరుమల–తిరుపతి దేవస్థానాల ప్రధాన అధికారులకే ఈ కార్యక్రమంపై ఏమాత్రం శ్రద్ధ ఉన్నట్లు కనిపించడం లేదు. అలాగని అధికారులే అభిప్రాయం వ్యక్తం చేశారని అనుబంధ సంస్థల ప్రతినిధులు తెలుపుతున్నారు. కొన్నేళ్ల క్రితం జిల్లాలో ఏడు వేల ఆలయాల్లో మన గుడి కార్యక్రమం నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 224కు తగ్గింది. ఇందులో కూడా ముఖ్యమైన పూజలు కేవలం 20 దేవాలయాలలో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఐదారు రోజుల ముందే లారీల ద్వారా శ్రీవారి ప్రసాదంగా కలకండ, అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమలు, ముగింపు కార్యక్రమంగా శ్రావణపౌర్ణమి రోజు రక్షాబంధన్ నిర్వహించేందుకు శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించిన రక్షా కంకణాలను కూడా జిల్లాలోని దేవాలయాలకు సరఫరా చేసేవారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. తొలుత ప్రతి ఆలయానికి కేజీ కలకండ అందజేసేవారు. ఇప్పుడది 300 గ్రాములకు తగ్గింది. పసుపు కుంకుమలు 300 గ్రాముల చొప్పున అందజేసేవారు. అది ఇప్పుడు 200 గ్రాములకు తగ్గింది. చివరిరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా భక్తులు కట్టుకోవాలని అందజేయవలసిన రక్షా కంకణాలు ఇంతవరకు జిల్లా కేంద్రాలకు చేరలేదు. శుక్రవారం ఈ విషయంగా స్థానిక నిర్వాహకులు టీటీడీ అధికారులను విచారించగా, ఈ సంవత్సరం రక్షా కంకణాలు పంపడం లేదని స్పష్టం చేశారు. దీంతో స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రతినిధుల్లో పూర్తి నిరాశ ఆవహించింది. రక్షా బంధన్ రోజున రక్షలు లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర నిర్లక్ష్యం ఒకప్పుడు మనగుడి కార్యక్రమాన్ని టీటీడీ వారు తమ అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగాం ఎగ్జిక్యూటివ్, ధర్మ ప్రచార మండలిద్వారా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. కాలక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులకు ఏ కార్యక్రమాల గురించి కనీస సమాచారం ఉండకపోవడంతో వారు కూడా కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు. ఇక మన గుడి కార్యక్రమాన్ని నాలుగు రోజులపాటు నిర్వహించేందుకు ఒక్కో జిల్లాకు 1,79,400 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ జిల్లాలో ఎక్కడా ఈ కార్యక్రమానికి సంబం««ధించిన పోస్టర్లుగానీ, కార్యక్రమాలు జరుగుతున్న ఉనికిగానీ కనిపించడం లేదు. కార్యక్రమాలన్నీ ఒకరిద్దరితో పూర్తిగా మొక్కుబడిగా జరుగుతున్నాయి. దేవాదాయశాఖ, టీటీడీ తమ అనుబంధ సంస్థలన్నింటినీ ఒక చత్రం కిందకు తెచ్చి కార్యక్రమాలను పకడ్బందీగా రూపొందిస్తే ఆ సంస్థల గౌరవం ఇనుమడిస్తుంది. లేదా అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది. -
14న ‘మన గుడి’
రాజమహేంద్రవరం కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హిందూధర్మ ప్రచారపరిషత్తు, రాష్ట్ర దేవాదాయశాఖల సంయుక్త ఆధ్వర్యంలో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 14న ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఎంపిక చేసిన 12,500 ఆలయాల్లో మన గుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా ధర్మప్రచారమండలి అధ్యక్షుడు డాక్టర్ కర్?ర రామారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మండలానికి పది ఆలయాలు చొప్పున, మన జిల్లాలోని 60 మండలాల్లో ఎంపిక చేసిన 600 ఆలయాల్లో మన గుడి కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి ముందుగా 11, 12, 13 తేదీలలో మూడు రోజులపాటు ప్రజల భాగస్వామ్యంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 11వ తేదీన మంగళకైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 20 ప్రాంతాలలో నవ్యాంధ్రదాసరుల సంఘం కళాకారులు కైశికి పురాణాన్ని వివరిస్తారని తెలిపారు. 12న దేవాలయాలను శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందని, ఇందులో యువత భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నారు.13న హరినామసంకీర్తనలు, భజనలు నిర్వహిస్తామన్నారు. 14న తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చే పసుపు, కుంకుమ, అక్షతలు, కంకణాలను భక్తులకు వితరణ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రముఖ శివాలయాల్లో భక్తులకు శివారాధనకు బిల్వదళాలను అందజేయనున్నట్టు తెలిపారు. మన గుడి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రామారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ధర్మప్రచారమండలి కార్యదర్శి కాలెపు సతీష్, టీటీడీ ప్రొగ్రామ్ అసిస్టెంట్ ఓరుగంటి నరసింహయోగి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
యువ వికాసం.. ధర్మపరిరక్షణకు మనగుడి
నవతరానికి ఆలయాలు, సంస్కృతి మూలాలు, సంప్రదాయాలు, వాటి విశిష్టత తెలిసింది అంతంత మాత్రమే. ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల పవిత్రత, ప్రాధాన్యత, ఆవశ్యకతలను తెలియజేస్తూ యువతను గుడిమార్గం పట్టించే బృహత్తర కార్యక్రమంగా ‘మనగుడి’ని రూపకల్పన చేసింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖతో కలసి టీటీడీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తోంది. మూడోవిడతకు సన్నద్ధం: రాష్ట్రంలో చాలా ఆలయాలు ఆదరణకు నోచుకోవటం లేదు. శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన ఆలయాలమనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జాతికి ఆధారంగా నిలిచే గుడిసంస్కృతిని భావితరాలకు అందించే లక్ష్యంగా ‘మనగుడి’ని టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2012వ ఆగస్టు 2న వేంకటేశ్వరస్వామి వారి జన్మనక్షత్రమైన శ్రవణంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించింది. అదే సంవత్సరం నవంబరు 28న కార్తీకమాసంలో రెండోవిడత నిర్వహించి ఆలయాల అభివృద్ధితోపాటు జనంలో భక్తిచైతన్యాన్ని పెంపొందించింది. అదే స్ఫూర్తితో ఈ నెల 21న శ్రావణమాసంలోని శ్రవణా నక్షత్రంలో మూడోవిడతగా ‘మనగుడి’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. 20 వేల ఆలయాల్లో... హిందూ దేవాలయాల వైభవ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేందుకు వైష్ణవ, శైవ భేదం లేకుండా హిందూ ఆలయాల కేంద్రంగా టీటీడీ ఈ ‘మనగుడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని పల్లె స్థాయి నుంచి నగర స్థాయి వరకు మొత్తం 20 వేల ఆలయాలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో పురప్రజలు, భక్తులకు భాగస్వామ్యం కల్పించేందుకు వివిధ రూపాల్లో టీటీడీ భారీగా ప్రచారం కల్పిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఇప్పటికే కుంకుమార్చన, ఆలయాల ప్రాశస్త్యంపై పండితుల చేత ప్రవచనాలు, గోపూజ, సామూహిక వరలక్ష్మీవ్రతాలు చేశారు. ఇక 17న సత్యనారాయణ వ్రతాలు, 18,19 తేదీల్లో గిరిజన తాండాలు, దళితవాడలు, మత్స్యకారుల వీధుల్లో రథయాత్రలు, శోభాయాత్రలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. 20న ఆయా ఆలయాల్లో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తారు. వెంకన్న పాదాల వద్ద కంకణాలకు పూజలు మనగుడిలో పాల్గొనే భక్తులకు ప్రసాదంగా వితరణ చేసేందుకు ప్రత్యేకంగా టీటీడీ సారె ఏర్పాటు చేసింది. ప్రతి ఆలయానికి 250 గ్రాముల పసుపు, 250 గ్రాముల కుంకుమ, 100 గ్రాముల అక్షింతలు, కిలో కలకండ, 1000 కంకణాలు పంపిణీ చేస్తారు. ఈ పూజాసామగ్రిని గర్భాలయంలోని మూలమూర్తి పాదాల వద్ద ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తర్వాత ఈ సారెను రాష్ట్రవ్యాప్తంగా మనగుడి కార్యక్రమం నిర్వహించే ఆలయాలకు తరలిస్తారు. ఇందులోనే హనుమాన్ చాలీసా, సకల దేవతా పూజావిధానం, రామాయణం, వేటూరి ప్రభాకర శాస్త్రి, ఇతర సాహితీ వేత్తల కృతులు, సంకీర్తనలతో కూడిన 10 రకాల పుస్తక ్రపసాదం, శ్రీవారి సంకీర్తనా సీడీలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఆలయాలకు అలంకరించే తెర కూడా అందజేస్తారు. శ్రీవారి జన్మనక్షత్రంలో మనగుడిలా... శ్రావణ పౌర్ణమి 21వ తేది బుధవారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు అభిషేకం, అర్చనలు, ఇతర అనుబంధ పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో సామూహిక పారాయణం నిర్వహిస్తారు. 11 గంటలకు ప్రసాద వితరణ చేస్తారు. సాయకాలం 4 గంటలకు పురాణ ప్రవచనం, 6 గంటలకు హరికథా కార్యక్రమం నిర్వహించి చివరగా మనగుడి ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆయా ఆలయాల వద్ద స్థానిక దాతల సహకారంతో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. - సహదేవ కేతారి, సాక్షి,తిరుమల ఫొటో: కె.మోహన్‌కృష్ణ