యువ వికాసం.. ధర్మపరిరక్షణకు మనగుడి
నవతరానికి ఆలయాలు, సంస్కృతి మూలాలు, సంప్రదాయాలు, వాటి విశిష్టత తెలిసింది అంతంత మాత్రమే. ఇలాంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల పవిత్రత, ప్రాధాన్యత, ఆవశ్యకతలను తెలియజేస్తూ యువతను గుడిమార్గం పట్టించే బృహత్తర కార్యక్రమంగా ‘మనగుడి’ని రూపకల్పన చేసింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖతో కలసి టీటీడీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తోంది.
మూడోవిడతకు సన్నద్ధం: రాష్ట్రంలో చాలా ఆలయాలు ఆదరణకు నోచుకోవటం లేదు. శతాబ్దాల చరిత్ర ఉన్న పురాతన ఆలయాలమనుగడ ప్రశ్నార్థకంగా మారింది. జాతికి ఆధారంగా నిలిచే గుడిసంస్కృతిని భావితరాలకు అందించే లక్ష్యంగా ‘మనగుడి’ని టీటీడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2012వ ఆగస్టు 2న వేంకటేశ్వరస్వామి వారి జన్మనక్షత్రమైన శ్రవణంలో ఈ మహోత్సవాన్ని నిర్వహించింది. అదే సంవత్సరం నవంబరు 28న కార్తీకమాసంలో రెండోవిడత నిర్వహించి ఆలయాల అభివృద్ధితోపాటు జనంలో భక్తిచైతన్యాన్ని పెంపొందించింది. అదే స్ఫూర్తితో ఈ నెల 21న శ్రావణమాసంలోని శ్రవణా నక్షత్రంలో మూడోవిడతగా ‘మనగుడి’ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది.
20 వేల ఆలయాల్లో... హిందూ దేవాలయాల వైభవ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేందుకు వైష్ణవ, శైవ భేదం లేకుండా హిందూ ఆలయాల కేంద్రంగా టీటీడీ ఈ ‘మనగుడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని పల్లె స్థాయి నుంచి నగర స్థాయి వరకు మొత్తం 20 వేల ఆలయాలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో పురప్రజలు, భక్తులకు భాగస్వామ్యం కల్పించేందుకు వివిధ రూపాల్లో టీటీడీ భారీగా ప్రచారం కల్పిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఇప్పటికే కుంకుమార్చన, ఆలయాల ప్రాశస్త్యంపై పండితుల చేత ప్రవచనాలు, గోపూజ, సామూహిక వరలక్ష్మీవ్రతాలు చేశారు. ఇక 17న సత్యనారాయణ వ్రతాలు, 18,19 తేదీల్లో గిరిజన తాండాలు, దళితవాడలు, మత్స్యకారుల వీధుల్లో రథయాత్రలు, శోభాయాత్రలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహించనున్నారు. 20న ఆయా ఆలయాల్లో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తారు.
వెంకన్న పాదాల వద్ద కంకణాలకు పూజలు
మనగుడిలో పాల్గొనే భక్తులకు ప్రసాదంగా వితరణ చేసేందుకు ప్రత్యేకంగా టీటీడీ సారె ఏర్పాటు చేసింది. ప్రతి ఆలయానికి 250 గ్రాముల పసుపు, 250 గ్రాముల కుంకుమ, 100 గ్రాముల అక్షింతలు, కిలో కలకండ, 1000 కంకణాలు పంపిణీ చేస్తారు. ఈ పూజాసామగ్రిని గర్భాలయంలోని మూలమూర్తి పాదాల వద్ద ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. తర్వాత ఈ సారెను రాష్ట్రవ్యాప్తంగా మనగుడి కార్యక్రమం నిర్వహించే ఆలయాలకు తరలిస్తారు. ఇందులోనే హనుమాన్ చాలీసా, సకల దేవతా పూజావిధానం, రామాయణం, వేటూరి ప్రభాకర శాస్త్రి, ఇతర సాహితీ వేత్తల కృతులు, సంకీర్తనలతో కూడిన 10 రకాల పుస్తక ్రపసాదం, శ్రీవారి సంకీర్తనా సీడీలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఆలయాలకు అలంకరించే తెర కూడా అందజేస్తారు.
శ్రీవారి జన్మనక్షత్రంలో మనగుడిలా...
శ్రావణ పౌర్ణమి 21వ తేది బుధవారం ఉదయం 5 నుంచి 10 గంటల వరకు అభిషేకం, అర్చనలు, ఇతర అనుబంధ పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో సామూహిక పారాయణం నిర్వహిస్తారు. 11 గంటలకు ప్రసాద వితరణ చేస్తారు. సాయకాలం 4 గంటలకు పురాణ ప్రవచనం, 6 గంటలకు హరికథా కార్యక్రమం నిర్వహించి చివరగా మనగుడి ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆయా ఆలయాల వద్ద స్థానిక దాతల సహకారంతో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
- సహదేవ కేతారి, సాక్షి,తిరుమల
ఫొటో: కె.మోహన్‌కృష్ణ