మనగుడి లోగో
కడప కల్చరల్ : తిరుమల–తిరుపతి దేవస్థానాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న మనగుడి కార్యక్రమం మొక్కుబడిగా మారింది. నాలుగు రోజులపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మన గుడి పేరిట ఆలయ శుద్ధి, వరలక్ష్మి వ్రతాలు, ధార్మిక కార్యక్రమాలు, శ్రావణ పౌర్ణమి సందర్భంగా నాల్గవ రోజు రక్షాబంధన్ కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలకు మూడు రోజులముందు జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ కార్యక్రమంలో ఏమాత్రం ఉత్సాహం లేదు. పోస్టర్ల విడుదలకు కూడా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ధర్మ ప్రచార పరిషత్ ప్రోగాం ఎగ్జిక్యూటివ్‌లు మాత్రమే హాజరయ్యారు. ఇన్నాళ్లు ఉత్సాహంగా పనిచేసిన ధర్మ ప్రచార మండలి సభ్యులు చివరి దశలో వచ్చి కార్యక్రమాల్లో కలిశారు. తమకు పిలుపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్వీర్యం దిశగా...
సాక్షాత్తు తిరుమల–తిరుపతి దేవస్థానాల ప్రధాన అధికారులకే ఈ కార్యక్రమంపై ఏమాత్రం శ్రద్ధ ఉన్నట్లు కనిపించడం లేదు. అలాగని అధికారులే అభిప్రాయం వ్యక్తం చేశారని అనుబంధ సంస్థల ప్రతినిధులు తెలుపుతున్నారు. కొన్నేళ్ల క్రితం జిల్లాలో ఏడు వేల ఆలయాల్లో మన గుడి కార్యక్రమం నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 224కు తగ్గింది. ఇందులో కూడా ముఖ్యమైన పూజలు కేవలం 20 దేవాలయాలలో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఐదారు రోజుల ముందే లారీల ద్వారా శ్రీవారి ప్రసాదంగా కలకండ, అమ్మవారి ప్రసాదంగా పసుపు కుంకుమలు, ముగింపు కార్యక్రమంగా శ్రావణపౌర్ణమి రోజు రక్షాబంధన్ నిర్వహించేందుకు శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించిన రక్షా కంకణాలను కూడా జిల్లాలోని దేవాలయాలకు సరఫరా చేసేవారు. ఈ సంవత్సరం వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది. తొలుత ప్రతి ఆలయానికి కేజీ కలకండ అందజేసేవారు. ఇప్పుడది 300 గ్రాములకు తగ్గింది. పసుపు కుంకుమలు 300 గ్రాముల చొప్పున అందజేసేవారు. అది ఇప్పుడు 200 గ్రాములకు తగ్గింది. చివరిరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా భక్తులు కట్టుకోవాలని అందజేయవలసిన రక్షా కంకణాలు ఇంతవరకు జిల్లా కేంద్రాలకు చేరలేదు. శుక్రవారం ఈ విషయంగా స్థానిక నిర్వాహకులు టీటీడీ అధికారులను విచారించగా, ఈ సంవత్సరం రక్షా కంకణాలు పంపడం లేదని స్పష్టం చేశారు. దీంతో స్థానికంగా కార్యక్రమాలు నిర్వహించనున్న ప్రతినిధుల్లో పూర్తి నిరాశ ఆవహించింది. రక్షా బంధన్ రోజున రక్షలు లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తీవ్ర నిర్లక్ష్యం
ఒకప్పుడు మనగుడి కార్యక్రమాన్ని టీటీడీ వారు తమ అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగాం ఎగ్జిక్యూటివ్, ధర్మ ప్రచార మండలిద్వారా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. కాలక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులకు ఏ కార్యక్రమాల గురించి కనీస సమాచారం ఉండకపోవడంతో వారు కూడా కార్యక్రమాలకు హాజరు కావడం మానేశారు. ఇక మన గుడి కార్యక్రమాన్ని నాలుగు రోజులపాటు నిర్వహించేందుకు ఒక్కో జిల్లాకు 1,79,400 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ జిల్లాలో ఎక్కడా ఈ కార్యక్రమానికి సంబం««ధించిన పోస్టర్లుగానీ, కార్యక్రమాలు జరుగుతున్న ఉనికిగానీ కనిపించడం లేదు. కార్యక్రమాలన్నీ ఒకరిద్దరితో పూర్తిగా మొక్కుబడిగా జరుగుతున్నాయి. దేవాదాయశాఖ, టీటీడీ తమ అనుబంధ సంస్థలన్నింటినీ ఒక చత్రం కిందకు తెచ్చి కార్యక్రమాలను పకడ్బందీగా రూపొందిస్తే ఆ సంస్థల గౌరవం ఇనుమడిస్తుంది. లేదా అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment