1999 గ్రూప్–2 మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్–2 మెరిట్ జాబితాను(ఏపీపీఎస్సీ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. న్యాయస్థానాల్లో వివాదాలు... సుదీర్ఘకాలం కోర్టు విచారణలు... ఉన్నత న్యాయస్థానం తీర్పు అనంతరం 17 ఏళ్ల తరువాత ఈ ఫలితాలను విడుదల చేసింది. 1,075 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 296 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఈ మెరిట్ జాబితాను వెల్లడిస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారమే ఈ ఫలితాలను విడుదల చేయాల్సి ఉన్నా కమిషన్ పరిశీలన చేయాల్సి ఉండడంతో నిలిపేశారు. చివరకు శుక్రవారం రాత్రి జాబితాను విడుదల చేశారు.
ఈ మెరిట్ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా 150 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 40 మంది పోస్టులు కోల్పోతున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం ఉద్యోగాలు పొందిన వారిలో ఇంతకు ముందు పోస్టులు అలాట్ కానివారు వారం రోజుల్లో తమ ఆప్షన్లకు సంబంధించి సుముఖతను వ్యక్తపరుస్తూ రాతపూర్వక పత్రాలను ఏపీపీఎస్సీకి సమర్పించాల్సి ఉంటుంది. మెరిట్ జాబితాను అభ్యర్థుల మార్కులతో సహా ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లోగా ఏపీపీఎస్సీని రాతపూర్వకంగా సంప్రదించాల్సి ఉంటుంది. 17 ఏళ్ల క్రితం వెలువడిన నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షలు, మెరిట్ జాబితాలు, ఆ ప్రకారం నియామకాలు పూర్తయిన అనంతరం ఇదంతా నిబంధనల ప్రకారం జరగలేదని కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు. దాంతో ఆ నోటిఫికేషన్ పై వివాదం ఏర్పడి.. కోర్టులకు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
సూపర్ న్యూమరరీ పోస్టులే పరిష్కారం: తాజా జాబితాతో కొందరు ఉద్యోగాలు కోల్పోతుండడం, మరికొందరు ఉన్నతస్థానాల్లో నుంచి కిందిస్థాయికి రావాల్సి ఉండడం, జోన్లలో మార్పులు వంటి చిక్కుముడులు ఏర్పడనున్నాయి. 1999 గ్రూప్–2 ఉమ్మడి ఏపీకి సంబంధించినది కనుక అప్పట్లోని ఆరు జోన్లను దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సీ తాజా జాబితాను ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయింది. తాజా జాబితా ప్రకారం ఏపీలో ఉద్యోగం చేస్తున్న వారు తెలంగాణకు, తెలంగాణలోని వారు ఏపీకి జోన్ల వారీగా మారే పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుత జాబితా ప్రకారం గతంలో పోస్టులు అలాట్‌కాని వారిని విల్లింగ్‌నెస్ అడిగామని, వారినుంచి వచ్చే రాతపూర్వక లేఖలను అనుసరించి రెండు రాష్ట్రాలకు తుది జాబితాలను వేర్వేరుగా రూపొందించి అప్పగిస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి.
లేఖలు ఎంతమంది నుంచి వస్తాయో చూశాక మిగిలిపోయే పోస్టులకు మళ్లీ జాబితా రూపొందించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. రూల్ 7 ప్రకారం (లెఫ్ట్ ఓవర్ మెరిట్) జాబితాలోని తరువాతి స్థానాల వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ ప్రకారం ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో కొందరికి మళ్లీ అవకాశం రావచ్చని పేర్కొన్నారు. ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారన్న దానిపై అప్పటికి కానీ స్పష్టత రాదని వివరించారు. ఆ తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తుది జాబితాలను ఏపీపీఎస్సీ అప్పగిస్తుందని చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయే వారికి, పదోన్నతుల ద్వారా పైస్థాయి పోస్టుల్లో ఉండి ప్రస్తుతం కిందిస్థాయి పోస్టుకు ఎంపికైన వారికి న్యాయం జరగాలంటే ప్రభుత్వాలు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.