
20 నుంచి అక్రమ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు
నెల్లూరు (టౌన్): జిల్లాలో అక్రమంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రత్యేక తనిఖీలను నిర్వహించనున్నట్లు రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. రవాణా శాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న మోటార్ వాహనాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నెల్లూరు (టౌన్): జిల్లాలో అక్రమంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ప్రత్యేక తనిఖీలను నిర్వహించనున్నట్లు రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. రవాణా శాఖ కార్యాలయంలో జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో పనిచేస్తున్న మోటార్ వాహనాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పన్ను చెల్లించని 10 వేల వాహనాలకు షోకాజ్ నోటీసులను జారీ చేయనున్నట్లు చెప్పారు. జాతీయ రహదారిపై వెంకటాచలం, కావలి ప్రాంతాల్లో నెలకు రెండుసార్లు రాత్రి వేళ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ క్యారేజీలు, ఓవర్‌లోడ్ వాహనాలు, డ్రంకెన్ డ్రైవ్‌పై తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్రైమాసిక పన్ను చెల్లించని వాహనాలపై వారంలో రెండు పట్టణాల్లో బృందాలుగా తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరుతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఉదయగిరి, తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేస్తామని చెప్పారు. ఫైనాన్స్ సీజ్ చేసిన వాహనాలకు కూడా త్రైమాసిక పన్ను చెల్లించాలని ఇప్పటికే నోటీసులను జారీ చేసినట్లు చెప్పారు. పన్ను చెల్లించని వాహనదారులు తక్షణమే ఆయా కార్యాలయాల్లో పన్ను చెల్లించాలని, లేని పక్షంలో రెండింతల అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. మోటార్ వాహనాల అధికారులు సీతారామిరెడ్డి, ఆదినారాయణ, బాలమురళీకృష్ణ, మురళీమోహన్, రామకృష్ణారెడ్డి, జయప్రకాష్, జకీర్, మాధవరావు, అసిస్టెంట్ మోటార్ వాహనాల అధికారులు కరుణాకర్, పూర్ణచంద్రరావు, రవికుమార్, ప్రభాకర్, ఏఓలు విజయ్‌కుమార్, సాయి, కిషోర్ పాల్గొన్నారు.