రాష్ట్రం నుంచి హజ్‌యాత్రకు 2వేల మంది
నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం హజ్‌యాత్రకు 2వేల మంది ఎంపిక చేసిందని ఏపీ హజ్‌కమిటీ చైర్మన్ అహమ్మద్ హుసేన్ చెప్పారు. స్థానిక నేషనల్ పీజీ కాలేజీలో ప్రభుత్వం ఎంపిక చేసిన హజ్‌యాత్రలకు ఆదివారం నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 20 నుంచి 27వ తేదీ మధ్యలో 2వేల మంది హజ్‌కు బయల్దేరుతారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి మన రాష్ట్రంలోని విజయవాడ, కడప నుండే హజ్‌యాత్రలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ, కడపలలో హజ్‌హౌస్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేశారని చెప్పారు. నేషనల్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఇంతియాజ్‌అహమ్మద్ మాట్లాడుతూ.. హజ్‌యాత్రలకు వెళ్లేవారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. కర్నూలు నుంచి వచ్చిన అలిజనాబ్ హఫీజ్ అబ్దుల్‌మజీద్, ఆఫీసుజుబేర్ హజ్‌యాత్ర ప్రారంభం నుండి చివరి వరకు చేయాల్సిన ప్రార్థనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు ముఫ్తీ మహమ్మద్‌రఫీ, జమాతే అమీర్‌ఖరీమ్, నేషనల్ విద్యాసంస్థల ఏఓ రఫీఅహమ్మద్, లెక్చరర్లు అసదుల్లా, షబ్బీర్‌హుసేన్, జమాల్, ఆరీఫ్‌బాషా, ఫజిలుల్లాలు పాల్గొన్నారు.