215 కోట్లకు ‘ముఖ్య’నేత టెండర్‌ | 215 crores pennar South canal Tender to TDP main leader | Sakshi
Sakshi News home page

215 కోట్లకు ‘ముఖ్య’నేత టెండర్‌

Published Fri, Feb 10 2017 1:58 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

215 కోట్లకు ‘ముఖ్య’నేత టెండర్‌ - Sakshi

215 కోట్లకు ‘ముఖ్య’నేత టెండర్‌

మధ్య పెన్నార్‌ దక్షిణ కాలువ ఆధునికీకరణ టెండర్లలో గోల్‌మాల్‌
టీడీపీ ఎంపీ ఒత్తిడితో పాత కాంట్రాక్టర్లపై వేటు.. అంచనాలు భారీగా పెంపు
టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ.. రాజ్యసభ సభ్యుడి సంస్థకే పనులు దక్కేలా నిబంధనలు


రూ. 101 కోట్లు
అంచనా వ్యయం...

509.15 కోట్లు
పెంచిన వ్యయం...


సాక్షి, అమరావతి: మధ్య పెన్నార్‌ దక్షిణ కాలువ ఆధునికీకరణ పనుల్లో ఇద్దరు ఎంపీలతో కలిసి రూ.215 కోట్లు కొట్టేయడానికి ‘ముఖ్య’నేత పావులు కదుపుతు న్నారు. ‘ముఖ్య’నేత ఆదేశం మేరకు ఆయన కోటరీలోని రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి ఈ నెల 6న అధికారులు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. షెడ్యూళ్ల దాఖలు గడువు ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. 21న టెక్నికల్‌ బిడ్‌ తెరుస్తారు. 25న ప్రైస్‌ బిడ్‌ను తెరిచి రాజ్యసభ సభ్యుడి సంస్థలకు పనులు కట్టబెట్టడమే మిగిలి ఉంది. అనంతపురం జిల్లాలో మధ్య పెన్నార్‌ ప్రాజెక్టు దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులను 2007లో ప్రభుత్వం చేపట్టింది. ఇందులో 0 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకూ (43వ ప్యాకేజీ) పనులను రూ.66.43 కోట్లకు ఈసీఐ–బీజేసీఎల్‌(జేవీ).. 40 కి.మీ. నుంచి 84 కి.మీ. వరకూ(44వ ప్యాకేజీ) పనులను రూ.50.45 కోట్లకు జీహెచ్‌ఆర్‌ఏ–కేఆర్‌సీసీ(జేవీ) చేజిక్కించుకున్నాయి. 43వ ప్యాకేజీలో రూ.8.15 కోట్లు, 44వ ప్యాకేజీలో రూ.7.07 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. 2010 తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపీ కన్ను ఈ పనులపై పడింది. పనులు చేయడం లేదనే సాకు చూపి పాత కాంట్రాక్టర్లపై వేటు వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో 43, 44 ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేశారు.  

వ్యూహాత్మకంగా అంచనా వ్యయం పెంపు
43వ ప్యాకేజీ కింద రూ.58.28 కోట్లు, 44వ ప్యాకేజీ కింద 43.38 కోట్లు వెరసి రూ.101.66 కోట్లు ఖర్చు చేస్తే ఆధు నికీకరణ పనులు పూర్తవుతాయి. కానీ. వీటి అంచనా వ్య యాన్ని భారీగా పెంచాలంటూ ‘ముఖ్య’నేతపై ఎంపీ ఒత్తి డి తెచ్చారు.కావాల్సిన వారికి కట్టబెట్టి, కమీ షన్లు దండు కునేలా వ్యూహం రచించారు. ఈ క్రమంలోనే రూ.101.66 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని రూ.509.15 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌ 20న ఉత్తర్వులు ఇచ్చింది.  భూసేకరణ మినహా మిగతా పనుల వ్యయం రూ.421.87 కోట్లు. ఈ పెంపునకు ఆర్థిక శాఖ ససేమిరా అనడంతో కొత్త వ్యూహానికి పదును పెట్టారు.

తిరకాసు నిబంధనలు
మధ్య పెన్నార్‌ దక్షిణ కాలువ ఆధునికీకరణ పనుల టెం డర్లలో పెట్టిన నిబంధనలపై జలవనరుల శాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధనలు ఇవీ..


టెండర్లలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా ఏర్పడి షెడ్యూల్‌ దాఖలు చేయడానికి వీల్లేదు.  హా గత ఐదేళ్లలో బ్యాంకులకు రుణాల చెల్లింపులో కార్పొరేట్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌(అప్పు ను కట్టలేక అప్పు+వడ్డీని కలిపి కొత్తగా రుణం తీసుకు న్నట్లు చూపడం), స్ట్రాటజిక్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌(అప్పు కట్టకపోవడం వల్ల బ్యాంకులే కాంట్రాక్టు సంస్థలో వాటాలు తీసుకోవడం) వంటి వాటిని అమలు చేసిన సంస్థలు టెండర్‌లో పాల్గొనవచ్చు. హా 2006–07 నుంచి 2015–16 వరకూ ఏదో ఒక ఏడాది కనీసం 3,40,976 క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 96,406 క్యూబిక్‌ మీటర్ల గట్ల నిర్మాణ పనులు, 1,50,992 చ.మీ.ల కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు(పేవర్‌ అనే యంత్రంతో చేసినవి), 1,951 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు, 13,052 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేసిన సంస్థలే అర్హమైనవి. హా ఏడాదికి కనీసం రూ.50 కోట్ల విలువైన పనులు చేసి ఉండాలి. బ్యాంకుల్లో రూ.17 కోట్ల నగదు నిల్వ ఉండాలి. హా గత పదేళ్లలో ఒక ఏడాది కనిష్టంగా రూ.33.90 కోట్ల విలువైన కాలువ లైనింగ్‌ పనులు చేసి ఉండాలి.

నిబంధనలు ఒక్కరికే అనుకూలం
రాష్ట్రంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పనులను జాయింట్‌ వెంచర్‌ సంస్థలే చేస్తున్నాయి. ఇటీవల పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ పనులను బావర్‌–ఎల్‌అంట్‌టీ జియో(జేవీ) అనే జాయింట్‌ వెంచర్‌కు సబ్‌ కాంట్రాక్టు కింద కట్టబెట్టారు. కానీ, మధ్య పెన్నార్‌ ఆధునికీకరణ పనులకు జాయింట్‌ వెంచర్‌ సంస్థలకు అర్హత లేదన్నారు. ఇటీవల నిర్మాణ రంగం కుదేలవడం వల్ల పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్థలు కార్పొరేట్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌(సీడీఆర్‌), స్ట్రాటజిక్‌ డెట్‌ రీస్ట్రక్చరింగ్‌(ఎస్‌డీఆర్‌)లను అమలు చేశాయి. కానీ, సీడీఆర్, ఎస్‌డీఆర్‌లను అమలు చేసిన సంస్థలను మధ్య పెన్నార్‌ ఆధునికీకరణ పనుల టెండర్లలో పాల్గొనడానికి అనర్హమైనవని నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే ‘ముఖ్య’నేతకు సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడి సంస్థకు మాత్రమే పనులు దక్కేలా టెండర్‌ నిబంధనలు రూపొందించినట్లు స్పష్టమవుతోంది.

అంచనాల పెంపులో ఆంతర్యమిదే!
రూ.58.28 కోట్లతో పూర్తయ్యే 43వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.237.23 కోట్లకు, రూ.43.38 కోట్లతో పూర్తయ్యే 44వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.184.64 కోట్లకు పెంచేశారు. గతంలో పోల్చితే స్టీల్, సిమెంట్‌ ధరలు గణనీయంగా తగ్గాయి. డీజిల్, పెట్రోల్‌ ధరల్లో పెద్దగా మార్పు లేదు. ఇసుక ఉచితంగా లభిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే అంచనా వ్యయంలో ఏమాత్రం మార్పు ఉండకూడదు. కానీ, రూ.101.66 కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.509.15 కోట్లతో టెండర్లు పిలవడం గమనార్హం. రాజ్యసభ సభ్యుడి సంస్థకు పనులు దక్కాక ‘ముఖ్య’నేత, టీడీపీ ఎంపీలు కలిపి రూ.215 కోట్లకుపైగా పర్శంటేజీల రూపంలో పంచుకోనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement